జ్యువెలరీ వ్యాపారికి మస్కా  డాక్టర్​నంటూ గోల్డ్​చైన్​ చోరీ

మణుగూరు, వెలుగు : మణుగూరులో డాక్టర్​నంటూ జ్యువెలరీ వ్యాపారిని నమ్మించి ఓ గుర్తుతెలియని వ్యక్తి 12 గ్రాముల గోల్డ్ చైన్​కొట్టేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక శ్రీలక్ష్మిశ్రీనివాస జ్యువెలరీస్​షాపు యజమానికి మంగళవారం ఓ వ్యక్తి కాల్​చేసి తాను సింగరేణి హాస్పిటల్​డాక్టర్ ని అంటూ పరిచయం చేసుకున్నాడు. ఇటీవల మణుగూరు ఏరియా ఆసుపత్రికి బదిలీపై వచ్చానని చెప్పాడు. తనకు అత్యవసరంగా ఓ గోల్డ్ చైన్ కావాలని, హాస్పిటల్​సిబ్బందిని అడిగితే మీ షాపు పేరు చెప్పారని తెలిపాడు. అలా వ్యాపారిని మాటల్లో పెట్టి గోల్డ్​చైన్లకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్​చేయమని అడిగాడు. అందులో ఒకటి సెలక్ట్​చేసుకుని, తాను హాస్పిటల్​లో బిజీగా ఉన్నానని, చైన్​పంపిస్తే డబ్బులు ఇస్తానని నమ్మబలికాడు.

దీంతో వ్యాపారి తన అసిస్టెంట్ కు 12 గ్రాముల చైన్​ఇచ్చి హాస్పిటల్​కు పంపించాడు. డాక్టర్​వేషధారణలో హాస్పిటల్​నుంచి బయటకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి వ్యాపారి అసిస్టెంట్​వద్ద చైన్ తీసుకున్నాడు. తన చాంబర్ లోకి వెళ్లి డబ్బు తీసుకొస్తానని చెప్పి పరారయ్యాడు. ఎంతకీ బయటికి రాకపోవడంతో లోనికి వెళ్లి చూడగా అక్కడ వేరే డాక్టర్​ఉన్నాడు. కంగుతిన్న వ్యాపారి అసిస్టెంట్​తన ఓనర్ కి ఫోన్​చేసి విషయం చెప్పాడు. గుర్తుతెలియని వ్యక్తి నంబర్​కు కాల్​చేయగా స్విచ్​ఆఫ్​వచ్చింది. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.