ఫార్ములా- ఈ రేసులో 55 కోట్లు గోల్​మాల్

ఫార్ములా- ఈ రేసులో 55 కోట్లు గోల్​మాల్

 

  • విదేశీ సంస్థకు అక్రమంగా చెల్లింపు 
  • విచారణ చేపట్టాలని ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు 
  • ప్రభుత్వ అనుమతి కోరుతూ ఏసీబీ లేఖ 
  • అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే నిధుల మళ్లింపు! 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫార్ములా-ఈ కార్ల రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ రేసుకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించారని ఏసీబీకి మున్సిపల్ శాఖ అధికారులు ఇటీవల ఫిర్యాదు చేశారు. నిధుల గోల్‌‌‌‌మాల్‌‌‌‌పై సమగ్ర విచారణ జరపాలని కోరారు. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ మంగళవారం లేఖ రాసినట్టు తెలిసింది. 

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పోయినేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్​లో ఫార్ములా–ఈ కార్ల రేస్‌‌‌‌ నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్​ అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్ (ఎంఏయూడీ) ఆధ్వర్యంలో హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌ పరిసరాల్లో సీజన్‌‌‌‌ 9 రేసింగ్ జరిగింది. దీని కోసం 2.8 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్‌‌‌‌ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 11న రేస్ నిర్వహించారు. ఇందుకోసం మొత్తం రూ.200 కోట్లు ఖర్చయింది.

ఇందులో ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌‌‌‌కో రూ.150 కోట్లు, హైదరాబాద్‌‌‌‌ రేసింగ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ రూ.30 కోట్లు ఖర్చు చేశాయి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం హెచ్‌‌‌‌ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. సీజన్ 9 విజయవంతం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 10న సీజన్‌‌‌‌ 10 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఫార్ములా-ఈ ఆపరేషన్‌‌‌‌(ఎఫ్‌‌‌‌ఈవో)తో ఎంఏయూడీ 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో అగ్రిమెంట్‌‌‌‌ చేసుకుంది. ఇందుకుగాను హెచ్‌‌‌‌ఎండీఏ నిధుల నుంచి రూ.55 కోట్లు ఎఫ్‌‌‌‌ఈవోకు చెల్లించింది. 

ఆర్బీఐ రూల్స్​కు విరుద్ధంగా.. 

2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఫార్ములా–ఈ కార్ల రేసింగ్ లో అక్రమాలు జరిగినట్టు గుర్తించింది. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రేస్‌‌‌‌ నిర్వహిస్తున్న విదేశీ సంస్థ ఎఫ్‌‌‌‌ఈవోకు నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల చెల్లింపులు జరిగాయని తెలుసుకుంది. మరోవైపు గత ప్రభుత్వం ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో రేస్‌‌‌‌ నుంచి తప్పుకొంటున్నట్టు ఎఫ్‌‌‌‌ఈవో ప్రకటించింది. 

దీంతో సీజన్ 10 రద్దయింది. ఆ తర్వాత నిధుల గోల్ మాల్ పై అప్పటి ఎంఏయూడీ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌కు సీఎస్‌‌‌‌ శాంతికుమారి మెమో జారీ చేశారు. దీనికి అరవింద్‌‌‌‌కుమార్ వివరణ ఇచ్చారు. ‘‘రేసింగ్‌‌‌‌కు సంబంధించిన ప్రక్రియ త్వరగా జరగాలన్న ఉద్దేశంతోనే చెల్లింపులు చేశాం. ఎంఏయూడీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే రూ.55 కోట్లు చెల్లించాం” అని ఆయన వివరణ ఇచ్చినట్టు తెలిసింది. 

బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖికంగా ఇచ్చిన ఆదేశాల మేరకే ఎఫ్ఈవోకు రూ.55 కోట్లు చెల్లించినట్టు సమాచారం. కాగా, ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపు జరిపారని గుర్తించిన కాంగ్రెస్ సర్కార్.. నిధుల గోల్ మాల్ పై విచారించాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీకి మున్సిపల్ శాఖ అధికారులు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.