దేశంలోని కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందడం, కొన్ని వెనుకబడి ఉండటం, రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉండటం కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండటాన్ని ప్రాంతీయ అసమానతలుగా పిలుస్తాం. భారత పంచవర్ష ప్రణాళికల లక్ష్యాల్లో సంతులిత ప్రాంతీయ అభివృద్ధిని సాధించడం ఒకటి. ప్రాంతీయ అసమానతలు అనేవి రాష్ట్రాల మధ్య ఉండొచ్చు. రాష్ట్రం లోపల ఉండొచ్చు. వివిధ రంగాల మధ్య ఉండొచ్చు. ఒక ప్రాంతం ఆర్థిక వెనకబాటుతనాన్ని అక్కడ గల భూమిపై అధిక జనాభా ఒత్తిడి, వ్యవసాయంపై అధికంగా ఆధారపడటం, పట్టణీకరణ కొరవడటం, వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో అల్ప ఉత్పాదకత తదితర అంశాలతో సూచించవచ్చు.
సహజ సిద్ధమైన అంశాలు: భౌగోళికంగా కొన్ని ప్రత్యేక ప్రాంతాలు ఇతర ప్రాంతాలతో సంఘటితమై ఉండకపోవడం. ఉదా: జమ్ముకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు
సహజ వనరులు: సహజ వనరులు సమృద్ధిగా లభించే ప్రాంతాల్లో పెట్టుబడులు ఎక్కువగా తరలివచ్చి అభివృద్ధి చెందుతుంది.
చారిత్రక అంశాలు: అవస్థాపన, మార్కెటింగ్, వాణిజ్య సౌకర్యాలు ఎక్కువగా ఉన్నచోట ఆంగ్లేయులు ఎక్కువ పెట్టుబడులను ప్రోత్సహించారు. ఉదా: కలకత్తా, చెన్నై, బొంబాయి
హరిత విప్లవం: నీటిపారుదల సదుపాయాలు ఎక్కువగా ఉన్న పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో హరిత విప్లవం ప్రవేశపెట్టడంతో అక్కడ రైతుల ఆర్థిక స్థితిగతులు మరింత మెరుగుపడ్డాయి. నీటి వసతి లేని కరువు ప్రాంతాలు, ఈశాన్య భారత్‌లో హరిత విప్లవం విప్తరించకపోవడంతో అక్కడ వెనుకబాటుతనం కనిపిస్తుంది.
ప్రభుత్వ విధానం: 1951లో ప్రవేశపెట్టిన ఐఆర్డీఏ (ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్) ప్రాంతీయ అసమానతలు తగ్గించడంలో విఫలమైంది. రూర్కెలా, బిలాయ్ వంటి ఇనుము ఉక్కు కర్మాగారాలను వెనుకబడిన ప్రాంతాల్లో స్థాపించినా అవి మూలధన సాంద్రత పరిశ్రమలు అయినందువల్ల ఆశించిన ఫలితాలను పొందలేకపోయాయి. ప్రణాళిక వ్యయ కేటాయింపులు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఎక్కువగా జరిగాయి. కేంద్ర విత్త సంస్థలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఎక్కువ విత్తాన్ని సమకూర్చాయి.
ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర: పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి రాయితీలు, ప్రోత్సాహకాలు అందించి పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేశాయి. మిగిలిన రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, అంతర్గత పోటీలు, ప్రజా ఆకర్షణ విధానల వల్ల అభివృద్ధి ఆశించినంతగా పెరగలేదు.
నూతన ఆర్థిక సంస్కరణలు: సంస్కరణలు పరిశ్రమలు స్థాపించడంలోని అవరోధాలను తగ్గించాయి. దీంతో విదేశీ సంస్థలు అవస్థాపనా సదుపాయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెట్టాయి. అంటే సంస్కరణల ఫలాలు వెనుకబడిన ప్రాంతాలకు చేరలేదు.
ప్రముఖ అర్థశాస్త్రవేత్త రాజ్‌కృష్ణ అసమానతలను సూచించే ఆరు అంశాలను పేర్కొన్నారు. అవి.. 1. ఆదాయం, నిరుద్యోగం, పట్టణీకరణ 2. వ్యవసాయ సూచిక 3. ప్రకృతి వనరుల సూచికలు 4. పారిశ్రామిక సూచికలు 5. అవస్థాపన సూచికలు 6. సాంఘిక సేవా సూచికలు.
ప్రభుత్వ చర్యలు
మొదటి ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలు చర్చించలేదు. రెండో ప్రణాళికలో తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల అవసరాలకు పెట్టుబడులు పెంచాలని నిర్ణయించారు. మూడో ప్రణాళికలో 1. వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేసేటప్పుడు అదనపు ప్రాధాన్యత ఇవ్వాలని 2. ప్రభుత్వ ప్రాజెక్టులు వెనుకబడిన ప్రాంతాల్లో స్థాపించాలని పేర్కొన్నారు.
దత్ కమిటీ: 1951లో ఐఆర్డీఏ వచ్చినా పరిశ్రమల కేంద్రీకరణను నిరోధించడంలో విఫలమయ్యారు. అందుకే దీనిపై 1967లో ఎస్.దత్ అధ్యక్షతన ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ ఎంక్వయిరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చట్టం సరిగ్గా పనిచేయలేదని జారీ చేసిన లైసెన్సుల్లో 62శాతం మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్,గుజరాత్, తమిళనాడులకే తరలిపోయాయని పేర్కొన్నారు. దీంతో జాతీయ అభివృద్ధి మండలి రెండు కమిటీలను ఏర్పాటు చేసింది.
