ద్వీపం చిన్నదే కానీ.. చక్కని తీర్పు

లక్షద్వీప్ లో మొత్తం జనాభా లక్షకు మించి ఉండదు. దీంతో దేశంలోనే చిన్న పార్లమెంటరీ నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక్క లోక్ సభ సెగ్మెంటే ఉంది.జనాభాలో 90 శాతం పైగా ముస్లింలే ఉన్నా వాళ్లని ఎస్టీలుగా పరిగణిస్తారు. ఎస్టీలకు రిజర్వ్ ​అయిన లక్షద్వీప్‌‌లో హయ్యస్ట్​ పోలింగ్ 85 శాతం నమోదైంది.మహారాష్ట్రలో నువ్వూ నేనూ ఒకటే అన్నట్లు కలిసి పనిచేసే కాంగ్రెస్ , నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్ సీ పీ) ఇక్కడ మాత్రం నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడతాయి. అదే లక్షద్వీప్ రాజకీయ ప్రత్యేకత.

వారసత్వ రాజకీయాలను దేశ ప్రజలు అంతగా ఆదరించట్లేదనటానికి లక్షద్వీప్​ని కూడా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అక్కడి ఒకే ఒక్క లోక్​సభ సెగ్మెంట్​కి కాంగ్రెస్​ లీడర్​ పీఎం సయీద్ ఏకంగా 35 ఏళ్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయన కుమారుడు హమ్దుల్లా సయీద్ మాత్రం ఒక్కసారే గెలిచి వరుసగా రెండు సార్లు ఓడారు. 2014 జనరల్​ ఎలక్షన్​తోపాటు 2019​​లోనూ ఆయనపై ఎన్​సీపీ అభ్యర్థి మహ్మద్​ ఫైజల్​దే పైచేయి అయింది.  ఇక ఇక్కడ వారసత్వ నాయకత్వాలకు కాలం చెల్లినట్లేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 55,057 కాగా ఇందులో 48.6 శాతం (22,851) మంది ఫైజల్​కే ఓటేశారు. దీంతో కాంగ్రెస్​ క్యాండిడేట్​ హమ్దుల్లా సయీద్​పై 823 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో సయీద్​ కన్నా ఫైజల్​కి 1,535 ఓట్లు ఎక్కువ వచ్చాయి. తాజా ఎలక్షన్​లో ఆ ఆధిపత్యం సగానికి తగ్గింది. లక్షద్వీప్​ సీటును ఎన్​సీపీ సొంతం చేసుకోవటంతో లోక్​సభలో ఆ పార్టీ బలం ఐదుకు చేరింది. యూపీఏ మిత్రపక్షమైన ఎన్​సీపీ మహారాష్ట్రలో నాలుగు చోట్ల నెగ్గింది.

కొంపముంచిన యాంటీ ఓట్లు

లక్షద్వీప్​లో 1967 నుంచి 2004 వరకు రికార్డ్​ స్థాయిలో 10 సార్లు ఎంపీగా గెలిచిన ఘనత పీఎం సయీద్ సొంతం. ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవటంలో హమ్దుల్లా విఫలమయ్యాడు. హమ్దుల్లా ఓటమికి గ్రూపు రాజకీయాలు కూడా ఒక కారణం.  టీకే అత్తిబి అనే లాయర్​ హమ్దుల్లాకి టికెట్​  ఇవ్వొద్దని కాంగ్రెస్​ హైకమాండ్​కి లెటర్​ రాశారు.అయితే, దాన్ని ఎవరూ​ పట్టించుకోకపోవటంతో కాంగ్రెస్​ (ఒరిజినల్​) పేరిట ముఠా కట్టి, హమ్దుల్లాకి వ్యతిరేకంగా ప్రచారం చేసి, ఓడించి తీరాడు.

