రామగుండం బల్దియాలో ఇన్‌‌‌‌చార్జి పాలన ఎన్ని రోజులు..?

రామగుండం బల్దియాలో ఇన్‌‌‌‌చార్జి పాలన ఎన్ని రోజులు..?
  • ఇప్పటికే మూడుసార్లు సెలవు పొడిగించుకున్న కమిషనర్​
  • ఒత్తిళ్లతోనే సెలవులో వెళ్లినట్లు ప్రచారం 
  • అడిషనల్​కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు బల్దియా బాధ్యతలు

గోదావరిఖని, వెలుగు: రామగుండం బల్దియాలో ఇన్‌‌‌‌చార్జి కమిషనర్‌‌‌‌‌‌‌‌ పాలన కొనసాగుతోంది. పూర్తిస్థాయి కమిషనర్‌‌‌‌‌‌‌‌ సీహెచ్​శ్రీకాంత్​ గత నెలలో సెలవులో వెళ్లగా ఇప్పటివరకు డ్యూటీలో జాయిన్ కాలేదు. మరోవైపు తన సెలవులను మూడుసార్లు పొడిగించుకున్నారు. దీంతో పెద్ద కార్పొరేషన్​ అయిన రామగుండంలో పాలనకు ఇబ్బంది కలగకుండా అడిషనల్​కలెక్టర్​ అరుణశ్రీని ఫుల్​అడిషనల్​చార్జిగా(ఎఫ్​ఏసీ) నియమించారు. మరోవైపు మూడు నెలల్లో పాలకవర్గ పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో ఇక ఇన్‌‌‌‌చార్జి ఆఫీసర్​పాలనే కొనసాగుతుందన్న ప్రచారం నడుస్తోంది. 

ఒత్తిళ్లే కారణమా..? 

రామగుండం కార్పొరేషన్‌‌‌‌లో వివిధ రకాల ఒత్తిళ్ల వల్లే కమిషనర్​ పనిచేయలేక పోతున్నారు. నిధుల కొరత, బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఆందోళన, గడువులోగా పనులు పూర్తిచేయాలని ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, తాము చెప్పినట్లు చేయాలని ప్రజాప్రతినిధుల పెత్తనం, కొంతమంది కింది స్థాయి సిబ్బంది సహకరించకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. కాగా 2010లో రామగుండం కార్పొరేషన్‌‌‌‌ ఏర్పడినప్పటి నుంచీ ఒకరిద్దరు మినహా ఎవరూ పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించలేదు. తొలి కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌.ప్రభాత్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు స్వీకరించగా కేవలం 2 నెలలే పనిచేశారు. 

ఆ తర్వాత వచ్చిన ప్రభువర్ధన్‌‌‌‌రెడ్డి 12 రోజులే కొనసాగారు. మూడో కమిషనర్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన సత్యనారాయణ ఆరు నెలలు పనిచేయగా.. ఆ తర్వాత వచ్చిన శివకుమార్‌‌‌‌‌‌‌‌ 14 నెలలు కొనసాగారు. 2011లో ఆయన స్థానంలో వచ్చిన డి.నాగభూషణం కేవలం నెల రోజులే ఉన్నారు. ఇలా చాలామంది ఆఫీసర్లు రోజులు, నెలలపాటే పనిచేశారు.  కేవలం ముగ్గురు మాత్రమే ఎస్‌‌‌‌.రవీంద్ర, జాన్‌‌‌‌ శాంసన్‌‌‌‌ రెండేండ్లు పనిచేయగా.. శ్రీనివాసరావు అత్యధికంగా మూడేళ్లపాటు కొనసాగారు. ప్రస్తుత కమిషనర్‌‌‌‌‌‌‌‌ సీహెచ్‌‌‌‌ శ్రీకాంత్​ 2023 ఆగస్ట్​11న బాధ్యతలు తీసుకోగా.. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 19 నుంచి లీవ్‌‌‌‌లో ఉన్నారు. 

ప్రజలకు తప్పని ఇబ్బందులు...

కమిషనర్​శ్రీకాంత్​ గత నెలలో లీవ్‌‌‌‌పై వెళ్లగా మూడుసార్లు పొడిగించుకున్నారు. కాగా ఆయన తన ఆఫీస్​ ఫోన్​ సిమ్​కార్డును అప్పగించి వెళ్లడంతో ఇక ఆయన రావడం అనుమానమే అన్నట్లుగా మారింది. దీంతో అడిషనల్​కలెక్టర్ అరుణశ్రీకి అడిషనల్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో పలు సమస్యలపై బల్దియా ఆఫీస్‌‌‌‌కు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇన్‌‌‌‌చార్జి కమిషనర్‌‌‌‌‌‌‌‌ అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఆమె ఎక్కువగా జిల్లాకేంద్రం పెద్దపల్లిలో ఉండాల్సి ఉంటుంది. ఆమె ఎప్పుడు రామగుండం వస్తారో తెలియకుండా ఉందని ప్రజలు 
వాపోతున్నారు.