వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

హైదరాబాద్ : డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ మూడేళ్ల పాప చనిపోయిందంటూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు బాధితులు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారాంలో జరిగింది. 

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 

మూడేళ్ల అక్షిత అనే చిన్నారి జ్వరంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు చందానగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఆస్పత్రి సిబ్బంది.. బాలికకు బ్లడ్ తక్కువగా ఉందని చెప్పి.. బ్లడ్ ఎక్కించారు. 

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారి ఉన్నట్టుండి చనిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే వైద్యం వికటించి.. అక్షిత చనిపోయిందని ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతదేహంతో హాస్పిటల్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. విషయం తెలియగానే పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి యాజమాన్యం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.