1. పాండే కమిషన్: గతంలో ఎన్డీసీ సూచించిన సూచీల ఆధారంగా వెనుకబడిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తించడం దీని ఉద్దేశం.
2. వాంఛూ కమిషన్: పాండే కమిషన్ సూచనల మేరకు వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు తగిన సూచనలు చేసేందుకు వాంఛూ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి గ్రాంట్లు పెంచాలని ఐదేళ్లపాటు పన్ను మినహాయింపు ఇవ్వాలని సూచించింది.
నాలుగో ప్రణాళికలో వెనుకబడిన ప్రాంతాలను రెండు రకాలుగా విభజించారు.
- 1. భౌగోళిక పరిస్థితులు దృష్ట్యా వెనుకబడినవి
- ఎ. కరువు ప్రాంతాలు బి. గిరిజన ప్రాంతాలు
- సి. పర్వత ప్రాంతాలు
- 2. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు
- వెనుకబడిన ప్రాంతాలు గల రాష్ట్రాలకు కేంద్రం నిధుల పంపిణీ విధానం
గాడ్గిల్ ఫార్ములా (1969): నాలుగో ప్రణాళిక వరకు రాష్ట్రాలకు కేంద్రం అందించే నిధులు ఒక సాధారణ నమూనా ప్రకారమే అందజేయబడింది. 1969 నుంచి గాడ్గిల్ ఫార్ములాను అనుసరించడం ప్రారంభించింది.
గాడ్గిల్ - ముఖర్జీ ఫార్ములా: 1991లో గాడ్గిల్ ఫార్ములాను సమీక్షించి తగిన మార్పులను సూచించేందుకు అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడమైంది. దీనిని నూతన గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా అని అంటారు. ఈ ఫార్ములా ప్రకారం మొదటగా 8వ పంచవర్ష ప్రణాళికలో నిధుల కేటాయింపులు జరిగా యి. ఆ తర్వాత కాలం నుంచి ఇప్పటివరకూ గాడ్గిల్ – ముఖర్జీ ఫార్ములానే అనుసరిస్తున్నారు.
కొలిచే సూచీలు
ప్రాంతీయ అసమానతలను కొలవడం క్లిష్టమైన ప్రక్రియ. తలసరి ఆదాయంలో వ్యత్యాసాలు ద్వారా సాధారణంగా రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలను గణిస్తారు. అయితే, రాష్ట్రంలోని అసమానతలను తెలియజేయదు. పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్ధిలోని తేడాలు, రాష్ట్రాల్లో అక్షరాస్యత స్థాయి, మొత్తం పనివారిలో మాన్యుఫాక్చరింగ్ రంగంలోని వ్యవసాయ వృద్ధిలోని తేడాలు, రాష్ట్రాల్లో అక్షరాస్యత స్థాయి, మొత్తం పనివారిలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగంలోని పనివారి వాటా, రోడ్ల పొడవు, శిశుమరణ రేటు మొదలైనవి ప్రాంతీయ అభివృద్ధిలోని వ్యత్యాసాలు తెలుసుకొనడానికి ఉపయోగపడుతాయి.
ఎన్ఎస్డీపీ వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో వ్యత్యాసాలు, పెట్టుబడులు, అవస్థాపనా సదుపాయాల్లో వ్యత్యాసాలు, సాంఘిక అవస్థాపన, మానవాభివృద్ధి, పేదరిక ప్రభావం, పారిశ్రామిక వృద్ధి – అసమానతలు, వ్యవసాయాభివృద్ధిలో అసమానతలు, పట్టణీకరణ, తలసరి విద్యుత్ వినియోగం.
ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్
పట్టణాల్లో స్థానిక సంస్థల పాలనను మెరుగుపరిచే దిశగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ నమూనాలో అభిలషణీయ పట్టణ స్థానిక సంస్థల (ఆస్పిరేషనల్ అర్బన్ లోకల్ బాడీస్) కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తున్నది. తొలుత హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టే దిశగా గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. తగిన మౌలిక సదుపాయాలు లేని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్థానిక సంస్థలకు వసతులు కల్పించడం, పాలనా విధానంలో మార్పులు తీసుకురావడం, సేవలను మరింత మెరుగుపర్చడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుపై ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే
ప్యూ రీసెర్చ్ సెంటర్ 27 దేశాల్లో నిర్వహించిన సర్వేలో అధిక ఆదాయ దేశాలు, ప్రత్యేకంగా పశ్చిమ దేశాల్లోని ప్రజలు తమ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. ఉత్తర అమెరికాలో 68 శాతం, మెక్సికోలో 50 శాతం ప్రజలు ప్రస్తుత ప్రజాస్వామ్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జస్టిన్ ట్యూడో నేతృత్వంలోని కెనడాలో కేవలం 52 శాతం మంది మాత్రమే ప్రజాస్వామ్యంపై సానుకూలంగా ఉన్నారు. ఆసియా దేశాల్లో సింగపూర్‌లో 80 శాతం, భారత్ లో 77 శాతం మంది ప్రజలు మాత్రమే ప్రజాస్వామ్యంపై సంతృప్తిని వ్యక్తపరిచారు.
జపాన్‌లో 31 శాతం మంది ప్రజలు ప్రజాస్వామ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 11 దేశాల్లోని 50 శాతం మంది ప్రజాస్వామ్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 17 పాశ్చాత్య దేశాల్లోని 11 చోట్ల మాత్రం అసంతృప్తిగా ఉన్నారు.