ఇల్లందు మున్సిపాలిటీలో బీఆర్ఎస్​ కౌన్సిలర్ల మధ్య విభేదాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇల్లందు మున్సిపాలిటీలో బీఆర్ఎస్​ కౌన్సిలర్ల మధ్య విభేదాలు వచ్చాయి. మున్సిపల్​ చైర్మన్​ డి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా ఆ పార్టీ కౌన్సిలర్లు ఆవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్యే బానోత్​ హరిప్రియకు తెలియకుండానే జరుగుతుందా అని చర్చించుకుంటున్నారు. అయితే అవిశ్వాసం తీర్మాణాన్ని కలెక్టర్​ అనుదీప్​ తీసుకోకపోవడంతో చైర్మన్​ వర్గీయులు ఊరటచెందారు. కలెక్టర్​ తీరుపై తాము కోర్టుకు వెళ్తామని పలువురు కౌన్సిలర్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లుండగా, ఇందులో ఇద్దరు ఇండిపెండెంట్లు, సీపీఐ, న్యూడెమోక్రసీకి చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. 

మిగిలిన వారు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు. కాగా మున్సిపల్​ పాలకవర్గం ఏర్పడి మూడేండ్లు పూర్తైన సందర్భంగా ఇటీవల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. ఇది జరిగి రెండు వారాలు గడవక ముందే చైర్మన్​కు వ్యతిరేకంగా 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తీర్మానం కాపీలో సంతకాలు పెట్టిన వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్యే హరిప్రియకు దగ్గరి వారే కావడం గమనార్హం. నలుగురైదుగురు మాత్రం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వర్గం వారున్నారు. అవిశ్వాసం పెడుతున్న కౌన్సిలర్లు తమ నాయకురాలు ఎమ్మెల్యే హరిప్రియ అని పేర్కొనడం గమనార్హం. సంతకం పెడితే రూ.10 లక్షల చొప్పున కౌన్సిలర్లకు ఆఫర్​ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉంటే పార్టీ ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మున్సిపల్​ చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. 

పైనుంచి ఫోన్... కలెక్టర్ రిజెక్ట్..?

అవిశ్వాస తీర్మానాలను అణచివేయడానికి అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏకంగా కలెక్టర్లకు ఫోన్ చేసి మరీ ఆదేశాలు ఇస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కౌన్సిర్లు సోమవారం చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై ఆవిశ్వాసం ప్రవేశపెట్టి, ఆ తీర్మాన కాపీని కలెక్టర్ అనుదీప్​అందించేందుకు గ్రీవెన్స్ కు వెళ్లారు. వీరిని చూసిన అడిషనల్ కలెక్టర్, తన చాంబర్ లో మాట్లాడుకుందామని చెప్పారు. కౌన్సిలర్లు నో చెప్పి, కలెక్టర్​ను కలిసేందుకు క్యూలో నిల్చున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఫోన్ రావడంతో కొద్దిసేపటికే సదరు కలెక్టర్.. గ్రీవెన్స్ నుంచి వెళ్లిపోయారు. దీంతో కౌన్సిలర్లు కలెక్టర్ చాంబర్​కు వెళ్లగా వారిని లోపలికి అనుమతించలేదు. 

కలెక్టర్ సీసీ.. తీర్మాన కాపీని బలవంతంగా లాక్కున్నాడు. ఇదే క్రమంలో తీర్మానం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని కలెక్టర్ అనడంతో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాపీని తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ గేటు వద్ద బైటాయించి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సిబ్బందితో మాట్లాడి తీర్మాన కాపీని తీసుకొచ్చారు. అనంతరం కౌన్సిలర్లు ఆ తీర్మాన కాపీని ఇన్ వార్డ్ లో ఇచ్చారు. కాగా, చైర్మన్ ​వెంకటేశ్వరరావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, మహిళా కౌన్సిలర్లను అవమానిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. మున్సిపల్​లో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉంటే 18మంది అవిశ్వాసానికి కోరుతున్నారని చెప్పారు. కలెక్టర్  కొందరికి తొత్తులుగా మారడం బాధాకరమన్నారు.