కొండచిలువ.. ఈ పేరు వినగానే ఒళ్లు జలదరిస్తుంది కదూ. అలాంటిది మన ఇంట్లోకే వస్తే. ఏంటి పరిస్థితి? ఉన్నఫలంగా ఇంటి నుంచి ఆమడదూరంగా పారిపోతాం. అలాంటి అనుభవమే ఖమ్మంలోని ఓ ఇంటి ఓనర్‌కి అనుభవమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పబ్లిక్ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి విషసర్పాలు, కీటకాలు వస్తుండటంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఆరు అడుగుల కొండచిలువ వర్షానికి ఇంట్లోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని కల్వ ఒడ్డు ప్రాంతంలోని ఓ ఇంట్లోకి జులై 27న కొండ చిలువ ప్రవేశించింది. భయాందోళనకు గురైన ఇంటి వాసులు స్థానికులకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో దాన్ని అదుపులోకి తీసుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీనికి తోడు ఇళ్లలోకి పాములు రావడం ఆందోళన కలిగిస్తోంది.