కరెంటు కావాలా.. కాంగ్రెస్​ కావాలా.. కాంగ్రెస్,​ బీజేపీలను ఓడించండి : కేటీఆర్​

మక్తల్, వెలుగు:  రైతులకు24 గంటల  కరెంటు కావాలా లేక కాంగ్రెస్ ​ఇస్తానన్న  మూడు  గంటల కరెంటు  కావాలా అని  మంత్రి కేటీఆర్​  ప్రశ్నించారు. గురువారం ఆయన మక్తల్​ పట్టణంలో సాయంత్రం బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెంరామ్మోహన్​రెడ్డితో కలిసి  రోడ్​షో నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా దగ్గర మాట్లాడారు.  కాంగ్రెస్,  బీజేపీ  కల్ల బొల్లి మాటలు  నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ పాలనలో కర్నాటకలో రైతులకు కరెంటు కష్టాలు మొదలయ్యాయన్నారు. 

టీపీసీసీ  చీఫ్​ రేవంత్​రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్​ ఇస్తే సరిపోతుందని,10హెచ్​పీ  మోటార్లు పెట్టుకోవాలని అంటున్నాడని, రైతులు 10హెచ్​పీ మోటార్లను ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు.  ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి  రైతుబంధు వద్దంటున్నాడన్నారు. బీఆర్ఎస్​ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం  రూ.400లకే గ్యాస్​ సిలిండర్ అంజేస్తామన్నారు. తెల్ల రేషన్​ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. రైతుబంధును  రూ.16వేలకు పెంచుతామన్నారు. 

కేసీఆర్​ మరోసారి గెలిచి హ్యాట్రిక్​ సాధించి సీఎం అవుతారన్నారు. గద్వాల నుంచి చిట్టెం రామ్మోహన్​రెడ్డిని గెలిపిస్తే ఊట్కూర్​ చెరువును రిజార్వాయర్ గా, మక్తల్​ నారాయణపేట రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మారుస్తానని హామీ ఇచ్చారు. మక్తల్, అత్మకూర్​లను రెవెన్యూ డివిజన్​లుగా ఏర్పాటు చేస్తామన్నారు. రేవంత్​రెడ్డి కొడంగల్, కామారెడ్డిలో ఓడిపోవడం ఖాయమన్నారు.  బీజేపీ,కాంగ్రెస్​ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. మీటింగ్​లో ఎంపీ శ్రీనివాస్​రెడ్డి, చిట్టెం సుచరిత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ALSO READ : సమస్యాత్మాక ప్రాంతాల్లో .. సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలి : ప్రశాంత్ జీవన్ పాటిల్