సమాజ సేవలో  మత గురువులు

కరోనా ఫస్ట్​ వేవ్ లో వివిధ మతాలకు చెందిన మత పెద్దలు జూమ్ మీటింగ్స్ కే పరిమితం అయ్యారు. కానీ సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మతగురువులు సమాజ సేవకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు కన్పిస్తోంది. రంజాన్ పండుగను ఇండ్ల వద్దే జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. దీంతో ప్రభుత్వాలపై కొంత ఒత్తిడి తగ్గింది. కొన్నిచోట్ల మసీదులను కరోనా కేర్ సెంటర్లుగా మార్చారు. మరికొన్ని ప్రాంతాల్లో ముస్లిం యువకులు చనిపోయిన హిందూ కరోనా పేషెంట్లకు అంత్యక్రియలు చేశారు. కల్వరి టెంపుల్స్​ కూడా తమ చర్చ్​లను కరోనా కేర్ సెంటర్లుగా మార్చడానికి ముందుకొచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కరోనా నియంత్రణకు తన వంతు కృషి చేస్తోంది. కరోనా మరణాల్లో వైరస్​ పాత్ర తక్కువే. కానీ పేదరికంతో కొందరు, అవగాహన లేక మరికొందరు, సరైన వైద్య సేవలు అందక ఇంకొందరు చనిపోతున్నారు. ఇందుకు ఎవరినీ బాధ్యులను చేయలేం.

ఈ సంక్షోభం ఉమ్మడి వైఫల్యం. కలిసికట్టుగా కృషి చేస్తేనే కరోనా సంక్షోభం నుంచి బయటపడతాం. అందుకు మతగురువులు కూడా కీలకపాత్ర పోషించాలి. క్రైస్తవ మతగురువు పోప్ కూడా దేవుని గురించి చెప్తూనే, సైన్సు ఆవశ్యకతను గురించి మాట్లాడుతున్నారు. మనుషులు జీవించి ఉంటే వారికి ఏవైనా చెప్పవచ్చు. మనుషులు లేనిచోట ప్రార్థనా మందిరాలు లేవు. ఉండవు. ‘ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టు, తర్వాత వేదం చెప్పు”అన్న స్వామి వివేకానంద మాటలు నేటి మతగురువులకు స్ఫూర్తి కావాలి. కరోనా సంక్షోభం తర్వాత కూడా వీరి సేవలు ఇలానే కొనసాగించాలని కోరుకుందాం. - ఎం.రామ్ ప్రదీప్, తిరువూరు