- ప్రమాణస్వీకారం చేసిన 28 మంది
భోపాల్: మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ కేబినెట్ కొలువుదీరింది. మంత్రులుగా నియమితులైన 28 మందితో మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అడిషనల్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా సన్నిహితులకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. బీజేపీ ఎమ్మెల్యే, సింధియా అత్త అయిన యశోదా రాజ్ సింధియాకు కూడా మంత్రి వర్గంలో చోటు దక్కింది. బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్ భార్గవ, ఇమర్తీ దేవి, ప్రభురామ్ చౌధురి, ప్రధుమన్ సింగ్ థోమర్‌కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా సీఎం వాళ్లందర్నీ విష్ చేశారు. “ ప్రమాణస్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. మధ్యప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం మనమంతా కలిసి పనిచేద్దాం. కొత్త మార్పులు తీసుకొచ్చేందుకు నేను మీ అందరికీ సపోర్ట్ ఇస్తాను” అని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. మార్చిలో గవర్నమెంట్‌ను ఫామ్ చేసిన బీజేపీ కరోనా కారణంగా మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. అప్పటి నుంచి కేవలం ఐదుగురు మినిస్టర్లతో పాలన నడిపిస్తున్నారు.