- ఏడాది కిందటే ఎంక్వైరీలో కబ్జాలు గుర్తించిన ఆఫీసర్లు
- చర్యలు తీసుకోవడంలో వెనకడుగు
మహబూబ్నగర్, వెలుగు : జిల్లా కేంద్రంలో ఆక్రమణలపై ఆఫీసర్లు మౌనం వహిస్తున్నారు. చెరువులు, కుంటలు, కాల్వలు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు. కొద్ది రోజుల కిందట ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లు, పలు చెరువుల కింద ఆక్రమణలు గుర్తించి, ఆక్రమణదారులపై నోటీసులు జారీ చేశారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మహబూబ్నగర్ పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుండటంతో ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. హైదరాబాద్కు దగ్గర్లో ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో గజం విలువ దాదాపు రూ.8 వేల నుంచి రూ.40 వేల వరకు, ఎకరం భూమి రూ.2.50 కోట్లకు చేరింది. అయితే గత ప్రభుత్వంలోని కొందరు ప్రజాప్రతినిధులు, 'రియల్' వ్యాపారులు కలిసి చెరువులు, కుంటలను ఆక్రమించారు.
కొందరు ఆఫీసర్లను మేనేజ్ చేసి చెరువులు, కుంటల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, అక్రమ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి విక్రయించినట్లు తెలిసింది. అయితే జిల్లా వ్యాప్తంగా 1,265 చెరువులు, 190 కుంటలు ఉంటే, అందులో మహబూబ్నగర్ టౌన్, రూరల్ ఏరియాలో 93 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా చెరువులు, కుంటలు మాయం అయ్యాయి. ప్రధానంగా పాలమూరు పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి.
దాదాపు ఈ చెరువు సగానికిపైగా కుచించుకుపోయింది. పాలకొండ పెద్ద చెరువులో కబ్జాలు చేసి కాలనీ తరహాలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇమాంకుంట చెరువు, గంగోసుకుంట చెరువు, నల్లచెరువు, పాలకొండ చెరువు, రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. జిల్లా కేంద్రంలోని కుంటలను కూడా ఆగం చేశారు. బాపన్ కుంట, బతుకమ్మ కుంటతో పాటు మరో పది జాతి కుంటలను ఆక్రమించి ఆనవాళ్లు లేకుండా చేశారు.
కాల్వలనూ వదల్లే..
అక్రమార్కులు జిల్లా కేంద్రంలో గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న కాల్వలనూ వదల్లేదు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీళ్లు వెళ్లే వరద కాల్వలను ఎక్కడికక్కడ ఆక్రమించారు. వాటి చుట్టూ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇమాంకుంట చెరువు నుంచి భూత్పూర్ మండలంలోని గొలుసుకట్టు చెరువులను కలుపుతూ తాటికుంట చెరువుకు వెళ్లే కాల్వను ఆక్రమించారు. మట్టి వేసి పూడ్చేయడంతో కాల్వ కొంత భాగం మూసుకుపోయింది. దీంతో వర్షాకాలంలో ఈ కాల్వ నుంచి నీరు పోయే పరిస్థితి లేకుండాపోతోంది.
ఎంక్వైరీ సరే.. చర్యలేవీ?
రెండేళ్లుగా వర్షాల వల్ల జిల్లా కేంద్రంలోని కొన్ని కాలనీలు ముంపునకు గురయ్యాయి. చెరువులు, కాల్వలు, నాలాలు కబ్జా చేయడం వల్ల వరద బయటకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయంపై అప్పట్లో కాలనీ వాసుల ఆందోళన చేశారు. దీంతో స్పందించిన ఆఫీసర్లు ఆక్రమణలపై విచారణ చేపట్టారు. ఫీల్డ్ ఎంక్వైరీ చేసి కొన్ని చెరువులు కబ్జాకు గురైనట్లు నిర్ధారించారు. బఫర్ జోన్లో ఇండ్లు కట్టుకున్న వారికి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేసి దాదాపు ఏడాదికిపైగానే అవుతున్నా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వంలోని కొందరు లీడర్ల ఒత్తిళ్ల వల్ల ఈ విషయంపై ఆఫీసర్లు మౌనం వహించినట్లు తెలిసింది.
చర్యలు తీసుకుంటారు
పెద్దచెరువు, పాలకొండ చెరువులతో పాటు మరికొన్ని చెరువుల్లో ఆక్రమణలు జరిగాయని గుర్తించాం. ఈ లిస్టును ఆర్డీవో, కలెక్టర్లకు అందజేశాం. వీటి మీద ఉన్నత స్థాయిలో ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటారు. ఇటీవల గంగోసుకుంటలోని కొంత భాగంలో మట్టి వేసి పూడుస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే, ఆఫీసర్లు వెళ్లి అడ్డుకున్నారు.
- మనోహర్, డీఈ, మహబూబ్నగర్