- 2035 నాటికి రోజుకు 12 వేల కార్లు రోడ్లపైకి
- భారీగా పెరగనున్న ఏసీల వాడకం
- వెల్లడించిన ఐఈఏ
న్యూఢిల్లీ: రాబోయే దశాబ్దంలో మనదేశంలో కరెంటు వాడకం విపరీతంగా పెరగనుంది. 2035 నాటిక ఎయిర్ కండిషనర్ల కరెంటు వాడకం మెక్సికోలో మొత్తం కరెంటు వినియోగం కంటే ఎక్కువ ఉంటుందని ఐఈఏ తెలిపింది. రోజుకు 12 వేల కంటే ఎక్కువ కార్లు రోడ్లపైకి వస్తాయి. 2035 నాటికి చమురు గ్యాస్, బొగ్గు, కరెంటు, పునరుత్పాదక ఇంధనం వంటి అన్ని రకాల ఇంధనాలకు డిమాండ్ పెరగనుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) దాని వరల్డ్ ఎనర్జీ ఔట్‌లుక్ 2024లో ఈ వివరాలన్నింటిని వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగ దిగుమతి దేశమైన మనదేశంలో 2035 నాటికి చమురు డిమాండ్ రోజుకు దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల పెరుగుదల ఉంటుంది. మనదేశం 2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. అన్ని రంగాల నుంచి పెరుగుతున్న డిమాండ్ వల్ల మనదేశం వచ్చే దశాబ్దంలో ఇతర దేశాల కంటే ఎక్కువ శక్తిని వాడుకుంటుంది.
భారీగా లోహాల ఉత్పత్తి
2035 నాటికి ఇనుము, ఉక్కు ఉత్పత్తి 70 శాతం పెరుగుతుంది. సిమెంట్ ఉత్పత్తి దాదాపు 55 శాతం పెరగనుంది. ఎయిర్ కండీషనర్ల స్టాక్ 4.5 రెట్లు పెరిగే అవకాశం ఉంది. చమురు డిమాండ్ రోజుకు 5.2 మిలియన్ బ్యారెల్స్ (బీపీడీ) నుంచి 2035 నాటికి 7.1 మిలియన్ బీపీడీకి పెరుగుతోంది. శుద్ధి కర్మాగారాలలో ముడి చమురును పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మార్చే సామర్థ్యం 2035 నాటికి 5.8 మిలియన్ బీపీడీల నుంచి 7.1 మిలియన్ బీపీడీలకు పెరుగుతుంది.
సహజ వాయువు కోసం డిమాండ్ ప్రస్తుతం 64 బిలియన్ క్యూబిక్ మీటర్ల నుంచి 2050 నాటికి172 బీఈఎమ్‌లకు ఎగుస్తుంది. బొగ్గు ఉత్పత్తి 2023లో 721 మిలియన్ టన్నుల నుంచి 2050లో 645 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. 2035 నాటికి మనదేశంలో మొత్తం శక్తి డిమాండ్ దాదాపు 35 శాతం పెరుగుతుంది. కరెంటు ఉత్పత్తి సామర్థ్యం దాదాపు మూడు రెట్లు పెరిగి 1,400 గిగావాట్లకి చేరుకుంటుంది.
రాబోయే దశాబ్దాల్లో మనదేశంలో ఇంధన మిశ్రమంలో బొగ్గు బలమైన స్థానాన్ని నిలుపుకోనుంది. బొగ్గు నుంచి కరెంటు ఉత్పత్తి 15 శాతానికి పైగా పెరుగుతుంది. పరిశ్రమలో ఇంధన డిమాండ్‌ను తీర్చడంలో బొగ్గు ప్రముఖ పాత్ర పోషిస్తోంది. 2023లో శక్తి అవసరాలలో ఇదే 40 శాతం తీరుస్తుంది. 2035 నాటికి, పరిశ్రమలో బొగ్గు వినియోగం 50 శాతం వృద్ధి చెందుతుంది.