ఇన్వెస్ట్ పేరిట రూ. 3 కోట్లు వసూలు..మహిళ అరెస్ట్

ఇన్వెస్ట్ పేరిట రూ. 3 కోట్లు వసూలు..మహిళ అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: ఎన్ఆర్ఐ మహిళను అని.. ఫుడ్ బిజినెస్, బ్యూటీ పార్లర్ ఉన్నాయని, ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్​ఇస్తానని చెప్పి రూ.3.06 కోట్లు వసూలు చేసింది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిటర్న్స్​ఇవ్వకపోగా.. పోలీసు అధికారులు తెలుసంటూ బ్లాక్​ మెయిల్​చేసింది. దీంతో బాధితులు సైబరాబాద్​ పోలీసులను ఆశ్రయించాడు. సైబరాబాద్ ​ఎకనామిక్​ అఫెన్సెస్​ వింగ్​ పోలీసులు కేసు నమోదు చేసి మహిళను అరెస్ట్​ చేశారు. 

ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్​ తెలిపిన ప్రకారం.. శేరిలింగంపల్లి నల్లగండ్లకు చెందిన పానుగంటి ఇందిరాదేవిరెడ్డి(29) ఎన్ఆర్ఐ మహిళాగా ఓ వ్యక్తిని పరిచయం చేసుకుంది. తన ఫుడ్​బిజినెస్ లో పెట్టుబడులు పెడితే భారీగా రిటర్న్స్​ఇస్తానని చెప్పి రూ. కోటి తీసుకుంది. రిటర్న్స్​ఇవ్వకపోవడంతో బాధితుడు మాదాపూర్​పోలీసులను కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇందిరాదేవిరెడ్డి అరెస్ట్​ చేసి జైలుకు పంపారు. 

ఈ కేసులో భాగంగా ఆమె ఒక అడ్వకేట్​ను సంప్రదించి.. అతని భార్యను పరిచయం చేసుకుంది. ఆ అడ్వకేట్​భార్య ద్వారా ఇందిరాదేవిరెడ్డికి మదీనగూడకు చెందిన ట్యాక్స్​కన్సల్టెంట్​సత్యనారాయణను పరిచయం చేసుకుంది. బ్యూటీ పార్లర్​ఉందని, నాగోల్​కు దేవి ఫుడ్స్​ఇండస్ర్టీ ఉందని చెప్పింది. మాదాపూర్​, గచ్చిబౌలి, నార్సింగి ఏరియాల్లో గేటేడ్​ కమ్యూనిటీల్లోని అపార్ట్​మెంట్లలో ఫ్లాట్స్​ ఉన్నాయని నమ్మించింది. 

తన ఇండస్ర్టీలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా రిటర్న్స్​ ఇస్తానని నమ్మించగా.. సత్యనారాయణ  రూ.3.06 కోట్లు ఇచ్చాడు. ఆ తర్వాత అతని వద్ద ఆమె రెండు కార్లను కూడా తీసుకుంది. వీటితో పాటు తన ఇద్దరు ఫ్రెండ్స్​పోలీసు అధికారులు అని చెప్పి రెండు ఐఫోన్లు, ఒక వన్​ప్లస్​ఫోన్​ అతనితో కొనుగోలు చేయించి తీసుకుంది. కొద్దిరోజుల తర్వాత సత్యనారాయణ తను ఇన్వెస్ట్ చేసిన  డబ్బులు, కార్లను తిరిగి ఇవ్వాలని ఇందిరాదేవిరెడ్డిని అడిగితే కేసులు పెట్టిస్తానని బ్లాక్​మెయిల్​చేసింది. 

దీంతో బాధితుడు సైబరాబాద్​ పోలీసులకు కంప్లయింట్ చేయగా  ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసి ఇందిరాదేవిరెడ్డిని అరెస్ట్​ చేశారు. ఆమె వద్ద రెండు కార్లు, ఒక ఫోన్​స్వాధీనం చేసుకున్నారు.