నవ భారత నిర్మాణం దిశగా మోడీ అడుగులు

నరేంద్ర దామోదర్ దాస్ మోడీ.. ఈ పేరు భారత దేశ భవిష్యత్ ను మారుస్తుందని, దేశ సామాజిక, సాంస్కృతిక వైభవాన్ని పునర్నిర్మిస్తుందని, ప్రపంచదేశాల సరసన ఇండియాను సగర్వంగా నిలబెడుతుందని ఎనిమిదేండ్ల క్రితం ఎవరూ ఊహించలేదు. గుజరాత్ సీఎంగా ఆటుపోట్లను, విమర్శలను ఎదుర్కొని ఆ రాష్ట్ర అభివృద్ధి పథాన్ని దేశ ప్రజలు కొనియాడేలా పాలనా దక్షత చూపిన మోడీ.. ప్రధానిగా ఎన్నికై, అటు దేశాన్ని ఇటు పార్టీని విజయపథాన నడుపుతున్నారు. ఆయన రెండోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేండ్లు పూర్తయి నాలుగో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా గడిచిన 8 ఏండ్ల పాలనలో దేశం సాధించిన ప్రగతిని యాది చేసుకోవడం అవసరం. 
 

ఎనిమిదేండ్ల క్రితం :-
ఎనిమిదేండ్ల క్రితం ఈ దేశ పురోగతి, భవిష్యత్ మీద ప్రజల్లో ఒకరకమైన నైరాశ్యం నెలకొని ఉన్న పరిస్థితి. దేశంలో ఎటుచూసినా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుటుంబ పాలన, గాడి తప్పిన విదేశాంగ విధానం, నిరుద్యోగం, పేదరికం, చీలికలు పీలికలుగా ఉన్న ప్రభుత్వం, నిర్ణయాలు తీసుకోలేని ప్రధానమంత్రి.. దేశ ప్రయోజనాలు కాంక్షించే విశాల దృక్పథం లేని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీలో ఈ దేశ ప్రజలు తమ భవిష్యత్ ను చూసుకున్నారు. దశాబ్దాల తర్వాత అఖండ మెజారిటీతో అధికారాన్ని అప్పగించారు . ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించిన మోడీ, వారిని మళ్లీ మెప్పించి గతానికి మించిన మెజారిటీతో రెండోసారి ప్రధాని అయ్యారు. వ్యక్తి కంటే, పార్టీ కంటే.. దేశమే ముఖ్యం, దేశ హితమే ప్రథమం అని విశ్వసించే నాయకుడిగా మోడీ ఎన్నో అద్భుత నిర్ణయాలు తీసుకున్నారు. 

 

దేశంలో ఎన్నో మార్పులు :-
ప్రధాని నరేంద్ర మోడీ అవినీతికి తావులేని పరిపాలన, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు, అమలులో కచ్చితత్వం, సంక్షేమంలో నిజాయతీ, దేశ రక్షణలో కఠినత్వం చూపుతూ ముందుకు సాగుతున్నారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ మంత్రానికి సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ లను జోడించి దేశ పురోగతి కోసం ఆయన పనిచేస్తున్నారు. దేశాన్ని స్వచ్ఛ భారతంగా మార్చడం నుంచి మొదలుపెట్టి, పేదలకు బీమాతో భరోసా కల్పించి, ముద్ర యోజనతో స్వయం ఉపాధి కల్పించి, జన్ ధన్ యోజనతో బలహీన వర్గాలను బ్యాంకులతో అనుసంధానించి, మేక్ ఇన్ ఇండియాతో దేశ పారిశ్రామిక వాణిజ్య రంగంలో నూతన ఒరవడిని సృష్టించారు. దేశ రక్షణరంగ ఉత్పత్తులను స్థానికరించడం, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా విదేశాంగ విధానాన్ని స్థిరీకరించడం, వ్యవసాయ రంగంలో నిర్ణీత మార్పులతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశలో పయనించడం, అమృత్, స్మార్ట్ సిటీలతో పట్టణాల్లో అగ్ర శ్రేణి మౌలిక సదుపాయాలు కల్పించడం, హృదయ్ తో చారిత్రక నగరాల వారసత్వాన్ని రక్షిస్తూనే అభివృద్ధి వైపు నడిపించడం, స్వనిధితో దేశంలోని వీధి వ్యాపారులకు ఆర్థిక తోడ్పాటు అందించడం, దేశంలో ప్రతి ఇంటికి విద్యుత్, నీరు, గ్యాస్ కనెక్షన్ అందించడం వరకు ప్రతీది నవ భారత నిర్మాణం కోసం చేపడుతున్న చర్యలే. దేశ సౌభాగ్యం కోసం నోట్ల రద్దు, జీఎస్టీ రూపంలో పన్నుల వ్యవస్థ సంస్కరణ, అయోధ్యలో రామాలయ నిర్మాణం, వారణాసిలో కాశీ అభివృద్ధి కారిడార్ లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు మోడీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం నన్ను మంత్రముగ్ధురాలిని చేసింది. 

