జగిత్యాల బల్దియాలో.. ఫేక్​ ప్రాపర్టీ అసెస్మెంట్ కాపీల​ దందా

2023 జనవరిలో జగిత్యాలకు చెందిన ఇక్రముద్దీన్ కొత్త ఇంటి పర్మిషన్ కోసం కావాల్సిన ఓల్డ్ అసెస్మెంట్ కాపీ నకలు కోసం బల్దియా లో అప్లై చేసి తీసుకున్నాడు. తర్వాత ఇంటి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఫేక్ అసెస్మెంట్ కాపీలను పెట్టారని, అతడికి ఇవ్వాల్సిన రాయితీని రద్దు చేస్తూ మూడు రెట్ల ఫీజు విధించారు.

దీంతో షాక్ కు గురైన దరఖాస్తుదారుడు ఆఫీసర్లను ప్రశ్నించగా ఫేక్ సర్టిఫికెట్స్​పెట్టినందుకే ఇలా చేశామని సమాధానమిచ్చారు. బల్దియాలోనే వేల రూపాయల ఫీజు కట్టి తీసుకున్నానని, ఫేక్​ ఎలా అవుతుందని నిలదీశాడు. ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లు బల్దియాలోనే ఫేక్​అసెస్మెంట్ల దందా జరిగిందని గుర్తించారు. అతడిని మళ్లీ ఒరిజినల్​డాక్యుమెంట్స్​తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

జగిత్యాల, వెలుగు: గ్రామ కంఠం, అబాదీలకు చెందిన స్థలాల్లో పాత ఇండ్లు కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం ట్యాక్స్​రాయితీతో పాటు ఎల్ఆర్ఎస్ ఫీజు మినహాయింపులు ఇస్తుండడంతో చాలామంది జగిత్యాల బల్దియాలో ఓల్డ్ ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలా మున్సిపల్​లో ప్రతి నెల 20- నుంచి 30 వరకు దరఖాస్తులు వస్తుంటాయి. అయితే, ఖాళీ స్థలాల్లో ఇండ్లు కట్టుకునే వారు మార్కెట్ వాల్యూ ప్రకారం 33 శాతం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాల్సి రావడంతో వారికి లబ్ధి చేకూరుస్తామని కొందరు మున్సిపల్ సిబ్బంది కొత్తరకం అక్రమాలకు తెరలేపారు. గ్రామ కంఠం, ఆబాదీ స్థలాల్లో ఇంతకుముందే ఇండ్లు ఉండి ఇప్పుడు కొత్తగా కట్టుకుంటున్నారని చూపిస్తూ ఫేక్​ ప్రాపర్టీ అసెస్మెంట్​కాపీల దందా మొదలుపెట్టారు. దీని కోసం ఏకంగా గతంలో పని చేసిన ఓ మున్సిపల్​కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఇలా ఇప్పటివరకు వేలల్లోనే అసెస్మెంట్ కాపీలను ఇచ్చి లక్షలు దండుకున్నట్టు తెలుస్తోంది. ఓ కాపీని వెరిఫై చేస్తుండగా మున్సిపల్​కమిషనర్​సంతకంపై అనుమానం వచ్చిన టౌన్​ప్లానింగ్​ఆఫీసర్​క్లియర్​గా చెక్​చేయగా అసలు విషయం బయటపడింది. 

ఎలా బయటపడిందంటే..

జగిత్యాలకు చెందిన ఇక్రముద్దీన్ తన ఇంటి నిర్మాణం కోసం ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్ కాపీలు కావాలని ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత ఇంటి పర్మిషన్ కోసం ఇచ్చే దరఖాస్తుతో పాటు వాటిని జత చేసి బల్దియాలో ఇచ్చాడు. అయితే, ఈ డాక్యుమెంట్స్​పై 2021 ఆగస్టు 9 నుంచి 2022 సెప్టెంబర్ 1 వరకు జగిత్యాల మున్సిపల్​కమిషనర్ గా పని చేసి వెళ్లిన స్వరూప రాణి సిగ్నేచర్ ఉండడంతో వెరిఫై చేసిన బల్దియా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు అనుమానం వచ్చింది. దీంతో స్వరూప కమిషనర్ గా ఉన్నప్పుడు మంజూరు చేసిన అసెస్మెంట్ కాపీల వివరాలు ఎంట్రీ చేసిన రిజిస్టర్ ను చూడగా కనిపించలేదు. దీంతో అతడి డాక్యుమెంట్​ను నకిలీగా తేల్చారు. కానీ, అతడు బల్దియా నుంచే తీసుకున్నానని చెప్పడంతో కొత్త కాపీ మంజూరు చేశారు.

