మాన్సూన్​ మొదలైనా ఆగని తవ్వకాలు

మాన్సూన్​ మొదలైనా ఆగని తవ్వకాలు
  •     తాము పర్మిషన్లు ఇవ్వట్లేదంటున్న బల్దియా అధికారులు
  •     అడ్డగోలుగా రోడ్లను తవ్వేస్తున్న కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు
  •      మెయిన్​రోడ్ల నుంచి అంతర్గత రోడ్ల వరకు ఇదే పరిస్థితి
  •     ఎన్ఓసీలు లేకుండానే వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ, కేబుల్స్ పనులు

హైదరాబాద్, వెలుగు : వానాకాలం మొదలైనా సిటీలో రోడ్ల తవ్వకాలు ఆగడం లేదు. ప్రస్తుతం సిటీలో తవ్వకాలకు అనుమతివ్వడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వాటర్ పైపులైన్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, కేబుల్స్ ఇలా రకరకాల పనుల పేరుతో కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు రోజుకోచోట రోడ్లను తవ్వుతున్నాయి. పైగా పనులు పూర్తయినచోట తిరిగి రోడ్లు వేయడంలేదు. తవ్విన మట్టితో గోతులను పూడ్చి మమ అనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వానల టైంలో బైక్స్​స్కిడ్​అవుతున్నాయి. రోడ్డు తవ్వే ముందు కాంట్రాక్టర్లు తప్పనిసరిగా జీహెచ్ఎంసీ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. వానలు మొదలవడంతో ఈ నెల నుంచి గ్రేటర్​పరిధిలో ఎటువంటి తవ్వకాలకు అనుమతి లేదు. ఏదైనా పనిలో భాగంగా తవ్వాల్సి వస్తే ఎన్ఓసీ తప్పనిసరి తీసుకోవాలి. కానీ కాంట్రాక్టర్లు అవే పట్టించుకోవడం లేదు. ఎన్ఓసీలు తీసుకోకుండానే రాత్రికిరాత్రి రోడ్లను తవ్వేస్తున్నారు. వారి పనులు చేసుకొని వదిలేస్తున్నారు.

దీంతో చాలాచోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎన్ఓసీలు తీసుకోకుండా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై బల్దియా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కువ కాలం ఉండేలా జీహెచ్ఎంసీ కొన్ని ఏరియాల్లో వైట్​ ట్యాపింగ్​రోడ్లను వేసింది. వాటిని ఐదేళ్లపాటు తవ్వడానికి వీల్లేదు. అయితే కాంట్రాక్టర్లు ప్రస్తుతం వాటిని కూడా తవ్వేస్తున్నారు. 

వెయ్యి కి.మీ. మేర డ్యామేజ్

మెయిన్​రోడ్ల నుంచి కాలనీలకు వెళ్లే రోడ్లను ఏదో ఒక పని పేరుతో కాంట్రాక్టర్లు తవ్వుతూనే ఉన్నారు. ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో రోడ్లను తవ్వేసి రిపేర్లు చేయడం లేదు. గ్రేటర్​లో 9,013 కి.మీ మేర రోడ్లు విస్తరించి ఉన్నాయి. ఇందులో 2,846 కి.మీ మేర బీటీ రోడ్లు, 6,167 కి.మీ మేర అంతర్గత సీసీ రోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం అంతర్గత రోడ్లు దారుణంగా ఉన్నాయి. దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు డ్యామేజ్​అయ్యాయి. అడ్డగోలుగా తవ్వుకుంటూ పోతుంటే మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి.

బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. మెహిదీపట్నంలో మెయిన్​రోడ్డుపై ఎలక్ట్రిసిటీ పనులు చేసి 40 రోజులు అవుతున్నా, తిరిగి రోడ్డు వేయలేదు. ఏజెన్సీ పట్టించోవడంలేదు. దీంతో డైలీ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. టోలిచౌకి ఫ్లైఓవర్ కింద ఐదునెలలుగా పనులు చేస్తూనే ఉన్నారు. పనులు నెమ్మదిగా సాగుతుండడంతో గుంతలు పెద్దవి అవుతున్నాయి.

జీయాగూడ నుంచి పురానాపూల్ వెళ్లే బైపాస్ రోడ్డులో వాటర్ బోర్డు పనులు జరుగుతున్నాయి. 30 ఫీట్ల మేర గుంతలు తవ్వతున్నారు. భారీ వర్షాలు పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.