- అధిక రేట్లకు పూజా సామగ్రి విక్రయం
- భక్తులను దోచుకుంటున్న వ్యాపారులు
- పట్టించుకోనిఎండోమెంట్ ఆఫీసర్లు
మహబూబ్‌నగర్/చిన్నచింతకుంట, వెలుగు : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కురుమూర్తి క్షేత్రంలో భక్తులు సౌలతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. జాతరకు లక్షల్లో వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు పకడ్బందీగా చేయకపోవడంతో తిప్పలు పడుతున్నారు. నవంబరు 19 నుంచి జాతర ప్రారంభమైంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వస్తున్నారు.
సరిపడా వసతి గృహాలు లేకపోవడం సమస్యగా మారింది. భక్తులంతా వసతి లేక జాతర మైదానం, పంట పొలాల వెంట బస చేస్తున్నారు. మరుగుదొడ్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కొన్ని చోట్ల మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉన్నాయి. దీంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
భక్తులను దోచుకుంటున్రు..
బ్రహ్మోత్సవాల సందర్భంగా కొబ్బరికాయలు అమ్మేందుకు టెండర్లు పిలిచారు. టెండర్‌ను మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ రూ.53.15 లక్షలకు దక్కించుకున్నారు. ఒక కొబ్బరికాయను రూ.25కు అమ్మాలని దేవస్థానం వారు నిర్ణయించారు. కానీ, రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో కొబ్బరికాను రూ.30 కు, రష్ ఎక్కువగా ఉన్న రోజుల్లో రూ.35కు అమ్ముతున్నారు.
ఈ విషయంపై కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూజా సామగ్రిని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా కొబ్బరికాయను రూ.25కే అమ్ముతున్నారని, అధిక రేట్లకు అమ్ముతున్నట్లు ఎవరూ కంప్లైంట్ చేయలేదని తెలిపారు.