గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇద్దరు అమ్మాయిలను అతిగా నమ్మిన ఓ ఆఫీసర్‌ను నిలువునా దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన రాయల భవాని, రాయల శ్రీలత అక్కాచెల్లెల్లు. వీరి తండ్రి నాలుగేండ్ల కింద సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో రిటైర్డ్ అయ్యాడు.
బెనిఫిట్స్ కోసం వీరు సింగరేణిలో పనిచేసే ఓ ఆఫీసర్‌ను కలవగా ఆయన సహకరించాడు. ఆయనతో ఏర్పడిన పరిచయం కొనసాగుతూ వచ్చింది. ఈక్రమంలో వారు ఆఫీసర్ ఇంటికి వచ్చి పోతుండేవారు. అక్కాచెల్లెళ్లిద్దరికి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు సదరు ఆఫీసర్డబ్బు సాయం కూడా చేసేవాడు. కాగా, ఆ అధికారి వద్ద డబ్బులు, బంగారం ఉండడాన్ని గమనించిన అక్కాచెల్లెళ్లు ఎలాగైనా దోచుకోవాలని ప్లాన్ వేశారు. ఈ విషయాన్ని శ్రీలత తన భర్త వెంకటేశ్వర్లుకు చెప్పింది. ఇటీవల ఆ ఆఫీసర్ రామగుండం ఏరియాకు బదిలీ కావడంతో దోపిడీకి ప్లాన్ చేశారు.
రెండు రోజుల కింద గోదావరిఖని జీఎం కాలనీలోని క్వార్టర్స్‌లో ఆఫీసర్ ఒంటరిగా ఉండగా, ముగ్గురు అక్కడికి వచ్చారు. వెంకటేశ్వర్లు ఆఫీసర్ గొంతుపై కత్తి పెట్టి అమ్మాయితో చెడుగా ప్రవర్తిస్తావా అంటూ 4 సెల్ఫోన్లు, తొమ్మిది తులాల బంగారు నగలు, ఫోన్ పే ద్వారా రూ.1.90 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకుని, రూ.20 లక్షల ఖాళీ చెక్‌పై సంతకం చేయించుకుని పారిపోయారు. దీంతో ఆఫీసర్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితులు బంగారం, ఫోన్లు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
నగలు, సెల్ఫోన్లు, రూ.83 వేల నగదు రికవరీ చేసి జైలుకు తరలించారు. రాయల వెంకటేశ్వర్లు, శ్రీలతపై గతంలో ఖమ్మం జిల్లా ఖానాపూర్హవేలీలో బొమ్మ తుపాకీ చూపెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసు ఉంది. కేసును ఛేదించిన వన్‌టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్‌ఐ ఎన్.సుగుణాకర్, క్రైమ్టీమ్సిబ్బంది జి.వెంకటేశ్, టి.శ్రీనివాస్‌ను పెద్దపల్లి డీసీపీ డాక్టర్ చేతన అభినందించారు.