- కామారెడ్డి జిల్లాలో 413 కంప్లైంట్
- ఆధార్‌లింక్ ప్రాబ్లమ్స్ 174
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఆధార్ లో తప్పుల వల్ల 174 మందికి లక్ష లోపు రుణమాఫీ ఆగిపోయింది. లిస్టులో పేర్లు రాని వారు, అకౌంట్లలో మాఫీ సొమ్ము జమకాని రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు జిల్లా వ్యవసాయ శాఖ ఆఫీసులో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసింది. గ్రీవెన్స్ సెల్ లో రైతుల నుంచి వ్యవసాయాధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇంకా ఆన్లైన్ లో స్టేట్ గ్రీవెన్స్ పోర్టల్ ను ఓపెన్ చేయాల్సి ఉంది. అయినప్పటికీ జిల్లాలో ఫిర్యాదుల్ని స్వీకరించి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నారు.
దీంతో ఈ నాలుగు రోజుల్లోనే అక్కడ 413 ఫిర్యాదులు రాగా.. అందులో 174 ఫిర్యాదులు కేవలం ఆధార్ లో తప్పులు ఉండటం వల్లే అని తేలింది. ఒకే కుటుంబం వివరాలు మరో కుటుంబంతో నమోదు అయినవి 73, రుణం మాఫీ అయిన వారి పేరిట పట్టాదారు పాస్ బుక్ లేకపోవడం వల్ల 36, అర్హత ఉన్నప్పటికీ మాఫీ కాలేదని, ఇతర ఆంశాలపై 130 ఫిర్యాదులు వచ్చాయి. మొదటి విడతలో కామారెడ్డి జిల్లాలో 49,541 మంది రైతులకు రూ. 235 కోట్ల 61 లక్షల రుణ మాఫీ అయ్యింది. మాఫీ అమౌంట్ రైతుల అకౌంట్లలో జమ చేసి లబ్ధిదారుల పేర్ల లిస్టులను గ్రామాలకు పంపారు.
రూ. లక్ష లోపు రుణం ఉన్నప్పటికీ ఇంకా కొంతమంది రైతుల పేర్లు మిస్సయ్యాయి. మరికొందరు రైతులకు సంబంధించి మాఫీ లిస్టులో పేర్లు ఉన్నప్పటికీ అకౌంట్లలో పైసలు జమ కాలేదు. రైతులు బ్యాంకులు, వ్యవసాయ ఆఫీసులకు వెళ్లి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. మాఫీ అయిన వారికి ఎంత మేర మాఫీ అయ్యింది, పరిస్థితి ఏమిటనేది గ్రామాల వారీగా లిస్టులు ఏఈవోల వద్ద ఉన్నాయి.
సమస్యలివీ..
లోన్ తీసుకున్నప్పుడు ఆధార్‌నంబర్ తప్పుగా ఎంట్రీ కావడం, పాస్ బుక్‌కు, ఆధార్ కార్డులో ఉన్న పేర్లలో పొరపాటుగా ఉండటం, ఒకరి ఆధార్‌నంబర్ మరొకరి పేరిట ఎంట్రీ కావడం, ఒక వ్యక్తి మాఫీ వివరాలు మరో కుటుంబంలో ఆన్‌లైన్‌లో చూపెడుతుండటం లాంటి సమస్యలు ఉన్నాయి. కొందరు భర్తలు విదేశాల్లో ఉండి వీరి పేరిట పట్టాదారు పాస్‌బుక్స్ ఉన్నాయి. భార్య పేరుతో లోన్ తీసుకోగా రుణమాఫీని కాలేదు. ఈ సమస్యలను సరిదిద్దితే రుణమాఫీ అమౌంట్ వారి అకౌంట్లలో జమ కానుంది. జిల్లాల వారీగా ఫిర్యాదులను స్టేట్ గ్రీవెన్స్ సెల్‌కు పంపిస్తారు. ప్రభుత్వం వీటిని క్లియర్ చేసిన తర్వాత రుణమాఫీ అమౌంట్
జమకానుంది.
ఆధార్‌కార్డు మరో రైతుతో చూపెడుతుందట
నా పేరిట రూ. 75వేల లోన్ ఉంది. మాఫీ లిస్టులో పేరు ఉన్నప్పటికీ అకౌంట్లో జమ కాలేదు. ఆఫీసర్లను అడిగాను. నా ఆధార్‌నంబర్ మరో వ్యక్తి దానితో చూపెట్టడంతో ఈ సమస్య వచ్చిందన్నారు. ఆధార్ నంబర్ సరి అయితే మాఫీ వస్తుందని అంటున్రు.
- మంచాల చిన్న లక్ష్మన్, లింగాపూర్, కామారెడ్డి మండలం
ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం
రుణమాఫీ విషయంలో సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. రైతులకు సందేహాలు ఉంటే నివృత్తి చేస్తున్నాం. ఫిర్యాదులు తీసుకుని ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నాం. వీటన్నింటిని స్టేట్‌కు పంపిస్తాం.
- భాగ్యలక్ష్మీ, జిల్లా వ్యవసాయాధికారి