గడ్చిరోలీలో ఎన్‌కౌంటర్...​ ఐదుగురు మావోయిస్టులు మృతి

గడ్చిరోలీలో ఎన్‌కౌంటర్...​ ఐదుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం సీ 60 బలగాలు(గ్రేహౌండ్స్ తరహాలో మావోయిస్టులపై పోరు కోసం మహరాష్ట్ర రూపొందించిన బలగాలు), మావోయిస్టుల మధ్య భారీ ఎన్​కౌంటర్ జరిగింది. ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. అర్ధరాత్రి వరకు ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగయి.  ఒక పోలీస్ జవాన్​కు గాయాలయ్యాయి. 

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా బామర్​గఢ్ పోలీస్​స్టేషన్ పరిధిలోని కోపరీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం వచ్చింది. చత్తీస్​గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా బార్డర్ నుంచి వీరు మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లుగా తెలియడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా వ్యూహరచన చేశారు. మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర హోంశాఖ చేపట్టిన ఆపరేషన్​ కగార్​లో భాగంగా సీ-60 బలగాలు ఈ ఆపరేషన్​ చేపట్టాయి. మావోయిస్టుల సమావేశ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా చుట్టుముట్టారు. 

ఉక్కిరిబిక్కిరి అయిన మావోయిస్టులు ప్రతిఘటించే లోపే బలగాలు వారిపై కాల్పులు ప్రారంభించాయి. ఇప్పటి వరకు ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను, భారీగా పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు ఆధికారులు చెబుతున్నాయి.

హెలికాప్టర్​ ద్వారా మృతదేహాల తరలింపు

ఎన్​కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను ఘటనా స్థలం నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలి జిల్లా కేంద్రానికి ఎస్పీ నీలోత్పల్​ తరలించారు. దండకారణ్యం ప్రాంతం కావడంతో మావోయిస్టులు ఎదురుదాడికి దిగే ప్రమాదం ఉండటంతో గాయపడిన జవాన్​తో పాటు, మావోయిస్టుల మృతదేహాలను తీసుకొచ్చారు. గాయపడిన జవాన్​ను చికిత్స నిమిత్తం నాగ్​పూర్​కు తరలించారు. గాయపడిన, తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. గాయపడిన వారు ఈ రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లుగా నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో తెలంగాణ-, చత్తీస్​గఢ్ బార్డర్​లో బలగాలు మోహరించారు.