మధ్యప్రదేశ్ లో దళిత యువకులకు గుండు గీయించిన గ్రామపెద్దలు

మధ్యప్రదేశ్ లో దళిత యువకులకు గుండు గీయించిన గ్రామపెద్దలు

భోపాల్ : మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలో అమానుషం జరిగింది. గ్రామ పంచాయితీ పెద్దలు ఎస్సీకి చెందిన ఇ‍ద్దరు యువకులకు గుండు గీయించారు. దబోహా గ్రామంలో ఈనెల 17వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

అసలేం జరిగింది..?

దబోహ గ్రామానికి చెందిన సంతోష్ షాక్యా, ధర్మేంద్ర షాక్యా అనే ఇద్దరు.. కొద్ది రోజుల క్రితం దిలీప్ శర్మ అనే వ్యక్తితో గొడవపడ్డారు. ఈ గొడవలో శర్మ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు నిందితులు దబోహ గ్రామం నుంచి పారిపోయారు. దాదాపు 45రోజుల తర్వాత హరిరామ్ అనే వ్యక్తి.. ముగ్గురు నిందితుల తరఫున దిలీప్‌ శర్మతో సయోధ్య కుదిర్చేందుకు వెళ్లాడు. ఈ వ్యవహారంపై గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు. ముగ్గురు కలిసి రూ.1.5 లక్షలు దిలీప్ శర్మ వైద్య ఖర్చుల కోసం ఇవ్వాలని సర్పంచ్ మురళీలాల్ తో పాటు గ్రామపెద్దలు ఆదేశించారు. అంతేకాదు.. ఇద్దరికీ గుండు గీయించారు.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగారు. దిలీప్ శర్మ, అతని తండ్రిని అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇద్దరు బాధిత యువకులను ఆస్పత్రికి తరలించారు. వారి ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.