
లక్నో: మరోసారి ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్–18లో జోరు పెంచింది. గుజరాత్ చేతిలో ఓటమి నుంచి వెంటనే తేరుకున్న డీసీ మెగా లీగ్‌లో ఆరో విక్టరీ సొంతం చేసుకొని ప్లే ఆఫ్స్ రేసులో ముందడుగు వేసింది. బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ (4/33).. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ (42 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (36 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51) ఫిఫ్టీలతో మెప్పించడంతో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డీసీ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై భారీ విజయం సాధించింది.
ఏకపక్ష పోరులో తొలుత లక్నో 20 ఓవర్లలో 159/6 స్కోరు చేసింది. ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ (33 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 52) ఫిఫ్టీ కొట్టగా.. మిచెల్ మార్ష్ (36 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 45) , ఆయుష్ బదోని (21 బాల్స్‌లో 6 ఫోర్లతో 31) రాణించారు. అనంతరం డీసీ 17.5 ఓవర్లలోనే 161/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (20 బాల్స్‌లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 34 నాటౌట్) కూడా ఆకట్టుకున్నాడు. లక్నో బౌలర్లలో మార్‌క్రమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ముకేశ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఓపెనర్లు దంచినా..
లక్నోకు ఓపెనర్లు మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ అద్భుతమైన ఆరంభం ఇచ్చినా.. అదే జోరును కొనసాగించలేక తక్కువ స్కోరుకే పరిమితం అయింది. మిడిల్ ఓవర్లలో ఈ టీమ్‌ను ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా నిలువరించారు. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ తొలి ఓవర్లో మూడు రన్స్ ఇచ్చినా.. స్టార్క్ వేసిన రెండో ఓవర్లో భారీ సిక్స్‌తో మార్‌క్రమ్ టచ్‌లోకి వచ్చాడు. తర్వాతి ఓవర్లో మార్ష్ బౌండ్రీల ఖాతా తెరవగా.. ముకేశ్ బౌలింగ్‌లో 4, 6తో మార్‌క్రమ్ స్పీడు పెంచాడు. ఆరో ఓవర్లో దుష్మంత చమీరకు మార్ష్ సిక్స్‌తో వెల్‌కం చెప్పగా.. పవర్ ప్లేను లక్నో 51/0తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా మార్‌క్రమ్, మార్ష్ వెనక్కు తగ్గలేదు. విప్రజ్ నిగమ్ ఓవర్లో మార్‌క్రమ్ సిక్స్ కొడితే.. మార్ష్ ఫోర్ రాబట్టాడు. దాంతో లక్నో భారీ స్కోరు చేసేలా కనిపించింది.
కానీ స్టార్క్ తొమ్మిదో ఓవర్లో తిరిగి బౌలింగ్‌కు రావడంతో సీన్ మారింది. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మార్‌క్రమ్‌ను పదో ఓవర్లో చమీర ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 87 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. వచ్చీరాగానే వరుసగా రెండు ఫోర్లు కొట్టిన నికోలస్ పూరన్ (9)ను బౌల్డ్ చేసిన స్టార్క్ లక్నోను భారీ దెబ్బకొట్టాడు. ఇక్కడి నుంచి ఢిల్లీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది.
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రన్స్ నియంత్రించగా.. 14వ ఓవర్లో అబ్దుల్ సమద్ (2)ను రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసిన ముకేశ్.. మార్ష్‌ను బౌల్డ్ చేయడంతో లక్నో 110/4తో డీలా పడ్డది. స్లాగ్ ఓవర్లలో డేవిడ్ మిల్లర్ (14 నాటౌట్), ఆయుష్ బదోనీ లక్నో ఇన్నింగ్స్‌కు మళ్లీ జోష్ తెచ్చే ప్రయత్నం చేశారు. మిల్లర్ నెమ్మదిగా ఆడగా... బదోనీ వీలు చిక్కినప్పుడల్లా బౌండ్రీలు కొట్టాడు. చివరి ఓవర్లో బదోనీ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి నాలుగో బాల్‌కు ఔటవ్వగా.. చివరి బాల్‌కు రిషబ్ పంత్ (0)ను బౌల్డ్ చేసిన ముకేశ్ లక్నో స్కోరు 160 మార్కు దాటకుండా చూశాడు.
పోరెల్, రాహుల్ ఫటాఫట్
చిన్న టార్గెట్‌ను ఢిల్లీ అలవోకగా అందుకుంది. ఛేజింగ్‌లో ఆ టీమ్‌కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ కరుణ్ నాయర్ (15) తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టగా.. అభిషేక్ పోరెల్ కూడా బౌండ్రీ రాబట్టాడు. తర్వాతి రెండు ఓవర్లలో పోరెల్ రెండు ఫోర్లు కొట్టగా.. మార్‌క్రమ్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన కరుణ్ తర్వాతి బాల్‌కే లైన్ మిస్సయి బౌల్డ్ అవ్వడంతో తొలి వికెట్‌కు 36 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
అప్పటికే క్రీజులో కుదురుకున్న పోరెల్.. వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ జతగా జోరు చూపెట్టడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 54/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ మారిన తర్వాత వరుసగా మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో ఢిల్లీ స్పీడు తగ్గింది. కానీ, బిష్ణోయ్ బౌలింగ్‌లో పోరెల్, రాహుల్ చెరో సిక్స్‌తో మళ్లీ ఊపు తెచ్చారు. ఈ క్రమంలో పోరెల్ 33 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మార్‌క్రమ్ బౌలింగ్‌లో కేఎల్ మరో సిక్స్‌తో స్కోరు వంద దాటించినా.. అదే ఓవర్లో పోరెల్ మిల్లర్‌కు క్యాచ్ ఇవ్వడంతో రెండో వికెట్‌కు 69 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
అప్పటికే మ్యాచ్ ఢిల్లీ చేతుల్లోకి వచ్చింది. ఈ దశలో రాహుల్‌కు తోడైన కెప్టెన్ అక్షర్ పటేల్.. బిష్ణోయ్ వేసిన 14వ ఓవర్లో రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్‌లో రాహుల్ కూడా తన జోరు కొనసాగించి 40 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో విన్నింగ్ సిక్స్ కొట్టడంతో ఢిల్లీ మరో 13 బాల్స్ మిగిలుండగానే మ్యాచ్ ముగించింది.
సంక్షిప్త స్కోర్లు:
లక్నో:20 ఓవర్లలో 159/6 (మార్‌క్రమ్ 52, మిచెల్ మార్ష్ 45, ఆయుష్ బదోని 36, ముకేశ్ కుమార్ 4/33).
ఢిల్లీ: 17.5 ఓవర్లలో 161/2 (కేఎల్ రాహుల్57 నాటౌట్, పోరెల్ 51,
మార్‌క్రమ్ 2/30).