వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామంలో శిరీష అనుమానాస్పద మృతిలో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. శిరీష మృతి కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. శిరీష సెల్ ఫోన్ కాల్ డేటా దర్యాప్తులో కీలకంగా మారింది.
శిరీష అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ప్రాంతాన్ని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. ఆ తర్వాత శిరీష ఇంటికి వెళ్లి.. ఆమె కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిరీష మృతికి ముందు ఇంట్లో జరిగిన గొడవపైనా ఆరా తీశారు. సెల్ ఫోన్ విషయంలో శిరీష.. ఆమె బావ అనిల్ తో గొడవ పడి.. ఇంట్లోనే ఒకసారి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఆ తర్వాత బయటకు వెళ్లి.. ఆత్మహత్య చేసుకుందా..? లేక ఇంకెమైనా జరిగిందా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
శిరీష దేహంపై ఉన్న గాయాల ఆధారంగా బయటి వ్యక్తులు ఎవరైనా హత్య చేసి ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇంట్లో జరిగిన గొడవల వల్ల శిరీష మనస్తాపం చెంది ఉంటుందని తాము భావిస్తున్నామని చెప్పారు. శిరీష సెల్ ఫోన్ కు లాక్ ఉన్నందున.. దాన్ని సైబర్ క్రైమ్ బ్రాంచ్ కు పంపించి...పూర్తి డేటా సేకరించి.. అన్ని వివరాలు చెబుతామన్నారు. శిరీష సెల్ ఫోన్ డేటా, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, సాంకేతిక ఆధారాల ద్వారా కేసును అతి త్వరలోనే చేధిస్తామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. శిరీషది హత్యా..? లేక ఆత్మహత్య..? అనేది పూర్తి దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామన్నారు.