- క్యాడర్ పోస్టులు శాంక్షన్ చేయలే
- వేధిస్తున్న డాక్టర్ల కొరత
- సిబ్బంది లేక రూమ్స్‌కే పరిమితమైన ఎక్విప్మెంట్స్
మహబూబ్‌నగర్, వెలుగు: ప్రతి నియోజకవర్గానికి వంద పడకల దవాఖానాను కట్టిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కొన్ని నియోజకవర్గాల్లో హాస్పిటల్స్‌ను కట్టించింది. కానీ, సరిపడా సిబ్బందిని కేటాయించలేదు. క్యాడర్ పోస్టులను శాంక్షన్ చేయలేదు. అప్‌గ్రేడ్ కాకముందు ఉన్న పీహెచ్సీ స్టాఫ్‌నే కేటాయించారు. తగినంత స్టాఫ్ లేకపోవడంతో సరైన వైద్యం అందడం లేదు. మరికొన్ని నియోజకవర్గాల్లో బిల్డింగులకు భూమిపూజ చేసినా.. ఇంత వరకు పనులు స్టార్ట్ చేయలేదు.
రెండేండ్లు కావస్తున్నా..
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్, కోయిల్కొండపీహెచ్సీలను సివిల్ హాస్పిటల్స్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఎనిమిదేండ్ల కింద ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటిని డెవలప్చేసేందుకు రూ.2.20 కోట్ల చొప్పున ఫండ్స్ మంజూరు చేశారు. ఐదేండ్ల వరకు బిల్డింగ్ పనులు కొనసాగాయి. గత ఏడాది జనవరి 18న ఆ బిల్డింగ్‌లకు అప్పటి హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు ప్రారంభించారు. బాలానగర్ హాస్పిటల్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తుండగా ఇంత వరకు అవసరం మేరడాక్టర్లను నియమించలేదు.
ఈ హాస్పిటల్లో ఆరుగురు రెగ్యులర్ డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఆరుగురు నర్సులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు అటెండర్లతో కలిసి 16 మంది ఉండాలి. కానీ, ఇంత వరకు ఎవరినీ అలాట్ చేయలేదు. ఈ హాస్పిటల్‌ను ప్రారంభించి రెండేండ్లు కావస్తున్నా ఉన్నతాధికారులనుంచి సిబ్బంది కేటాయింపుపై ఉత్తర్వులు రాలేదు. ప్రస్తుతం షాద్‌నగర్ నుంచి ఐదుగురు డాక్టర్లు, ఐదుగురు సిబ్బంది డిప్యుటేషన్‌పై వచ్చి వెళ్తున్నారు. కోయిల్‌కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ చాలీచాలని సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.
జడ్చర్లలోనూ అదే పరిస్థితి..
వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సి.లక్ష్మారెడ్డి జడ్చర్ల హాస్పిటల్‌ను వంద పడకల హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు 2017లో ఉత్తర్వులు జారీ చేశారు. 2021లోనే పనులు పూర్తయ్యాయి. నాలా పక్కనే హాస్పిటల్‌ను కట్టడంతో ఆ ఏడాది వచ్చిన వర్షాలకు హాస్పిటల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో కొన్నాళ్లు ఓపెనింగ్‌ను వాయిదా వేశారు.
అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మే 5న లక్ష్మారెడ్డితో కలిసి అప్పటి మినిష్టర్ హరీశ్ రావు దీన్ని ఓపెన్ చేశారు. ఈ హాస్పిటల్‌ను వంద పడకలకు అప్గ్రేడ్చేసినా ఇంత వరకు డాక్టర్లు, సిబ్బందిని అలాట్ చేయలేదు. ప్రస్తుతం 13 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ముగ్గురు ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్నారు. మిగతా సిబ్బందిని అలాట్ చేయలేదు. ఇక మార్చురీ రూమ్ పనులు కంప్లీట్ చేయలేదు. ఈ విషయంపై హాస్పిటల్ సిబ్బంది సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హాస్పిటల్లో సిబ్బంది కొరత తీర్చాలని కోరారు.
శంకుస్థాపనకే పరిమితం..
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఇప్పటి వరకు వంద పడకల హాస్పిటల్ నిర్మించలేదు. గతంలోనే స్థలాన్ని కేటాయించినా అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంతో పనులు స్టార్ట్ చేయలేదు. వాస్తవానికి ఇక్కడ 150 పడకల హాస్పిటల్ కట్టాల్సి ఉంది. అందులో 50 పడకలు పిల్లల హాస్పిటల్ కోసం కేటాయించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను రూ.34 కోట్ల కేటాయించారు. కానీ, హడావుడిగా ఎన్నికలకు ముందు అక్టోబరు 7న అప్పటి మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. అదే రోజు దేవరకద్రలోనూ వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి భూమిపూజ చేయాల్సి ఉన్నా, ఈ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేశారు.
రూమ్స్‌కు తాళాలు..
వంద పడకల హాస్పిటల్స్, సర్టిఫైడ్ హాస్పిటల్స్‌కు టీఎస్ ఎంఐడీసీ రెగ్యులర్ నార్మ్స్ ప్రకారం ఎక్విప్మెంట్ను పంపిస్తోంది. ఇందులోభాగంగానే హాస్పిటల్స్ ఓపెనింగ్‌కు ముందే వీటిని పంపారు. కానీ, సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఈ ఎక్విప్మెంట్లను ఉపయోగించడం లేదు. దీంతో ఈ ఎక్విప్మెంట్లను భద్రపర్చిన గదులకు తాళాలు వేశారు. వాడుకలో లేకపోవడంతో ఆ పరికరాలన్ని తుప్పు పడుతున్నాయి. కోట్లు పెట్టి కొన్న పరికరాలు నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరిపడా సిబ్బందిని కేటాయించాల్సిన అవసరం ఉంది.