ఖమ్మం, వెలుగు: వరద ప్రభావం తగ్గిన తర్వాత తమ ఇండ్లకు చేరుకున్న బాధితులు, వారం రోజులుగా బురదలో మునిగిపోయిన వస్తువులను క్లీన్చేసుకుంటున్నారు. శానిటేషన్, వివిధ శాఖల సిబ్బంది ముంపు కాలనీల్లో బురద, చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా ఖమ్మం అర్బన్ప్రాంతంలో 9,155 ఇండ్లు డ్యామేజీ కాగా, ఆ తర్వాత ఖమ్మం రూరల్మండలంలో 2,808 ఇండ్లు, మధిరలో 1,149 ఇండ్లు, ఎర్రుపాలెం మండలంలో 424, కూసుమంచిలో 417 ఇండ్లు దెబ్బతిన్నాయి. వరద పోయి 8 రోజులవుతున్నా, ఇంకా ఇండ్లలో వంటలు వండుకునే పరిస్థితి లేకపోవడంతో దాతలు అందించే ఆహార పొట్లాలు, రిలీఫ్ క్యాంపుల్లో అందించే భోజనాలపైనే బాధితులు ఆధారపడుతున్నారు.
కాలనీవాసుల్లో టెన్షన్..
ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో కాసేపు వర్షం పడుతుండడంతో పాటు మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో ముంపు కాలనీల వాసులు టెన్షన్ పడుతున్నారు. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్జిల్లాలో భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్జిల్లాలో 18.2 సెంటీమీటర్లు వర్షం పడగా, ఖమ్మం జిల్లాలో 12.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత వారం ఖమ్మంలో మున్నేరు వరద బీభత్సం సృష్టించిన సమయంలోనూ ఖమ్మంలో కురిసిన వర్షం కంటే, మహబూబాబాద్జిల్లాలో వర్షాల ప్రభావం వల్ల ఆకేరు, మున్నేరుకు వరద రావడంతో తీవ్ర నష్టం జరిగింది. దీంతో మళ్లీ ఎగువన వర్షాలు కురుస్తున్నాయని తెలియడంతో ఆందోళన మొదలైంది.
మరోవైపు అధికారులు అలర్ట్ అయ్యారు. అర్థరాత్రి వరకు అప్రమత్తంగా ఉంటూ ముంపు కాలనీల్లోని జనాన్ని హుటాహుటిన రిలీఫ్క్యాంపులకు తరలించారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ స్వయంగా ధంసలాపురంలోని కాలనీల్లో పర్యటించి, అక్కడి వారిని అలర్ట్ చేశారు. అదే సమయంలో హైదరాబాద్‌నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం చేరుకొని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు.
రాత్రంతా భయమే..
ఖమ్మం, మహబూబాబాద్జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా మున్నేరు ముంపు కాలనీల వాసులు భయం గుప్పిట్లోనే గడిపారు. అధికారులు, పోలీసులు కూడా ముంపు కాలనీల్లో తిరుగుతూ ఇండ్లను ఖాళీ చేయాలని చెప్పారు. రిలీఫ్ క్యాంపులకు వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పటికే అష్టకష్టాలు పడుతుండగా, మళ్లీ వాన ఎందుకు వచ్చిందంటూ రిలీఫ్ క్యాంపులకు వెళ్లిపోయారు. శనివారం సాయంత్రానికి 10 అడుగులున్న మున్నేరు నీటి మట్టం, రాత్రి 10 గంటల వరకు 12.8 అడుగులకు పెరిగింది.
తర్వాత గంటలోనే 14 అడుగులకు చేరింది. క్రమంగా పెరుగుతూ ఆదివారం ఉదయం 7 గంటలకు 15.75 అడుగులకు చేరిన తర్వాత వరద ప్రభావం తగ్గడం మొదలైంది. ఎగువ ప్రాంతంలో వర్షం నిలిచిపోవడంతో ఇక వరద తగ్గుతూ వచ్చింది. ఆదివారం సాయంత్రానికి మళ్లీ 13 అడుగులకు చేరింది. అయితే మళ్లీ వర్షాలున్నాయని ఆఫీసర్లు చెబుతుండడంతో, ముంపు కాలనీల వాసులు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
కాలనీ వాసుల ఆందోళన
ఖమ్మం టౌన్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 11,12 డివిజన్ల పరిధిలోని కాల్వలను ఆక్రమించి నిర్మించిన సీఆర్జీ అపార్ట్మెంట్, న్యూ విజన్ స్కూల్ పక్కనే ఉన్న వాగుపై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చేయాలని కాలనీవాసులు ఆదివారం ఆందోళన చేపట్టారు. కుచించుకుపోయిన వాగును వంద అడుగుల వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. సీఆర్జీ అపార్ట్ మెంట్ ఎదురుగా ఉన్న వాగుపై ధర్నా చేశారు. కవిరాజ్ నగర్, సీఆర్జీ టవర్స్ పక్కన ఆక్రమణకు గురైన వాగును కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, సిటీ మేయర్ పునుకోలు నీరజ పరిశీలించారు.