- చోరీలు, ఇతర మోసాలు తగ్గాయి
- మెగా జాబ్‌మేళాకు భారీ స్పందన
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో గతేడాదితో పోలిస్తే సైబర్ నేరాల సంఖ్య పెరిగి, దొంగతనాలు, ఇతర మోసాలు కాస్త తగ్గాయి. రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాల్లో మృతుల సంఖ్య మాత్రం పెరిగింది. చోరీ సొమ్ము రికవరీ ఈ ఏడాది బాగా తగ్గింది. గత ఏడాది జిల్లాలో మొత్తం 7,304 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 7,667కు పెరిగింది. గత ఏడాది 595 దొంగతనాలు జరగ్గా.. ఈసారి 466 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రూ.4.48 కోట్లు చోరీ కాగా ఇందులో 35 శాతం సొత్తు రికవరీ చేశారు. గతేడాది రికవరీ 53 శాతం ఉంది. గతేడాది 211 చీటింగ్ కేసులు నమోదు కాగా ఈ సారి187 కేసులు ఫైల్అయ్యాయి.
ఈ ఏడాదిలో 589 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 233 మంది మృతి చెందారు, 648 మందికి గాయాలయ్యాయి. మర్డర్ల సంఖ్య25 నుంచి 28కి పెరిగింది. గత ఏడాది 43 హత్యాయత్నం కేసులు నమోదు కాగి ఈసారి వాటి సంఖ్య 45కి పెరిగింది. ఆర్థిక నేరాల సంఖ్య 466 నుంచి 446కి తగ్గింది. చీటింగ్ కేసులు, ఫోర్జరీ కేసుల సంఖ్య కూడా తగ్గింది. సైబర్ నేరాల సంఖ్య 206 నుంచి 219కి పెరిగింది. ఆన్లైన్ మోసాల్లో సైబర్ నేరగాళ్లు రూ.9 కోట్లకు పైగా నగదును దోచుకున్నారు.
ఇందులో రూ.16.96 లక్షలు మాత్రమే రికవరీ చేయగా, రూ.1.42 కోట్లను ఆయా అకౌంట్లలో హోల్డ్ చేశారు. జిల్లాలో ఈ ఏడాది మహిళలకు సంబంధించిన కేసుల సంఖ్య 753 నుంచి 780కి పెరిగింది. వేధింపు కేసుల సంఖ్య 274 నుంచి 369కి పెరిగింది. పోక్సో కేసుల సంఖ్య మాత్రం 100 నుంచి 1కి తగ్గింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సంఖ్య 69 నుంచి 82కి పెరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ కు సంబంధించి 41 కేసులు నమోదు కాగా, 872 గంజాయి రవాణా కేసులయ్యాయి.
పోలీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా..
ఇక రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. 15వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా, 8200 మంది నిరుద్యోగులకు 150 కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న500 మంది యువతకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారిలో దాదాపు 200 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలకు ఫలితాలిచ్చాయి. జిల్లాలో జరిగిన జాతరలు, వరదలు, పండుగలు, ర్యాలీలు, సభల సమయాల్లో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు భద్రత చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్‌గా గుర్తించిన ప్రదేశాల్లో లోపాలను సరిదిద్దారు. సిగ్నల్ లైట్లు, బారికేడ్ల వినియోగం, రేడియం స్టిక్కర్లతో సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు, మద్యం తాగి వాహనాలు నడిపే వారికి కౌన్సెలింగ్, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించారు.