హైదరాబాద్ సిటీ, వెలుగు: గోషామహల్లో మరోసారి నాలా పైకప్పు కుంగింది. దారుస్సలామ్ నుంచి చాక్నావాడి వెళ్లే దారిలో ఓ ఫ్లైవుడ్ దుకాణం ముందు బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 40 ఏండ్ల కింద నిర్మించింది కావడంతోనే కుంగిందని స్థానికులు చెప్తుండగా, అదృష్టవశాత్తు ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 2022లోనూ ఇక్కడికి 200 మీటర్ల దూరంలో 100 మీటర్ల మేరా నాలా పైకప్పు కుంగింది. అప్పట్లో అక్కడ నిలిపి ఉంచిన కార్లు, ఆటోలు, బైక్‌లు, కూరగాయల బండ్లు ధ్వంసం కావడంతో పాటు పలువురు గాయపడ్డారు.
తర్వాత ఆరునెలల్లోనే మరోసారి ఇలాగే కుంగింది. రెండేండ్లలో మూడుసార్లు కుంగడంతో స్థానికులు ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో మంగళ్ హాట్ బోయిగూడ కమాన్ నుంచి గోషామహల్ మీదుగా మూసీ వరకు ఈ నాలా నిర్మించారు. పాతబడిపోవడం, గోషామహల్ ప్రాంతంలో ఎక్కువగా టింబర్ డిపోలు ఉండడంతో ఈ రోడ్డుపై నుంచి భారీ వాహనాలు హెవీ లోడ్ తో తిరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల కూడా రోడ్డు వరుసగా కుంగిపోతోందని స్థానికులంటున్నారు. దీనిపై అధికారులకు గతంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదంటున్నారు.
కొత్తది నిర్మిస్తామని హామీ.. అయినా..
మొదటిసారి ఈ నాలా కుంగినప్పుడు పురాతనమైనది కాబట్టి పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మిస్తామని అప్పటి బీఆర్ఎస్సర్కారులోని మంత్రి హామీ ఇచ్చారు. అయినా అధికారులు ఎక్కడైతే కుంగిందో అక్కడే పనులు చేసి మమ అనిపించారు. దీంతో మిగతా ప్రాంతాల్లో ఒక్కోసారి ఒక్కోచోట నాలా కుంగుతోంది. ప్రస్తుతం కుంగిన నాలా రిపేర్పనులను త్వరలోనే పూర్తి చేస్తామని బల్దియా అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగరంలో పురాతన నాలాలు ఎన్ని ఉన్నాయో గుర్తించి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు. కోర్ సిటీలోనే ఎక్కువగా పురాతన నాలాలు ఉండగా, ఎంసీఎహచ్ఉన్న టైంలోనే నిర్మించినవి దాదాపు 3వేల కిలోమీటర్ల మేర ఉండొవచ్చని అధికారుల అంచనా.
వరుసగా కుంగుతున్నా...
గతంలో గోషామహల్, హిమాయత్ నగర్, ఎంజీబీఎస్–చాదర్ ఘాట్ మెయిన్‌రోడ్డుపై, ఎన్టీఆర్గార్డెన్ ముందు, కూకట్ పల్లిలోని ఉషా ముళ్లపూడి రోడ్డు గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నాలాపై రోడ్డు కుంగింది. ఇందులో ఒక్క ఎన్టీఆర్ గార్డెన్ ముందు మినహా మిగతా ప్రాంతాల్లో గతేడాదే ఈ ఘటనలు జరిగాయి. సిటీలో డ్రైనేజీ, నాలాలు చాలావరకు ఎప్పుడో నిర్మించినవి కావడంతోనే ఈ సమస్య ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. పురాతనమైనవే కాకుండా కొన్నిచోట్ల 10 ఏండ్ల కింద నిర్మించిన నాలాలు కూడా కుంగుతున్నాయని.. పనుల్లో లోపాలే వీటికి కారణాలని చెప్తున్నారు.
నెలల తరబడి పనులతో ఇబ్బందులు
సిటీలో అక్కడక్కడా రోడ్లు కుంగుతుండడంతో జనం భయపడుతున్నారు. మరోవైపు పాత లైన్లు ఉన్న ప్రాంతంలో ముందస్తుగా రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్న సంగతిని అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగిన సమయంలోనే హడావిడి చేస్తున్న అధికారులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. వెంటనే పనులు కూడా మొదలుపెట్టడం లేదు. కుంగిన చోట కూడా నెలల తరబడి పనులు చేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
హిమాయత్నగర్లోనే రెండు సార్లు
హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5లో గతేడాది జనవరి 28న రహదారి ఒక్కసారిగా కుంగింది. ఇది నిజాం కాలం నాటి డ్రైనేజీ లైన్. ఇది వినియోగంలో లేదు. ఎలాగూ పని చేయడం లేదు కాబట్టి పట్టించుకోవడం మానేశారు. దానిపై రోడ్డు వేస్తూనే పోయారు. కానీ కింద ఉన్న లైన్ పట్టించుకోకపోవడంతో బరువు పెరిగి కుంగింది. మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ కుంగిన ఈ గుంతలో ఇరుక్కుపోయింది. కొద్దిరోజుల్లో ఇదే హిమాయత్ నగర్ లోని మినర్వా కాఫీ షాప్ కు ఎదురుగా మెయిన్ రోడ్డుపై మ్యానువల్కుంగింది. చాదర్ ఘాట్ లో మెయిన్‌రోడ్డుపై కూడా 20 ఫీట్ల గుంత పడింది. ఇక్కడ 1100 ఎంఎం డయా సీవరేజీ పైపులైన్ ఉంది. కింద పైపు డ్యామేజ్ కావడంతోనే ఈ గుంత పడింది. ఇలా అకస్మాత్తుగా పెద్ద పెద్ద గుంతలు పడుతుండడంతో వాహనదారులు, స్థానికులు భయపడుతున్నారు.