 

కీలక​విషయాల్లో చాతుర్యం :-
దేశ సమైక్యతకు, దేశ భద్రతకు ఎంతో అవసరమైన ఆర్టికల్ 370 రద్దును నరేంద్ర మోడీ ఎంతో చాకచక్యంగా పూర్తి చేశారు. కేవలం సైద్ధాంతిక తృష్ణను తీర్చుకోవడానికి మాత్రమే కాకుండా దేశ అంతర్గత భద్రతను ప్రభావితం చేసే అంశం గనుక తన పటిష్ట రాజకీయ చాతుర్యంతో, కఠినంగా వ్యవహరించి, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా దశాబ్దాల డిమాండ్ ను నెరవేర్చారు. 2014కు ముందు దేశంలో బాంబు పేలుళ్లు, తీవ్రవాద దాడులతో ప్రజలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉండేది. మోడీ అధికారంలోకి వచ్చాక తీవ్రవాదం విషయంలో అత్యంత కఠిన వైఖరి కొనసాగుతోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పక్కా ప్రణాళికతో భారత సైన్యానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లభించింది. ఆపరేషన్ ఆలౌట్ పేరుతో కాశ్మీర్ ప్రాంతంలో తీవ్రవాదులను వెతికి మరి నిర్మూలించడం సత్ఫలితాలను ఇచ్చింది. సరిహద్దుల్లో పాక్​శృతి మించి ప్రవర్తిస్తే సర్జికల్ స్ట్రైక్ తో వారికి బుద్ధి చెప్పిన విధానం మోడీ బలమైన నిర్ణయాత్మక శక్తిని సూచిస్తుంది. సైనిక వ్యవస్థ ఆధునీకరణ, ఆయుధ స్వదేశీకరణ కోసం విభిన్న మార్గాలు అలోచించి దేశ భద్రతను పటిష్ట పరిచే చర్యలను వేగవంతం చేశారు. ప్రధాని మోడీ సైనికుల దశాబ్దాల కలను వన్ ర్యాంక్ - వన్ పెన్షన్​ రూపంలో నెరవేర్చి సైనికుల సంక్షేమం కోసం కృషి చేశారు. 

 

