ఏ ఒక్క దేశాన్నీ మినహాయించకుండా ప్రపంచమంతటినీ వణికిస్తోంది కరోనా మహమ్మరి. కరోనాను కంట్రోల్ చేయడంలోనే దాదాపుగా అన్ని దేశాలు ప్రస్తుతం బిజీగా ఉన్నాయి. ఇందులో కొన్ని దేశాలు పకడ్బందీ చర్యలతో సక్సెస్ అవుతుంటే కొన్ని దేశాలు వెనకబడుతున్నాయి. ముందుచూపులేకపోవడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు.
సౌత్ కొరియాలో జనవరి 20న తొలిసారి ఒకరి దగ్గర కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి టెస్ట్ చేయించారు. అదిగో అప్పట్నుంచి… కరోనా వైరస్‌పై సౌత్ కొరియా యుద్ధం డిక్లేర్ చేసింది. దేశంలో ఎవరైనా జలుబు, పొడి దగ్గు లాంటివాటితో ఇబ్బందులు పడుతున్నా కొన్ని నిమిషాల్లోనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించడం మొదలెట్టింది. సౌత్ కొరియాలో ఇప్పటివరకు మొత్తం 8,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీళ్లందరినీ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తోంది. ఎవరైనా కాస్తంత నలతగా ఫీలై ప్రభుత్వ అధికారులకు చెబితే చాలు, హెల్త్ వర్కర్లు ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకెళతారు.
కరోనా కేసుల టెస్టింగ్‌కు సంబంధించి ఒక ఇన్నోవేటివ్ ఐడియాను తీసుకొచ్చింది సౌత్ కొరియా. అదే ‘డ్రైవ్–త్రూ’ టెస్టింగ్ సైట్. ఇది చాలా సింపుల్. ప్రస్తుతం గోయాంగ్ సిటీలో అమలు చేస్తున్నారు. ఈ పద్ధతిలో టెస్టుల కోసం ఎక్కడో దూరాన ఉన్న లేబొరేటరీకి వెళ్లక్కర్లేదు. నగరాల్లోని కొన్ని పార్కుల్లో టెస్టులకు అవసరమైన సరంజామాతో హెల్త్ వర్కర్లు సిద్ధంగా ఉంటారు. కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేవారు, ఈ పార్కులోకి వెళితే అక్కడికక్కడే రెడీమేడ్ లేబొరేటరీలో టెస్టులు చేసేస్తారు. టెస్ట్ చేసే వ్యక్తి ట్రావెల్ హిస్టరీ కూడా తీసుకుంటారు. కారులో నుంచి కిందకు దిగాల్సిన అవసరం కూడా ఉండదు. కారు విండోలో నుంచే ఈ టెస్టింగ్ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ పద్ధతిలో పేషెంట్, హెల్త్ సిబ్బంది ఫేస్ టు ఫేస్ కలవడం కూడా ఉండదు. టెస్టింగ్ కార్యక్రమం అంతా పది నిమిషాల్లోనే పూర్తవుతుంది. మూడు రోజుల తరువాత రిజల్ట్‌ను ఎస్ఎంఎస్ ద్వారా హెల్త్ సిబ్బందికి పంపుతారు. కరోనా వైరస్ కు సంబంధించి ఫిబ్రవరి 26న వినూత్నమైన ఈ పద్ధతిని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టింది. ఈ పద్ధతిలో రోజుకు సరాసరి 385 మందికి టెస్టులు చేస్తున్నట్లు సర్కార్ పేర్కొంది.
కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా మొత్తం 96 లేబొరేటరీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సియోల్‌లోని మెయిన్ ల్యాబ్‌కి అనుసంధానం చేశారు. ‘దేశంలో రోజువారీగా ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చాయో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నాయి’ అన్నారు సౌత్ కొరియా హెల్త్ మినిస్టర్ పార్క్ న్యూంఘో. దీంతోపాటు పేషెంట్ల లొకేషన్స్ గుర్తించడానికి ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.
టెస్టింగ్ కెపాసిటీ ఎక్కువ
కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే నెగటివా లేక పాజిటివా అని నిర్థారణ చేయడానికి అన్ని దేశాలు టెస్టులు చేయడం కామన్. అయితే ఇందులో సౌత్ కొరియా టాప్ లో ఉంది. అమెరికా సహా అన్నిదేశాలతో పోలిస్తే దక్షిణ కొరియాలో టెస్టింగ్ కెపాసిటీ బాగా ఎక్కువ. తైవాన్ లో రోజుకు 4,500 మందికి టెస్టులు చేసే యంత్రాంగం ఉంది. ఆస్ట్రేలియా ప్రభుత్వమైతే రోజుకు పది వేల మందికి టెస్టులు చేయగలదు. జపాన్ కెపాసిటీ రోజుకు ఆరు వేల టెస్టులు. అయితే సౌత్ కొరియాకు మాత్రం రోజుకు 15,000 మందికి టెస్టులు చేసే సత్తా ఉంది.
2015 నాటి సంఘటనతో గుణపాఠాలు
ఐదేళ్ల కిందట సౌత్ కొరియాలో ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ (మెర్స్) పేరుతో ఒక వైరస్ విజృంభించింది. అప్పట్లో 186 కేసులు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి. దేశవ్యాప్తంగా 36 మంది చనిపోయారు. దీంతో సౌత్ కొరియాను ‘ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్’ పరిధిలోకి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తీసుకువచ్చింది. అయితే అప్పట్లో టెస్టులు చేయడానికి సౌత్ కొరియాలో సరైన వసతుల్లేవు. కేవలం ఒక్క ‘కొరియన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (కేసీడీసీ)’లోనే టెస్టులు జరపాల్సి వచ్చేది. ఈ ‘మెర్స్’ వైరస్ నుంచి గుణపాఠాలు నేర్చుకుని, ఇప్పుడు పకడ్బందీగా కరోనా కట్టడికి ప్రయత్నిస్తోంది.
ఫైనలియర్ స్టూడెంట్లతో ట్రీట్మెంట్
అనేక దేశాలు కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతుంటే ఇటలీ మాత్రం ఈ విషయంలో బాగా వెనకబడింది. కరోనా లక్షణాలు కనిపిప్తే వెంటనే టెస్టులు నిర్వహించే వ్యవస్థే అక్కడ ఏర్పాటు కాలేదు. ఇటలీ సర్కార్ చాలా లేట్‌గా మేలుకుంది. సోమవారానికి ఆ దేశంలో 24,747 కేసులు నమోదయ్యాయి. వీళ్లలో 1,800 మందికి పైగా చనిపోయారు. కరోనా బారి నుంచి బయటపడ్డవాళ్లు 2,400 మంది వరకు ఉన్నారు. చైనా తర్వాత కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశం ఇటలీయే.
ఇప్పటికీ ఇటలీ సర్కార్‌కు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియడం లేదు. కొన్నిచోట్ల ముసలివాళ్లకు పాజిటివ్‌గా నిర్థారణయితే వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లు ‘నో’ చెబుతున్నట్లు తెలిసింది. మరికొన్ని ప్రాంతాల్లో పేషెంట్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నా ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇళ్లకు పంపించేస్తున్నారు.
హడావుడిగా డాక్టర్ల రిక్రూట్మెంట్
హెల్త్ ఎమర్జెన్సీ కింద డాక్టర్లు, మిగతా హెల్త్ సిబ్బందిని రిక్రూట్ చేయడానికి ఇటలీ ఆర్డర్లు ఇచ్చింది. కొన్ని చోట్ల మెడికల్ గ్రాడ్యుయేట్లు దొరక్కపోతే మెడిసిన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్లను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో నియమిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రభుత్వ నిర్లక్ష్యం హెల్త్ డిపార్ట్మెంట్ మెడకు చుట్టుకుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ డాక్టర్లను కరోనా కేసులు చూసే ఆస్పత్రులకు షిఫ్ట్ చేస్తున్నారు. వేలాది మందికి టెస్టులు చేసే ప్రోగ్రాం మొదలెట్టారు. అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ రూములు రెడీ చేశారు. డాక్టర్లు, మిగతా హెల్త్ సిబ్బంది పనివేళలను పెంచారు. అదనపు భారం పడడంతో రెగ్యులర్‌గా చేయాల్సిన సర్జరీల్ని సైతం ఆపేయాల్సి వస్తోంది.