కలెక్టర్ సస్పెండ్​​ చేశారని .. ఇన్​చార్జి సీడీపీవో ఆత్మహత్యాయత్నం

కలెక్టర్ సస్పెండ్​​ చేశారని .. ఇన్​చార్జి సీడీపీవో ఆత్మహత్యాయత్నం
  • అంగన్​వాడీ టీచర్ల ఫిర్యాదుతో విచారణ జరిపి చర్యలు
  • ములుగు జిల్లా వెంకటాపురం సీహెచ్ సీలో చికిత్స

వెంకటాపురం, వెలుగు: కలెక్టర్​ సస్పెండ్​ చేయడంతో మనస్తాపం చెంది ములుగు జిల్లా వెంకటాపురం ఐసీడీఎస్​ ప్రాజెక్ట్  ఇన్​చార్జి సీడీపీవో ధనలక్ష్మి  ఆత్మహత్యాయత్నం చేశారు. వెంకటాపురం  ప్రాజెక్ట్  పరిధిలోని కొందరు అంగన్​వాడీ టీచర్లు సీడీపీవో తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తోందని శనివారం కలెక్టర్  దివాకరకు వినతిపత్రం అందచేశారు. స్పందించిన కలెక్టర్  ధనలక్ష్మిని సస్పెన్షన్​ చేయడంతో పాటు విచారణ కమిటీని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

మంగళవారం ఉదయం చాకుతో ఎడమచేతి మణికట్టు కింద గాయం చేసుకోగా, గమనించిన డ్రైవర్ ఆమెను వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధనలక్ష్మికి ప్రాణహాని లేదని, ఎడమ చేయి మణికట్టు కింద చర్మం తెగడంతో రక్తస్రావం జరిగినట్లు గుర్తించామని, చికిత్స చేసి అబ్జర్వేషన్​లో ఉంచామరి డాక్టర్  సూర్య చెప్పారు.

తప్పుడు నివేదికలు ఇచ్చి సస్పెండ్​ చేయించారు..

ములుగు డీడబ్ల్యూవో అంగన్​వాడీ టీచర్లతో కలిసి తప్పుడు నివేదికలు ఇప్పించి తనను సస్పెండ్  చేయించారని సీడీపీవో ధనలక్ష్మి విలపించారు. చాలా కాలంగా సూపర్వైజర్ గా పని చేస్తున్న ఓ ఉద్యోగి కొంతమంది అంగన్​వాడీ టీచర్లతో సఖ్యతగా ఉంటూ తన ఆదేశాలు పాటించకుండా సహాయ నిరాకరణ చేస్తూ, ఉన్నతాధికారుల ముందు దోషిగా నిలబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్లను తనిఖీ చేయడం, టీచర్ల పనితీరును ప్రశ్నించడంతోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు.

 కొందరు టీచర్లు తనకు చెప్పకుండానే సెలవులు తీసుకున్నారని, సెలవుల్లోనూ బిల్స్  చేసుకోవడంతో ఇదేమని ప్రశ్నిస్తే డీడబ్ల్యూవోకు చెప్పామని సమాధానం ఇస్తున్నారన్నారు. ఈ విషయాన్ని రాతపూర్వకంగా డీడబ్ల్యూవోకు ఫిర్యాదు చేయడంతో తనపై కక్ష సాధింపు చేపట్టారని వాపోయారు. పోషణ అభియాన్, ఎన్ఎస్టీఎస్, పోషణ్  ట్రేకర్  లాగిన్ ఇవ్వలేదని తెలిపారు.