తెలంగాణలోనూ అధికారం దిశగా :-
భారతీయ జనతా పార్టీ మద్దతుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యాక తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గ్రామాలకు నిధుల కేటాయింపు నుంచి మొదలుకుని రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ వరకు అనేక అంశాల్లో ఆయన ప్రత్యేక చొరవ చూపారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునర్నిర్మించడం, హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటుకు నిధులతో కూడిన అనుమతులు ఇవ్వడం, రాజకీయాలను పక్కకు పెట్టి ప్రతి నీటి ప్రాజెక్టుకు వేగంగా అనుమతులు ఇవ్వడం ప్రతి సెక్టార్ లో, ప్రతి ప్రభుత్వ విభాగంలో జరిగే ప్రతి పనిలో కేంద్ర నిధులను వెంట వెంటనే మంజూరు చేయడం, మెట్రో లాంటి అధునాతన సౌకర్యాల కల్పనకు అండగా నిలబడటం వంటివి మోడీకి తెలంగాణ పట్ల ఉన్న ప్రత్యేక అభిమానానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. దేశంలో 2014 కు ముందు ఏ పరిస్థితి అయితే ఉందో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉంది. ఇయ్యాల తెలంగాణలో టీఆర్ఎస్​సర్కారు అణచివేత ధోరణి అవలంబిస్తూ.. అక్రమ కేసులు పెడుతూ ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను హింసిస్తోంది. ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకు దూరమవడం, పెరిగిన అప్పులు, తగ్గిన రాబడి, ప్రజల్లో వస్తున్న చైతన్యం కేసీఆర్​ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

మోడీపై అవాకులు చెవాకులు :-
దీంతో కేసీఆర్​..మోడీపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. తెలంగాణ సమాజం ఈ విషయాన్ని గ్రహిస్తూనే ఉంది. ఉద్యమకారుల నుంచి మొదలుకుని భవిష్యత్ తెలంగాణ నిర్మాణ ఆశావహుల వరకు అందరూ తెలంగాణలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారు. మోడీ సుపరిపాలనతో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎలా అధికారంలోకి రాగలిగిందో.. అలాగే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారం చేపట్టబోతోంది. దేశంలో చాలా మంది వ్యక్తులు, పార్టీలు 2024 ఎన్నికల్లో మోడీని ఓడించి అధికారంలోకి వస్తున్నట్లు పగటి కలలు కంటున్నారు. అది అసాధ్యం. మరొక్కసారి బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా మద్దతుతో రాబోవు ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధిస్తాం. నవ భారత నిర్మాణ కలను నరేంద్ర మోడీ సారథ్యంలో సాకారం చేసుకుంటాం.

 

కరోనా టైమ్​లో :-
కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతలమైంది. ప్రధానిగా నరేంద్ర మోడీ నిర్ణయాల వల్ల కరోనా తక్కువ ప్రభావంతో ప్రజలు బయటపడగలిగారు. వ్యాక్సిన్ కోసం శ్రమించిన శాస్త్రవేత్తలకు మోడీ నైతిక మద్దతునిచ్చారు. ఉత్పత్తి కంపెనీలను స్వయంగా సందర్శించి భరోసా కల్పించారు. ప్రపంచ మెడికల్ మాఫియా ప్రతిపాదనలకు లొంగకుండా, ఈ దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్​ అందజేసేందుకు ఆయన కృషి చేశారు. ప్రపంచంలో చాలా దేశాలకు కూడా మనమే వ్యాక్సిన్​అందించడం దేశం పురాతనకాలం నుంచి బలంగా విశ్వసిస్తున్న ‘వసుదైక కుటుంబ’ విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. పేద ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా వారికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఉచిత రేషన్, గ్యాస్, ఆర్థిక సాయం అందేలా చేశారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ అశాంతి నెలకొన్నా.. అక్కడ ఉన్న భారతీయులను క్షేమంగా ఈ దేశ గడ్డమీదకు చేర్చడంలో నరేంద్ర మోదీ దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించారు. ప్రస్తుత ఉక్రెయిన్​ - రష్యా యుద్ధ సమయంలో కూడా కేవలం భారతీయ విద్యార్థులను క్షేమంగా తీసుకురావడానికే రష్యా యుద్ధ విరామం ప్రకటించడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. మోడీని పెద్ద తరహాలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా అమెరికా లాంటి అగ్రరాజ్యం కోరడం మన దేశానికి దక్కిన అరుదైన గౌరవం. గ్రామపంచాయతీ నుంచి అంతరిక్ష రంగం వరకు ప్రతి వ్యవస్థ ఇయ్యాల మోడీ పాలన దక్షతతో సత్ఫలితాలను సాధిస్తోంది. 

- డి.కె.అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు