జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఏటా సాగునీరందక పొలాలు ఎండిపోతున్నాయి. రైతుల విజ్ఞప్తి మేరకు పోతారం రిజర్వాయర్ ను అనుసంధానం చేస్తూ జేఎన్టీయూ కాలేజీ వరకు 7.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జేఎన్టీయూ సమీపంలోని అల్లం కుంట చెరువులోకి నీరు వెళ్లేలా ఆఫీసర్లు డిజైన్ చేశారు. భూసేకరణ కూడా పూర్తయ్యింది. దీని ద్వారా పోతారం, తిర్మలాపూర్, హిమ్మత్ రావుపేట, శనివారంపేట, రాంసాగర్, డబ్బు తిమ్మయ్యపల్లి, పూడూర్, నాచుపల్లి గ్రామాల్లో సుమారు రెండు వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. అయితే కెనాల్పనులు ముందుకు సాగడంలేదు. ప్రభుత్వ హామీ నెరవేరడంలేదు.
మినిస్టర్ హామీ నెరవేరలే..
2019 సెప్టెంబర్13న మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొడిమ్యాల మండలంలోని హిమ్మత్ రావుపేటకు వచ్చిన మినిస్టర్లు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కాన్వాయ్‌ని స్థానిక రైతులు అడ్డుకున్నారు. గ్రావిటీ కెనాల్ ఎప్పుడు నిర్మిస్తారని నిలదీశారు. స్పందించిన మంత్రులు మూడు నెలల్లో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇంతవరకు పూర్తికాలేదు. కానీ... కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతుల మీద కేసులు నమోదయ్యాయి. ఐదేళ్లుగా కోర్డుల చుట్టూ తిరుగుతున్నారు.
త్వరగా పూర్తి చేయాలి...
గ్రావిటీ కెనాల్ నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి. ఎన్నో ఏండ్ల నుంచి కెనాల్ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నాం. కానీ.. పనులు ప్రారంభం కావడం లేదు. నీళ్లు లేక ఏటా ఆయకట్టు ఎండిపోతోంది. ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
–గంగారావు, రాంసాగర్
కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం..
ఏటా పొలాలు ఎండిపోవడంతో గ్రావిటీ కెనాల్నిర్మించాలని కోరాం. మినిస్టర్ కొప్పుల, ఎర్రబెల్లి కాన్వాయ్ అడ్డుకోవడంతో మూడు నెలల్లో చేపడతామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి తట్టేడు మట్టి తీయలేదు. కానీ పోలీసులు పెట్టిన కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం.
- గౌతం రెడ్డి, డబ్బుతిమ్మయ్య పల్లె రైతు