నిజామాబాద్ అర్బన్ ​సెగ్మెంట్​పై కాంగ్రెస్ ఫోకస్​​

  •      బరిలో సీనియర్ ​లీడర్ ​షబ్బీర్ ​అలీ
  •      జిల్లాలో మైనార్టీ ఓట్లపై ప్రభావం చూపేలా పావులు
  •     కామారెడ్డికి బదులు అర్బన్ లో పోటీ చేస్తున్న మైనార్టీ నేత

నిజామాబాద్, వెలుగు :  నిజామాబాద్​ అర్బన్​ నియోజకవర్గం విషయంలో కాంగ్రెస్​అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీలో మైనార్టీ వర్గానికి చెందిన సీనియర్​లీడర్​షబ్బీర్​అలీకి అర్బన్​ టికెట్​ కేటాయించింది.అర్బన్​ సెగ్మెంట్​లో అభ్యర్థి గెలుపోటములను డిసైడ్​ చేసే స్థాయిలో మైనార్టీ ఓట్లు ఉన్న నేపథ్యంలో షబ్బీర్​ని పోటీ చేయించి, ఆ స్థానాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే అర్బన్​టికెట్​ఆశించిన నేతలతో పాటు, ముఖ్యమైన లీడర్లకు షబ్బీర్​ గెలుపు కోసం పనిచేయాలని ఆదేశించింది.

ఢిల్లీ స్థాయిలో కసరత్తు 

నిజామాబాద్​అర్బన్​ సెగ్మెంట్​ కంగ్రెస్​కు కంచుకోట. 1989, 1999, 2004 ఎన్నికల్లో గెలిచిన డి.శ్రీనివాస్​ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. సీఎం పీఠం వరించకపోయినా ఆ స్థాయి నేతగా గుర్తింపు పొందారు. 2009 ఎలక్షన్​లో బీజేపీ గెలవగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2014, 18 ఎన్నికల్లో బీఆర్ఎస్​ గెలిచింది. హ్యాట్రిక్​ కోసం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్​ను కట్టడి చేయడంతో పాటు తమ కంచుకోటలో తిరిగి జెండా పాతాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది.

అర్బన్​ నుంచి బరిలో నిలిచేందుకు 13 మంది లీడర్లు అర్జీ పెట్టుకోగా, ప్రతి ఒక్కరి గురించి క్షుణ్నంగా స్టడీ చేసింది. సెగ్మెంట్​లో ఓటు బ్యాంక్​ అధికంగా ఉన్న సామాజిక వర్గాల లీడర్లు టీపీసీసీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​ మహేశ్​గౌడ్, మాజీ మేయర్​ డి.సంజయ్, మైనార్టీ నేత తాహెర్​ పేర్లను ఫైనల్​చేసి ఢిల్లీకి పంపారు. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన బలమైన లీడర్ అయితే విజయ అవకాశాలు ఉంటాయని సర్వే రిపోర్టులు సూచించిన నేపథ్యంలో అనూహ్యంగా షబ్బీర్​అలీకు టికెట్​ కేటాయించారు.

ఆచితూచి అడుగులు..

కామారెడ్డికి చెందిన షబ్బీర్​ అలీని అర్బన్​కు పంపే విషయంలో హైకమాండ్​ ఆచితూచిగా అడుగులు వేసింది. సీనియర్ ​లీడర్లు టికెట్ ​ఆశించిన నేపథ్యంలో షబ్బీర్ ​రాకను వారు ఎలా స్వీకరిస్తారోననే డౌట్​తో జాగ్రత్తలు వ్యవహరించి సెకెండ్​లిస్ట్​లోనూ అభ్యర్థిని ఖరారు చేయలేదు. జిల్లాకు చెందిన సీనియర్​ నేత, మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి ద్వారా అర్బన్​ టికెట్ ​రేసులో ఉన్న ఆశావహుల అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది.

డి.శ్రీనివాస్​ తర్వాత ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​లో ముఖ్య నేత అయిన షబ్బీర్ ​అలీ పట్ల వారంతా సానుకూలత వ్యక్తం చేశారు. తర్వాత ఆదివారం షబ్బీర్ అలీ కూడా మెదక్ ​జిల్లా రామాయంపేట సమీపంలోని తన ఫాంహౌస్​లో నిజామాబాద్​ ముఖ్య లీడర్లతో సమావేశమయ్యారు.  అర్బన్​అభ్యర్థిగా షబ్బీర్​ను ప్రతిపాదిస్తూ నగర నేతలు సోమవారం నామినేషన్​ దాఖలు చేశారు. ఈ నెల 9న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డితో వచ్చి షబ్బీర్ ​అలీ నామినేషన్​ వేయనున్నారు.