జాజ్పూర్: అప్పటికే అత్తింటి వేధింపులపై గృహ హింస కేసు పెట్టిందామె. పెద్దలు నలుగురూ కలిసి ఏదో సర్దిచెప్పి కాపురం సక్క చూసుకోమని మెట్టినింటికి పంపారు. కానీ ఆమె అత్తమామలు మళ్లీ ఆమెపై పైశాచికంగా దాడి చేశారు. జుట్టు పట్టి రోడ్లోకి లాగి.. దారుణంగా చావగొట్టారు.
ఈ ఘటన నిన్న ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా ధనేశ్వర్ గ్రామంలో జరిగింది. నవీన్ బెహెరా, చారులత దంపతులు తమ కోడలిపై దారుణంగా దాడి చేశారు. ఆమె జుట్టు పట్టుకుని మామ రోడ్డు మీదకు ఈడ్చుకుంటూ వచ్చాడు. కర్రతోటి ఆమె అత్త తీవ్రంగా బాదేసింది.
అత్తమామలిద్దరూ చావగొడుతుంటే ఆమె తట్టుకోలేక కొట్టొద్దని వేడుకున్నా.. వారు కనికరం చూపలేదు. కట్టుకున్న భర్త కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. వారు కసితీరా కొట్టి.. ఆమెను రోడ్డు మీదే వదిలేసి వెళ్లిపోయారు. ఆమె అరుపులు, కేకలు విని చుట్టూ మూగిన జనం కూడా ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయారు. తాను మళ్లీ ఇంట్లోకి వెళ్లనంటూ అక్కడున్నవారితో మెరపెట్టుకుని.. ఏడుస్తూ అక్కడే చతికిలపడిందామె.
సోషల్ మీడియాలో వైరల్.. భర్త, అత్తమామల అరెస్టు
ఈ మొత్తం ఘటనను అక్కడున్న వారిలో ఎవరో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దారుణం కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. చివరికి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. ఆ మహిళ భర్త, అత్తమామలను అరెస్టు చేశారు.