బతికున్న వ్యక్తి చనిపోయినట్టుగా రికార్డు.. పెన్షన్ నిరాకరించిన అధికారులు

బతికి ఉన్న వ్యక్తిని రికార్డుల్లో చంపేశారు అధికారులు. అంతేకాదు.. పెన్షన్ కూడా తొలగించారు. నేనే బతికే ఉన్నా.. నా పెన్షన్ నాకు ఇవ్వండి మహాప్రభో అని బాధితుడు వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటు చేసుకుంది.

అసలేం జరిగింది..? 

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన సబ్బని చిన్న నర్సయ్య అనే వికలాంగుడు గత నాలుగు సంవత్సరాల క్రితం పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే..ఇప్పటి వరకూ అతడికి పెన్షన్ మంజూరు చేయలేదు అధికారులు. చాలాసార్లు వెళ్లి అడిగినా ఫలితం లేకపోయింది. చివరకు స్థానికంగా ఉన్న బీజేపీ నేతలకు విషయం చెప్పడంతో వారు కూడా అవాక్కయ్యారు. 

బతికున్న సబ్బని చిన్న నర్సయ్య చనిపోయినట్టుగా రికార్డులో ఉండడంతో పెన్షన్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఆ తప్పును రికార్డుల్లో సరి చేయడంలో అధికారులు నాలుగేళ్లుగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అధికారుల తీరుకు నిరసనగా మల్లాపూర్ మండలం ఎంపీడీవో ఆఫీసు ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో దిగివచ్చిన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రికార్డులో ఉన్న తప్పును సరిదిద్ది.. సబ్బని చిన్న నర్సయ్యకు పెన్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఇన్ చార్జ్ ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు ఆందోళన విరమించారు.