- లోతు తెలియదు.. ఎన్నడూ ఎండదు.. కరువు కాలంలోనూ జలకళే..
- మంచిర్యాల జిల్లా కలమడుగు సమీపంలో గోదావరి మధ్యలో ఉన్న మడుగు
- లోతు తెలియకపోవడంతో కలమడుగు బ్రిడ్జి పిల్లర్‌నే పక్కకు జరిపిన్రు
- మడుగుపై ప్రచారంలో రకరకాల కథనాలు
- ఇక్కడ సేకరించిన గంగాజలంతోనే నాగోబాకు అభిషేకం
మంచిర్యాల/జన్నారం, వెలుగు : వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గోదావరిలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని హస్తిన మడుగు. జన్నారం మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సుపరిచితమైన ఈ మడుగు గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రాచుర్యంలోకి మాత్రం రాలేదు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతర టైంలో మెస్రం వంశీయులు ఈ హస్తినమడుగు నుంచి సేకరించిన గంగాజలంతోనే తమ ఆరాధ్య దైవానికి అభిషేకం చేస్తారు. దీంతో ఈ మడుగు విశేషాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఎన్నడూ ఎండిపోని మడుగు
‘హస్తిన మడుగు, హస్తల మడుగు, అత్తల మడుగు’ అనే మూడు పేర్లతో పిలువడబడే ఈ మడుగుపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గోదావరి మధ్యలో ఉన్న ఈ మడుగులో ఏ కాలమైనా నీళ్లు ఎండిపోవు. ఒక వేళ గోదావరిలో నీరు లేకపోయినా ఈ హస్తినమడుగు మాత్రం నిత్యం నిండుకుండలా కళకళలాడుతుంది. సుమారు 900 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న మడుగు లోతు ఎంతనేది ఇప్పటికీ తేలలేదు. 2011లో కలమడుగు, జగిత్యాల జిల్లా కమ్మునూర్ గ్రామాల నడుమ గోదావరిపై బ్రిడ్డి నిర్మించే టైంలో ఒక పిల్లర్ ఈ హస్తినమడుగులో వేయాల్సి వచ్చింది. కానీ ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా మడగు లోతు తెలియలేదు. దీంతో పిల్లర్‌ను మరో చోట వేసి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ప్రచారంలో పలు కథనాలు
హస్తినమడుగుపై.. కలమడుగు గ్రామపెద్దలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పూజారులు రకరకాలుగా చెపుతుంటారు. కలమడుగులో పూర్వం మూడు ఆలయాలు ఉండేవని, అక్కడ హస్తమ ముని అనే మహర్షి పూజారిగా పనిచేసేవాడని, ఆయన ప్రతి రోజు తన శిష్యులతో కలిసి గోదావరి మధ్యలో ఉన్న ఈ మడుగులో స్నానం చేసేవారని, అందువ్లలే ఈ మడుగుకు హస్తిన మడుగు అనే పేరు వచ్చిందని ఒక కథనం ప్రచారంలో ఉంది.
అలాగే పూర్వం కాలమయుడు అనే రాక్షసుడు ఉత్తర భారతంలో జరిగిన యుద్ధంలో ఓడి ప్రాణభయంతో పారిపోయి వచ్చి ఇదే మడుగులో దాక్కున్నాడని, కాలమయుడు అనే రాక్షసుడి పేరుమీదుగా గ్రామానికి కలమడుగు పేరు వచ్చిందని మరికొందరు చెబుతుంటారు. అంతేగాకుండా హస్తినమడుగు గోదావరిలో ఏర్పడిన సొరంగమని, దీని లోపల శివాలయం ఉందని, ప్రతి అమావాస్య, పౌర్ణమి నాడు అర్ధరాత్రి ఈ మడుగు నుంచి భజన శబ్ధాలు, గుడిగంటల చప్పుళ్లు వినబడుతాయని కలమడుగు గ్రామస్తులు చెబుతుంటారు.
అయితే వరుసగా ఏడు సంవత్సరాల పాటు వర్షాలు పడకపోతే గోదావరి ఎండిపోయి హస్తిన మడుగులో ఉన్న గుడికి సంబంధించిన గోపురం బయటపడుతుందని చెపుతుంటారు. ఇందులో ఎవరి వాదన ఎలా ఉన్నా హస్తిన మడుగు గురించి కచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు.
హస్తిన మడుగు జలంతోనే నాగోబాకు అభిషేకం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం జనవరిలో మెస్రం వంశీయులు నిర్వహించే నాగోబా జాతరలో అభిషేకానికి ఈ హస్తిన మడుగు నుంచే గంగాజలం సేకరిస్తారు. ఈ మడుగు గోదావరి మధ్యలో ఉండడం, ఏ కాలమైనా పుష్కలంగా నీరు ఉండడంతో పవిత్రజలంగా భావించి మెస్రం వంశీయులు కాలినడకన వచ్చి గంగాజలాన్ని సేకరించి తీసుకెళ్తారు. ఈ నెల17న సైతం మెస్రం వంశీయులు హస్తిన మడుగుకు వచ్చి గంగాజలం తీసుకెళ్లారు..
ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి
గోదావరి నదిలో ఉన్న హస్తిన మడుగుపై ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో గుడి ఉందని, దేవకన్యలు ఉన్నారని పాత తరం పెద్దలు చెబుతుండేవారు. మరికొందరు హస్తిన మడుగులో రాక్షసుడు రాజ్యం ఏలుతున్నాడని చెప్పేవారు. లోతు తెలియకపోవడంతో చాలా మంది ఇందులో పడి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
– తిరుమల అంజగౌడ్, కలమడుగు