ఇట్లుంటే.. ఎట్ల తినాలే?

ఇట్లుంటే.. ఎట్ల తినాలే?

కరీంనగర్ సిటీ, వెలుగు : చికెన్‍ కర్రీ నీళ్ల చారులా ఉండటంతో అన్నం తినకుండా పడేసి స్టూడెంట్స్ నిరసన తెలిపారు. కరీంనగర్‍ రీజినల్‍ స్పోర్ట్ స్కూల్‍ లో కొద్ది రోజులుగా కూరలు బాగుండటం లేదని స్టూడెంట్స్ ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. ఆదివారం చికెన్‍ కర్రీ పూర్తిగా నీళ్లచారులా ఉండటంతో విసిగిపోయిన స్టూడెంట్లు వేసుకున్న అన్నంతోపాటు కూరను మూకుమ్మడిగా డస్ట్ బిన్‍లలో పడేశారు. కొందరు స్టూడెంట్లు అన్నం తినకుండా ప్లేట్​లను వదిలేసి వెళ్లిపోయారు.

హాస్టల్‍ లోనే ఎప్పటికప్పుడు వేడిగా వండి స్టూడెంట్లకు పెట్టాలి. కానీ ఇక్కడ కొంతకాలంగా మెస్‍ కాంట్రాక్టర్‍ బయట ఎక్కడో వండి వెహికల్​లో తీసుకువచ్చి పెడుతున్నాడు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‍ ఆర్‍వీ కర్ణన్‍ హైదరాబాద్‍కు చెందిన స్నేహ క్యాటరర్స్ కు షోకాజ్‍ నోటీస్‍ అందించారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. స్నేహ క్యాటరర్స్ పేరిట కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ స్థానిక నాయకుడు ఒకరు పిల్లలకు భోజనం సప్లై చేస్తున్నాడు. దీంతో భోజనం క్వాలిటీగా ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.