- గ్రేటర్లో ఇంకా 40 శాతం పనులు పెండింగ్
- భారీ వానల కురిస్తే మునక తప్పదంటున్న నిపుణులు
- చెట్లు, వ్యర్థాలతో నిండిపోయిన కవాడిగూడ, అంబర్ పేట, టోలిచౌకి నాలాలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో పూడికతీత పనులు జరగడం లేదు. ఎక్కడికక్కడ నాలాలు చెత్త, ప్లాస్టిక్ పేరుకుపోయి కనిపిస్తున్నాయి. వానా కాలానికి ముందే పనులు పూర్తిచేయాల్సి ఉండగా మే చివరి నాటికి పూర్తయ్యింది. 60 శాతమే. ఆ తర్వాత వానలు మొదలవడంతో అప్పటివరకు నత్తనడకన సాగిన పనులు దాదాపుగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. పూడికతీత పనులు ఏడాది మొత్తం కొనసాగుతాయని అధికారులు ప్రకటనలు చేసినప్పటికీ నామ్ కే వాస్తేగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నాలాల్లో రెండేండ్లుగా పూడిక తీయలేదు. పెద్దపెద్ద చెట్లు విరిగి పడ్డాయి. వ్యర్థాలు పేరుకుపోయి మురుగు ముందుకు కదలట్లేదు. జీహెచ్ఎంసీ ఏటా వానా కాలానికి ముందే ప్రధాన నాలాలు, వర్షపు నీటి కాల్వల్లో పూడిక తీయిస్తుంది. దీంతో వరద నీరు సాఫీగా చెరువులు, మూసీ నదిలోకి వెళ్లేందుకు వీలుంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు వెయ్యి కి.మీ మేర వర్షపు నీటి కాలువలు ఉన్నాయి. ఇందులో మేజర్ నాలాలు 398 కిలో మీటర్లు, పైపులైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలోమీటర్లకు పైగా ఉన్నాయి. వీటిల్లో పూడికతీత తీసేందుకు రూ.55 కోట్లు ఖర్చు చేస్తోంది.
ఎక్కడా కనిపించట్లే
వానా కాలానికి ముందుకు 83 మేజర్ నాలాల్లోని పూడికను యంత్రాల ద్వారా, 23 డ్రెయిన్‌లలో రీసైక్లర్స్ ద్వారా, 214 చిన్న సైజు నాలాల్లో మ్యానువల్‌గా పూడిక తీయాలని అధికారులు నిర్ణయించారు. తీసిన మట్టిని, వ్యర్థాలను సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యతను కాంట్రాక్టర్లకే అప్పగించారు. మొత్తం పనులు మే31 నాటికి పూర్తి కావాల్సి ఉంది. మొత్తం 5 లక్షల 42వేల 239 క్యూబిక్ మీటర్లు పూడిక తీయాల్సి ఉండగా అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు తీసింది 3.39 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే. అంటే ఇంకా 40శాతం పూడిక తీయాల్సి ఉంది. ఇప్పటికే వానలు మొదలై నెలన్నర అయ్యింది. ప్రస్తుతం పూడికతీత పనులు జరుగుతున్నట్లు ఎక్కడా కనిపించడంలేదు. కవాడిగూడ, అంబర్ పేట, టోలిచౌకి నాలాల్లో విరిగిపడిన చెట్లు, పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్చెత్త పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ఈ ఏరియాల్లో భారీ వానలు కురిస్తే వరద నీళ్లు ముందుకు వెళ్లే దారి కనిపించడం లేదు.
గతేడాది టెండర్ల ఎఫెక్ట్
గడిచిన రెండేళ్లలో వానల టైంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏడాది పొడవునా పూడికతీత పనులు చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. భారీ వానలు కురిసినప్పుడు వరద ముందుకు వెళ్లక నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కాలనీలు, బస్తీలు మునుగుతున్నాయి. వానలు తగ్గినా వరద ప్రభావం తొలగడంలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలాల పూడిక తీత పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటివరకు పూర్తికాలేదు. భారీ వానలు కురిస్తే ఈసారి కూడా వరద ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల నాలాల పనులకు సంబంధించి నిర్లక్ష్యం వహించారని 38 మంది ఇంజనీరింగ్ఆఫీసర్ల జీతాల్లో కమిషనర్ లోకేశ్‌కుమార్ కోత విధించారు. అయినప్పటికీ అధికారుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. గతేడాది నాలాల పూడికతీత టెండర్లకు సంబంధించి అవకతవకలు జరగడం కూడా ఈ ఏడాది పనులపై ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఆ గందరగోళం కారణంగా గతేడాది చేసిన పనులకే నేటికీ బిల్లులు అందలేదు.
రెండేళ్లుగా తీయట్లే
రెండేళ్లుగా మా ఏరియాలోని నాలాను ఎవరూ పట్టించుకోవడం లేదు. చెట్లు విరిగి పడుతున్నా తీసే నాథుడు లేడు. నాలాను క్లీన్ చేస్తే వచ్చే మురుగు నీరు సాఫీగా వెళ్తుంది. కానీ పూడిక తీయట్లేదు. చెత్తతో నిండిపోయి ఉంది.
- అన్వర్, టోలిచౌకి
పనులు ఎందుకు పూర్తి చేయలే
నిరంతర ప్రక్రియగా నాలాల పూడికతీత కొనసాగుతుందని ఆఫీసర్లు చెప్పిన మాటలు ఏమయ్యాయి. కొత్త యంత్రాలను వినియోగిస్తున్నామన్నారు కదా.. ఎక్కడ తీస్తున్నారు. వానాలకు ముందు చేయాల్సిన పూడిక తీత పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు. - శివకుమార్, కవాడిగూడ