
- ఫండ్స్ ఉన్నా జీతాలకు అప్పులు
- ఏనుమాములలో పాలకవర్గం లేక తిప్పలు
- ఉద్యోగుల జీతభత్యాలకు మూడు నెలలుగా తిప్పలు
- మార్కెట్లో రైతులకూ అన్యాయం
- ఎస్సీ మహిళా రిజర్వేషన్ మార్చే ప్రయత్నంలో కొందరు లీడర్లు
- ఎమ్మెల్యే అనుచరుని కోసం హైకమాండ్ వద్ద లాబీయింగ్
- మూన్నేళ్లుగా కమిటీ ఎంపికను పట్టించుకోని రాష్ట్ర సర్కారు
వరంగల్, వెలుగు : ఆసియాలోనే రెండో పెద్ద మార్కెట్ అయిన ఏనుమాములలో... చిన్న మార్కెట్ల వద్ద అప్పులు తెచ్చి సిబ్బందికి జీతాలు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ఖజానాలో నిధులు ఉన్నా పాలకవర్గం లేకపోవడంతో వాడుకోలేని దుస్థితి. జీతాల చెల్లింపునకు చెక్కులపై పాలకవర్గ కమిటీ చైర్మన్ సంతకం అవసరం. ప్రస్తుతం చైర్మన్ లేకపోవడంతో.. నెలాఖరు వచ్చే సరికి అప్పుల కోసం ఆఫీసర్లు ఇతర మార్కెట్లకు పరుగులు పెడుతున్నారు. పాలకవర్గం లేక మూడు నెలలైనా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇలా ఉంటే, ఓ ఎమ్మెల్యే తన అనుచరుడికి చైర్మన్ పీఠం ఇప్పించేందుకు ఏకంగా రిజర్వేషన్ జీవోనూ కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
జీతాల కోసం తిప్పలు..
వరంగల్ ఏనుమాములకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.38 కోట్ల ఆదాయం వచ్చింది. మార్కెట్ పరిధిలో మొత్తం 300 మంది వరకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి జీతాలు, పెన్షన్ల కోసం ప్రతినెలా రూ.కోటి 25 లక్షలు అవసరం అవుతోంది. ఆగస్టు 18న పాలకవర్గం ముగియడం... ఆ తర్వాత కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోకపోవడంతో మూడు నెలలుగా జీతాల చెక్కులపై సంతకాలు చేసే వారు లేరు. ఈ మూడు నెలలు వరుసగా నర్సంపేట, ఆదిలాబాద్, ఖమ్మం మార్కెట్ల నుంచి అప్పులు తీసుకొచ్చి జీతాలు చెల్లించారు.
రెన్యూవల్ చేయట్లే..
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు గతేడాది ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అనుచరుడి భార్య దిడ్డి భాగ్యలక్ష్మి ని చైర్ పర్సన్ గా నియమించారు. అయితే ఆమె పదవీకాలం ముగిసి మూడు నెలలు కావొస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏటా రెండు నెలలకు ముందే స్పందించే ప్రభుత్వం.. ఈసారి మాత్రం సైలెంట్ గా ఉందనే విమర్శలున్నాయి.
రైతుల గోడు వినేదెవరు?
ప్రస్తుతం పత్తి సీజన్ మొదలుకావడంతో ఏనుమాముల మార్కెట్ రైతులతో కళకళలాడుతోంది. ఇదే సమయంలో వ్యాపారులు, అధికారులతో చేతులు కలిపి రైతులకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. పత్తి రంగు మారిందనో.. తేమ శాతం ఎక్కువగా ఉందనో వ్యాపారులు తమకు నచ్చినట్లు రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. గతేడాది క్వింటాల్ పత్తి రూ.11 వేల వరకు పలకగా.. ఇప్పుడు రూ.8,600 దాటడం లేదు. పత్తి కొనుగోలుదారులు కావాలనే సిండికేట్ గా మారి తక్కువ ధర కడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రైతన్నలు మార్కెట్లో తమ సమస్యలు, గోడు చెప్పుకోడానికి పాలకవర్గం లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. అధికారులు, వ్యాపారులను ప్రశ్నించేవారే కరువయ్యారు.
రిజర్వేషన్ మార్పు కోసం ప్రయత్నాలు?
రిజర్వేషన్ ప్రకారం మార్కెట్ పాలకవర్గ చైర్మన్ ఈసారి ఎస్సీ మహిళకు కేటాయించాల్సి ఉంది. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలు తమ గాడ్ ఫాదర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. గత రెండేండ్లుగా ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్ అనుచరులకు ఈ పదవులు దక్కగా.. ఈసారి ఈ ఇద్దరితో పాటు ఎమ్మెల్యే అరూరి రమేశ్ సైతం చైర్మన్ పీఠం తన అనుచరులకే ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఓ బ్లడ్ బ్యాంక్ సొసైటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సీనియర్ నేత కూడా ఈ పదవి కోసం ట్రై చేస్తున్నారు. ప్రస్తుత రిజర్వేషన్ కలిసిరాకున్నా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అండదండలతో పాటు హైకమాండ్ వద్ద అతనికి పలుకుబడి ఉండడంతో అవసరమైతే రిజర్వేషన్ మార్చేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. అందుకే పాలకవర్గం ఎంపిక ఆలస్యమవుతుందనే ప్రచారం ఉంది. మునుగోడు ఎలక్షన్ ఫలితాల అనంతరం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీపై అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని గులాబీ లీడర్లు చెబుతున్నారు.