ఫండ్స్​ లేవు... మన ఊరు–మనబడి పనులు వెరీ స్లో

  •     మొదటి దశలో పనుల కోసం 318 స్కూళ్ల ఎంపిక 
  •     ఇప్పటి వరకు 113 స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తి
  •     గతేడాది జూన్​లోపే కంప్లీట్​కావాల్సి ఉన్నా ఇంకా కొనసాగుతున్న పనులు 
  •     జులై నుంచి ఆగిన ఫండ్స్..వర్క్స్​ చేసేందుకు ముందుకురాని కాంట్రాక్టర్లు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గత ప్రభుత్వం హయాంలో జిల్లాలో మన ఊరు–మన బడి కింద చేపట్టిన పనులు ఫండ్స్​ లేక ముందుకు సాగడం లేదు. గతేడాది జూన్​ లోపు పూర్తి కావాల్సిన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. జూలై నుంచి ఫండ్స్​ రిలీజ్​ చేయకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దాదాపు రూ. 27కోట్ల విలువైన వర్క్స్​ ఆరు నెలలుగా నత్తనడకన నడుస్తున్నాయి. 

113 స్కూళ్లలోనే పూర్తయిన పనులు.. 

జిల్లాలో మొత్తం 1,065 స్కూళ్లు ఉన్నాయి. అందులో మొదటి దశలో 368 స్కూళ్లను మన ఊరు–మన బడి స్కీం కింద ఎంపిక చేశారు. 2022 మార్చిలో పనులు ప్రారంభం కాగా 2023 జూన్​ నాటికి వర్క్స్​ కంప్లీట్​ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ చాలా చోట్ల నిధుల కొరతతో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. జిల్లాలో చర్ల మండలంలో 23 స్కూళ్లకు గానూ ఒక్క స్కూల్​లోనూ వర్క్స్​ కంప్లీట్​ అయిన దాఖలాలు లేవు.

దమ్మపేట మండలంలో 27 స్కూళ్లకు గానూ మూడు స్కూళ్లు​, గుండాల మండలంలో 10 స్కూళ్లకు గానూ ఒక్క స్కూల్​, లక్ష్మీదేవిపల్లి మండలంలో 1, పాల్వంచ మండలంలో 24 స్కూళ్లకుగాను 3 మాత్రమే పూర్తయ్యాయి. ఇల్లెందు మండలంలో 30 స్కూళ్లకు గానూ 8, టేకులపల్లి మండలంలో 27 స్కూళ్లకు​గానూ 7, జూలూరుపాడు మండలంలో 17 స్కూళ్లకు గానూ 1, అశ్వారావుపేట మండలంలో 23 స్కూళ్లకుగానూ 9 స్కూళ్లు​ మాత్రమే కంప్లీట్​ అయ్యాయి. కరకగూడెం మండలంలో 10, మణుగూరులో 16 స్కూళ్లు ఉండగా అన్ని స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు కంప్లీట్​ చేసిన 113 స్కూళ్లకు గానూ దాదాపు రూ. 9.17కోట్ల మేర బిల్లులు చెల్లించారు.  ఇంకా దాదాపు రూ. 27.83 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. 

జులై నుంచి పైసా లేదు.. 

గతేడాది జూలై నుంచి ఒక్క పైసా రిలీజ్​ కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అసంపూర్తి పనులతో అటు టీచర్లతో పాటు ఇటు స్టూడెంట్స్​కు అవస్థలు తప్పడం లేదు. కొన్ని చోట్ల టాయ్​లెట్స్​ పూర్తి కాక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు పనుల్లో నాణ్యత కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. చేసిన పనులకు  బిల్లులు చెల్లిస్తేనే మిగిలిన పనులు చేస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 

ఫండ్స్ రిలీజ్ చేయకనే  పనుల్లో డిలే.. 

మన ఊరు–మన బడి స్కీమ్​కు ఫండ్స్ రిలీజ్​లో కొంత జాప్యం ఏర్పడింది. ఫండ్స్ రిలీజ్ కాకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. త్వరలోనే ఫండ్స్ వస్తాయి. పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వరాచారి, డీఈఓ, భద్రాద్రికొత్తగూడెం