కామారెడ్డి జిల్లాలో..పెరిగిన కరెంట్ వినియోగం

కామారెడ్డి జిల్లాలో..పెరిగిన కరెంట్ వినియోగం
  • కామారెడ్డి జిల్లాలో కీలక దశలో వరిపంట 
  • రోజూ ఆరు మిలియన్‌ యూనిట్ల విద్యుత్ వినియోగం

కామారెడ్డి, వెలుగు : ఎండలు తీవ్రత పెరగడం, యాసంగి సీజన్‌లో సాగుచేసిన వరితో పాటు ఇతర పంటలు కీలక దశలో ఉన్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో కరెంట్‌ వినియోగం భారీగా పెరిగింది. వారం రోజులుగా జిల్లాలో విద్యుత్‌ వినియోగం క్రమంగా పెరుగుతూనే ఉంది.   ఈ పరిస్థితి మరో 3 వారాల పాటు ఉండే అవకాశముందని ట్రాన్స్‌ కో  అధికారులు చెబుతున్నారు. వరి పంట కోతలు కంప్లీట్​అయితే కరెంట్‌కు డిమాండ్‌ తగ్గుతుందని పేర్కొంటున్నారు.  

జిల్లాలో ఈ నెల 25 సోమవారం 6.403 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ను వినియోగించారు.  నిరుడు ఇదే తేదీన  6.279 మిలియన్​ యూనిట్ల విద్యుత్‌ వాడారు.  జిల్లాలో  వివిధ కేటగిరిల్లో మొత్తం  4,22,497 విద్యుత్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. ఇందులో  2 లక్షల 70 వేల కనెక్షన్లు ఇండ్లకు సంబంధించినవి కాగా.. అగ్రికల్చర్‌‌ కు లక్షా 9  వేల కనెక్షన్లు ఉన్నాయి.  కమర్షియల్, ఇండస్ర్టీలకు సంబంధించినవి  43,497 కనెక్షన్లు ఉన్నాయి.

 ప్రతి రోజు డిమాండ్​ 5.5  మిలిమిన్​  యూనిట్ల నుంచి 6  మిలియన్​  యూనిట్ల వరకు ఉంటుంది.   ప్రధానంగా  జిల్లాలో   వ్యవసాయం భూగర్భజలాల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.  బోర్ల దగ్గర వరి, ఇతర పంటల్ని యాసంగిలో రైతులు సాగు చేశారు.  జిల్లా వ్యాప్తంగా  ఈ సీజన్లో  3,79,256 ఎకరాల్లో పంటలు సాగు చేయగా,  ఇందులో వరి 2,31,117 ఎకరాల్లో ఉంది.  దాదాపు లక్షా   80 వేల ఎకరాల వరకు బోర్ల మీదనే ఆధారపడి సాగు చేస్తున్నారు.  

కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లోని మండలాల్లో  వరి ప్రస్తుతం కీలక దశలో ఉండగా..  మరో 20 నుంచి 30 రోజుల్లో   కోతకు రానుంది.  ఎండలు పెరిగిన దృష్ట్యా  వరికి  నీటి అవసరం ఎక్కువగా ఉంది.  మరో వైపు  ఉష్ణోగ్రతలు తీవ్రమవుతుండటంతో  ఇండ్లలో  విద్యుత్  వినియోగం కూడా పెరిగింది.  ఏసీలు, కూలర్లను ఎక్కువగా వాడుతున్నారు. పగలు కూడా ఇండ్లలో  కరెంటు వాడకం  ఎక్కువగా ఉంది.   వీటన్నింటి దృష్ట్యా డిమాండ్​ పెరిగింది.

ఈ వారం రోజుల్లో వినియోగం ఇలా

ఈ వారం రోజుల్లో విద్యుత్‌ వినియోగం పెరుగుతూ వస్తోంది.  ఈ నెల 19న 4.983  మిలియన్​ యూనిట్ల కరెంట్ వినియోగించారు.  అంత కంటే 2 రోజుల ముందు జిల్లాలో వడగండ్ల వాన కురియటం, వాతావరణం చల్లబడిన దృష్ట్యా  విద్యుత్‌ వినియోగం తగ్గింది. మరుసటి రోజు నుంచి మళ్లీ ఎండలు పెరగడంతో  క్రమంగా  డిమాండ్​ ఎక్కువైంది.   20న 5.636 మిలియన్​ యూనిట్లు, 21న  5.568 మిలియన్​ యూనిట్లు, 22న  6.001 మిలియన్​ యూనిట్లు, 23న  6.307 మిలియన్​ యూనిట్లు,    24న  6.361 మిలియన్​ యూనిట్లు, 25న  6.403 మిలియన్​ యూనిట్లు విద్యుత్‌ను వినియోగం జరిగింది. 

ఆటంకాలు లేకుండా సప్లయ్​ చేస్తున్నాం

జిల్లాలో  కరెంట్‌ వినియోగం గణనీయంగా పెరిగింది.  అయినప్పటికీ డిమాండ్​కు  అనుగుణంగా సప్లయ్​ చేస్తున్నాం.  ఎలాంటి ఆటంకాలు లేకుండా  అగ్రికల్చర్​కు,  గృహా అవసరాలకు కరెంట్‌ సప్లయ్​ జరుగుతోంది. టెక్నికల్​గా ప్రాబ్లమ్స్​ లేకుండా చూస్తున్నాం. 

రమేశ్​బాబు, ఎన్పీడీసీఎల్​  ఎస్​ఈ, కామారెడ్డి