- మానుకోటలో నిండని చెరువులు
- సాగుకు తప్పని తిప్పలు
మహబూబాబాద్, వెలుగు : పంట సాగుకు అన్నదాతలు తిప్పలు పడక తప్పడం లేదు. జిల్లాలో తొలుత వర్షాలు ఓ మోస్తారుగా కురువడంతో పంటలు సాగు చేశారు. ఏజెన్సీలోని గంగారం, బయ్యారం, గార్ల, కొత్తగూడ, గూడూరు మండలాల పరిధిలో చెరువులు అలుగులు పోయగా, మైదాన ప్రాంతాలైన తొర్రూరు, పెద్దవంగర, నరసింహులపేట, మరిపెడ, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్, కురవి, సీరోలు, డోర్నకల్, దంతాలపల్లి, చిన్నగూడురు
నెల్లికుదురు మండలాల పరిధిలో వర్షం తక్కువగా కురవడంతో చెరువులు పూర్తిగా నిండలేదు. వర్షాలు పడుతాయనే ఆశతో రైతులు పంటలు సాగు చేశారు. ఆగస్టు చివరిలోనూ చెరువులు పూర్తిగా నిండకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ జలాలను విడుదల చేసి జిల్లాలోని చెరువులు, కుంటలను నింపితేనే పంటలను రక్షించుకోవచ్చని స్థానిక రైతులు చెబుతున్నారు.
సగం చెరువులు కూడా నిండలే..
మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 1590 చెరువులు, కుంటలు ఉండగా, వర్షాకాలంలో కేవలం 684 చెరువులు మాత్రమే పూర్తిగా నిండాయి. 271 చెరువుల్లో నీటి చుక్క లేనేలేదు. 242 చెరువుల్లో కొంత మేరకు, 170 చెరువుల్లో సగం శాతం, 223 చెరువుల్లో 75 శాతం వరకు నీరు చేరింది. మత్తళ్లు పోసిన చెరువుల్లో సైతం నీరు రోజురోజుకూ తగ్గిపోతుంది. పంటల చివరి దశ వరకు నీరు అందే అవకాశాలు సన్నగిల్లడంతో రైతుల ఆశలు ఇక ఎస్సారెస్పీపైనే పెట్టుకున్నారు.
వరి సాగుకు ఇబ్బందులు..
మహబూబాబాద్ జిల్లాలో వానాకాలం సీజన్లో 2,15,278 ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేసినా, కేవలం 1.27లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. కాగా, నీరు లేకపోవడంతో పెద్దవంగర మండలంలో సాగు చేసిన వరి పంట ఎండిపోతుంది. వరి సాగు చేసిన రైతులు సైతం పంటలు చేతికి అందే నమ్మకం లేదంటున్నారు. రోజూ మబ్బులు కమ్ముకుంటున్నా వర్షం కురవడం లేదు. చెరువులకు నీరు రాకపోవడంతో బోర్లు, బావుల్లో జలాలు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయాలి
వానాకాలం సీజన్లో పంటలను కాపాడటానికి అధికారులు మహబూబాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలను ఎస్సారెస్పీ జలాలతో నింపాలి. గతంలో నీటి విడుదల ద్వారా చెరువులు, కుంటల్లో నీరు ఉండటంతో పంటలకు ఇబ్బంది కలుగలేదు. ప్రస్తుతం వానలు సరిగ్గా లేకపోవడంతో చెరువులు నిండలేదు.
- ధరావత్ బాలు, రైతు, తొర్రూరు