‘లక్ష ద్వీపాలు’ కాదు..  ముఖ్యమైనవి 36 మాత్రమే

చుట్టూ నీరున్న భూభాగాన్ని ద్వీపం లేదా దీవి అంటారు. లక్షద్వీప్ అనే మలయాళ, సంస్కృత పదానికి ‘లక్ష ద్వీపాలు’ అని అర్థం.​ అయితే లక్షద్వీప్​ పేరును బట్టి లక్ష దీవులు ఉన్నాయనుకుంటే పొరపాటు. అక్కడ ప్రధానంగా ఉన్నది 36 దీవులు మాత్రమే. అవి కూడా దుర్భిణీ వేసి వెతికితే తప్ప కనిపించవంటారు. అవన్నీ ఓ సమూహంగా కేరళ తీరం నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నాయి. 10  దీవుల్లోనే జనాభా కనిపిస్తుంది. మిగిలిన 16 దీవులు నిర్జీవంగా ఉంటాయి. లక్షద్వీప్ దీవుల్లో మనుషులు తిరగని చిన్న చిన్న దిబ్బల్లాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. కొన్ని దీవుల్లోకి పగడపు వేటగాళ్లు మాత్రమే అడుగుపెడుతుంటారు. 2011 సెన్సస్​ ప్రకారం మొత్తం పాపులేషన్​ 65 వేలు. ఇందులో 93 శాతం మంది ముస్లింలే. సహజంగా ముస్లింలు ఉర్దూ మాట్లాడతారు. కానీ లక్షదీవుల్లోని ప్రజల భాష మలయాళ మాండలికం. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా వీళ్లను ఎస్టీగా పరిగణిస్తున్నారు. అందువల్ల ఈ లోక్​సభ నియోజకవర్గాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఇక్కడ కోయలదే ఆధిపత్యం. 16 లోక్​సభలకు ఇప్పటివరకు ఐదుగురే ఎన్నికయ్యారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి రాజధాని కావరతి. స్థానికులకు చేపల వేట, కొబ్బరి తోటల పెంపకం, కొబ్బరి పీచు తీయడమే జీవనాధారం. లక్ష ద్వీపవాసుల కల్చర్​ కేరళ ప్రజలను పోలి ఉంటుంది. వీళ్లపై అరబ్ వ్యాపారుల ప్రభావం ఎక్కువ. అత్యంత ఖరీదైన ‘ట్యూనా ఫిష్’ ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతుంది. ఇప్పుడు పర్యాటకం పెద్ద పరిశ్రమగా ఎదిగింది. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు.

ఆ గిమ్మిక్కులు ఇక పనిచేయవు

లక్షద్వీప్​ ఓటర్లు తెలివిగా తీర్పిస్తున్నారని ఎనలిస్టులు అంటున్నారు. గతంలో అభ్యర్థులు ఫ్యామిలీ పేరుతో ఓట్లడిగేవారు. ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగింది. తమ ప్రాంతాన్ని అభివృద్ధి​ చేసేవాళ్లే కావాలంటున్నారు. కాబట్టి ఇలాంటి గిమ్మిక్కులు ఇక చెల్లవు. ఫైజల్​ రెండోసారి గెలవటం ఈ కొత్త ట్రెండ్​కి అద్దం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. హమ్దుల్లాకి ఓసారి (2009లో) ఛాన్స్​ ఇచ్చినా వాడుకోలేక ఓడిపోయారని తప్పుపడుతున్నారు. వారసత్వ రాజకీయాలకు జనం ముగింపు పలికినట్లేననే అభిప్రాయం నెలకొంది.

ఎండు చేపల చుట్టూ రాజకీయం

తాజా లోక్ సభ ఎన్నికల్లో లక్షద్వీప్ లో తెరపైకి వచ్చిన మరో ఆసక్తికర అంశం ట్యూనా చేపలు. ఈ ప్రాంతం నుంచి దేశవిదేశాలకు భారీగా ఎగుమతి అయ్యే ఖరీదైన ‘డ్రై ట్యూనాఫిష్ ’ చుట్టూనే ఈసారి రాజకీయం మొత్తం తిరిగింది. ఈ ఎండు చేపల మార్కెటింగ్ లో ఫైజల్ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలను హమ్దుల్లా సపోర్టర్లు సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారని కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ ఎన్ ఎస్ యూఐ అభిప్రాయ-పడిం ది. అయితే ఈ ఆరోపణలను ఫైజల్ఖం డిం చారు. జాలర్ల నుంచి సేకరించిన చేపలను అమ్మటానికి లక్షద్వీప్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ శ్రీలంక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల స్థానికుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని ఆయన వివరించారు. తాను జాలర్ల అభివృద్ధికి పాటుపడుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశవ్యా ప్తంగా ఉన్న ట్యూనా బిజినెస్ పర్సన్స్​తో చేతులు కలిపి ఈ వ్యాపారాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నించిందని ఫైజల్ విమర్శించారు.