ఖమ్మం/ ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు రెట్టింపయ్యాయి. ఈకేసుల్లో ఈసారి రికవరీ తగ్గింది. 2022లో నమోదైన కేసులు, ఇతర వివరాలను శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ మీడియాకు వెల్లడించారు. 2021లో సైబర్ నేరాలకు సంబంధించి 605 కంప్లైంట్స్ రాగా, ఈ సారి 52 శాతం పెరిగి 1249 కంప్లైంట్స్ వచ్చాయి. గతేడాది 97 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయగా, ఈ సారి 203 నమోదయ్యయి. మోసాల కారణంగా గతేడాది రూ.2 కోట్ల 20 లక్షల 57 వేలు నష్టపోగా, ఈ సారి రూ.4 కోట్ల 51 లక్షల 88 వేలకు చేరింది. గతేడాది రూ.20.53 లక్షలు రికవరీ చేయగా, ఈ సారి మాత్రం రూ.5.28 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులు 440 నుంచి 930కి పెరిగాయి.
స్వల్పంగా పెరిగిన కేసులు..
జిల్లాలో ఓవరాల్ గా నమోదైన కేసుల సంఖ్య గతేడాదితో పోలిస్తే పెద్దగా మార్పులేదు. గతేడాది 7,239 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, ఈ ఏడాది 7,304 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. గత ఏడాది273 ప్రాపర్టీ కేసులను పరిష్కరించగా, ఈ ఏడాది 338కి పెరిగింది. ప్రాపర్టీ రికవరీ 51 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. క్లూస్ టీమ్స్ పనితీరు, సీసీ కెమెరాల కారణంగా కేసుల డిటెక్షన్ 19 శాతం పెరిగిందని సీపీ చెప్పారు. ఇండ్లలో దొంగతనాల సంఖ్య 242 నుంచి 198 కి తగ్గిందని వివరించారు. ఈ ఏడాది 25 మర్డర్లు జరిగాయని, 753 మహిళలపై వేధింపుల కేసులు, 186 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో 200 చనిపోయినట్లు చెప్పారు. తల్లాడ–-ఖమ్మం, కూసుమంచి–-ఖమ్మం, తిరుమలాయపాలెం–-ఖమ్మం రూట్లలో యాక్సిడెంట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించామని సీపీ చెప్పారు.
13 మందిపై పీడీ యాక్ట్..
ఈ ఏడాది 13 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీపీ తెలిపారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పారు. మేము సైతం ప్రోగ్రాం ద్వారా ప్రజలు, వ్యాపారులను మోటివేట్ చేసి జిల్లాలో 10వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం చేసిన వారిని అరెస్ట్ చేసి, శిక్ష పడేలా చేశామని, ఇంజక్షన్ మర్డర్ కేసులో 24 గంటల్లోనే నిందితులను పట్టుకోవడం రికార్డ్ అని చెప్పారు. అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు ఆంజనేయులు, బస్వారెడ్డి, రెహమాన్ పాల్గొన్నారు.
మావోస్టుల కదలికలపై నిఘా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా పెట్టామని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ఈ ఏడాది క్రైం రివ్యూకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఆఫీస్‌లో మీడియాకు వివరించారు. ఈ ఏడాది వివిధ కేడర్లకు చెందిన 46 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. గోదావరి వరదల్లో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో త్వరలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అనంతరం అడిషనల్ ఎస్పీ ప్రసాద్ ట్రాన్స్ఫర్ కావడంతో ఆయనను ఘనంగా సన్మానించారు. ఓఎస్డీ టి సాయి మనోహర్, అడిషనల్ ఎస్పీ రోహిత్‌రాజు, డీఎస్పీలు నందీరామ్, వెంకటేశ్వరబాబు, రమణమూర్తి, రాఘవేంద్రరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.
- ఈ ఏడాది 4,040 కేసుల నమోదు కాగా, గత ఏడాది 5,433 కేసులు నమోదు
- జిల్లాలో ఈ ఏడాది వివిధ కేడర్లకు చెందిన 24 మంది మావోయిస్టుల లొంగుబాటు, 46 మంది అరెస్ట్
- ఈ ఏడాది 21 మర్డర్లు జరగగా, గత ఏడాది16 మర్డర్ కేసుల నమోదు
- 106 పీడీఎస్ రైస్ కేసుల నమోదు
- రూ. 4.75 కోట్ల విలువైన 2,374 కేజీల గంజాయి స్వాధీనం. 108 మందిపై కేసుల నమోదు
- 23 మందిపై పీడీ యాక్ట్ నమోదు
- 12,050 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
- 1,389 సైబర్ నేరాలపై కంప్లైంట్స్,118 ఎఫ్ఐఆర్ లు నమోదు. రూ. 4.15 కోట్ల ప్రాపర్టీ రికవరీ
- 689 మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు, 84 పోక్సో కేసుల నమోదు