ఫోర్జరీ సంతకాలపై చర్యలేవి?

ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్ నకలు కాపీలపై  ఏకంగా బల్దియా కమిషనర్​సిగ్నేచర్​ఫోర్జరీ చేసినట్టు తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇక్రముద్దీన్​డాక్యుమెంట్​ఒక్కటే కాదని, ఇంకా ఇలాంటి డాక్యుమెంట్లు వందల్లో ఉంటాయని తెలుస్తోంది. బల్దియా లో పని చేసే కొందరు సిబ్బంది, ఆధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఏకమై ఈ దందా నడిపించినట్టు తెలుస్తోంది. బల్దియాలోని కొంతమంది సిబ్బంది ఏకంగా రికార్డులను తమ ఇండ్లల్లో పెట్టుకుని ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్ నకలు కాపీలతో పాటు మరికొన్ని డాక్యుమెంట్లను తయారు చేసి ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సుమారు రూ.అర కోటికి పైగా వసూళ్లు చేసినట్టు సమాచారం. ఈ దందా మూడేండ్ల నుంచి సాగుతుండగా... గతంలో తాము పొందిన అసెస్మెంట్ కాపీలు ఫేక్ కాపీలా.. లేక ఒరిజినలేనా తెలియక జనాలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై   జగిత్యాల టీపీఎస్ తేజశ్విని వివరణ కోరగా కమిషనర్ సిగ్నేచర్ ఫోర్జరీ అంశం తమ దృష్టికి రాలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి అక్రమార్కుల గుట్టు బయటపెట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

ప్రాపర్టీ టాక్స్​ అసెస్మెంట్ కాపీ అంటే..

గ్రామ కంఠం, ఆబాదీ భూముల్లో ఏండ్లుగా నివాసం ఉంటూ కొత్తగా ఇంటి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రాపర్టీ టాక్స్​అసెస్మెంట్​కాపీ ఇస్తారు. దీనివల్ల ట్యాక్స్​రాయితీతో పాటు ఎల్ఆర్ఎస్ ఫీజు మినహాయింపులు ఇస్తారు. దీంతో ఈ డాక్యుమెంట్ కు డిమాండ్​ ఏర్పడింది. దీని కోసం దరఖాస్తుదారులు బల్దియాలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ అస్తులకైతే కాపీకి సుమారు రూ.3- నుంచి 9 వేలు, కమర్షియల్ ప్రాపర్టీ అయితే రూ.10- నుంచి 15 వేల వరకు అవుతుంది. ఆఫీసర్లు నిర్ణయించిన ఫీజు డీడీ రూపంలో బల్దియా కమిషనర్ పేరుపై బ్యాంకులో చెల్లించాలి. కమిషనర్ వెరిఫై చేసి ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్ నకలు కాపీలపై సిగ్నేచర్ చేసి దరఖాస్తుదారుడికి అందజేస్తారు.  

విచారణ జరుగుతోంది

అసెస్మెంట్ నకలు కాపీలో ఉన్న సిగ్నేచర్ పాత కమిషనర్​ది కాదని టైటిల్ వెరిఫికేషన్ ఆఫీసర్ గుర్తించారు. ఇలాంటిది ఒక్క ఘటన మాత్రమే జరిగింది. ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశాం. రిపోర్టు వచ్చాక ఎవరు చేశారో గుర్తించి డిపార్ట్​మెంట్​చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు పెడుతాం.. - నరేష్, ఇన్​చార్జి కమిషనర్, జగిత్యాల