గలీజ్..కంపుతో ముక్కుపుటాలు అదురుతున్నాయ్

గలీజ్..కంపుతో ముక్కుపుటాలు అదురుతున్నాయ్
  • సర్వేల్లో ర్యాంకులకు బల్దియా ఆరాటం
  • మిగతా టైంలో వేస్టేజ్​ను ముట్టరు.. తియ్యరు
  • క్లీనింగ్​ కోసం రూ. కోట్లు కేటాయిస్తున్నా.. ఫలితం సున్నా

హైదరాబాద్​, వెలుగు: సిటీలో ఎప్పటికప్పుడు క్లీన్​గా ఉండాల్సిన వీధులు చెత్తతో నిండిపోతున్నాయి. కుప్పలుగా చెత్త పేరుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్ల పక్కపొంటి నుంచి పోతుంటే కంపుతో ముక్కు పుటాలు అదురుతున్నాయి. కుక్కలు, పందులతో గల్లీలు గలీజ్​అవుతు
న్నాయి. నెలకొక్కసారన్నా ఈ చెత్తను తీయడం లేదు. గార్బెజ్​ వెహికల్స్ ​గల్లీ దిక్కు రావడం లేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే... కేంద్రం​ గతేడాది ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ​​ర్యాంకింగ్​లో హైదరాబాద్​ బెస్ట్​ క్లీనెస్ట్​ సిటీగా ఫస్ట్ ​ర్యాంక్​లో నిలిచింది. ఇది ఆశ్చర్యంగా అనిపించినా.. బల్దియా అధికారులు మాత్రం దీనికోసం పక్కాగా ప్లాన్​ చేసి అవార్డును అందుకున్నారు.
3 నెలలే హడావుడి
గతేడాది జనవరి నుంచి మార్చి వరకు సిటీలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరిగింది. సర్వే అధికారులను మెప్పించడానికి బల్దియా అధికారులు ఆరాట పడ్డారు. 3 నెలల పాటు సిటీని అద్దంలా మార్చారు. సర్వేకు కొద్ది రోజుల ముందే డస్ట్​బిన్ ​లెస్​ సిటీ అంటూ గల్లీల్లో అన్ని చెత్త డబ్బాలను తీసేశారు. దీంతో చెత్తను ఎక్కడ వేయాలో తెలియక సిటి జన్లు రోడ్ల మీద, గల్లీల్లో వేశారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకున్నా అధికారులు పట్టించుకోలేదు. కానీ, స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అనగానే హడావుడిగా చెత్తను తొలగించారు. చెత్త ఎక్కువున్న ప్రాంతాల్లో షిఫ్ట్ ల వారీగా సిబ్బందిని పెట్టి మరీ క్లీన్​ చేయించారు. సర్వే జరిగినన్ని రోజులూ వీధుల్లో కాగితం ముక్క కూడా కనిపించనివ్వలేదు. దీని ఫలితంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్​లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్​లో నిలిచింది. అయితే మార్చిలో సర్వే ముగిసిన కొన్ని రోజులకే అధికారులు క్లీనింగ్​ను  లైట్​ తీసుకున్నారు. మళ్లీ చెత్త సమస్య మొదటికి వచ్చింది. ప్రస్తుతం సిటీ గల్లీల్లో ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. నెలకు ఒక్కసారైనా అధికారులు క్లీన్​ చేయడం లేదని స్థానికులు అంటున్నారు. 
ఫస్ట్ ర్యాంక్ కోసం
 స్వచ్ఛ భారత్​ కార్యక్రమంలో భాగంగా 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ సర్వేక్షణ్​ అవార్డులో హైదరాబాద్​కు  గతేడాది వరకు సరైన స్థానం దక్క లేదు. దేశంలోని అన్ని నగరాలతో పోల్చితే హైదరాబాద్​కు 2015లో 275, 2016 లో 19, 2017లో 22​, 2018లో 27, 2019లో 35వ ర్యాంక్​ రాగా.. ఉంటే 2020లో 23వ ర్యాంక్  వచ్చింది. దీంతో 2021లో అయినా ఫస్ట్​ ర్యాంక్​ తెచ్చుకోవాలని అధికారులు పక్కాగా ప్లాన్​ చేశారు. సర్వే టైంలో అలర్ట్​ అయి.. సిటీ వీధుల్లో చెత్త లేకుండా చేశారు. అందుకే ఫస్ట్​ ర్యాంక్​ను వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. సర్వే టైంలో పని చేసినట్టుగానే మిగతా టైంలో పని చేస్తే సిటీ నిజంగా క్లీన్​గా మారుతుందనీ, అవార్డులకు వాల్యూ ఉంటుందనీ సిటిజన్లు అంటున్నారు.
రూ.కోట్లల్లో ఖర్చు
చెత్త తరలించడానికి గతంతో పోలిస్తే బల్దియా ఎక్కువే ఖర్చు చేస్తోంది. 2016 వరకు ఏడాదికి కేవలం రూ.160 కోట్ల బడ్జెట్​తో చెత్తను తరలించేది. ఆ తర్వాత ఏజెన్సీల భాగస్వామ్యంతో ఏటా రూ.660 కోట్ల వరకు ఖర్చు పెడుతోంది. గతంలో జీహెచ్ఎంసీకి 800 సొంత గార్బెజ్​ వెహికల్స్ ఉండేవి. వీటి ద్వారా చెత్తను డంపింగ్ ​యార్డ్ లకు తీసుకెళ్లేవారు. వాటి సర్వీస్​ 15 ఏండ్లు దాటిందని సుమారు 600 వెహికల్స్​ను పక్కన పెట్టారు. ప్రస్తుతం 200 వెహికల్స్​తో​ చెత్తను తరలిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ రూ.460 కోట్ల ఖర్చు పెరిగినా చెత్త సమస్య అలాగే ఉంది.