- జోరందుకున్న అవిశ్వాస రాజకీయాలు
- సర్కారు మారడంతో పొంచి ఉన్న గండం
- అధికార కాంగ్రెస్ వైపు కౌన్సిలర్ల చూపు
- హస్తగతం కాకుండా బీఆర్ఎస్ఎత్తులు
మంచిర్యాల /నెట్వర్క్, వెలుగు : రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ‘అవిశ్వాస’ రాజకీయాలు జోరందుకుంటున్నాయి. మున్సిపల్పాలకవర్గాలు ఏర్పడి నాలుగేండ్లు కావస్తుండడంతో ప్రధాన పార్టీలు అవిశ్వాస తీర్మానాలకు తెరలేపుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరడంతో బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి కౌన్సిలర్ల వలసలు కొనసాగుతున్నాయి. దీంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి బీఆర్ఎస్ చైర్మన్లు, చైర్పర్సన్లను గద్దె దించాలని కాంగ్రెస్ చూస్తోంది. ఎమ్మెల్యేలు సైతం ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఓటేసే అవకాశం ఉండడంతో ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
అసంతృప్తితో అవిశ్వాసం వైపు..
నాలుగేండ్ల కింద జరిగిన మున్సిపల్‌ఎన్నికల్లో మెజారిటీ సీట్లను బీఆర్ఎస్ గెల్చుకుని చైర్మన్, వైస్చైర్మన్పీఠాలను కైవసం చేసుకుంది. సంఖ్యాబలం లేనిచోట కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల్లోని కౌన్సిలర్లను చేర్చుకొని ఆధిపత్యం చాటుకుంది. కానీ, చాలాచోట్ల ఏడాది రెండేండ్ల నుంచే కుమ్ములాటలు షురవయ్యాయి. ఫండ్స్కేటాయింపులో పక్షపాతం, ప్రాధాన్యత కల్పించకపోవడం వల్ల కౌన్సిలర్లు అసంతృప్తితో రగిలిపోయారు.
పలుచోట్ల అవిశ్వాసం నోటీసులిచ్చి ఆగ్రహాన్ని బయటపెట్టారు. బీఆర్ఎస్హైకమాండ్ కన్నెర్రజేసి అవిశ్వాసాలకు తాత్కాలిక బ్రేకులు వేసింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మున్సిపాలిటీల్లో సమీకరణాలు మారుతున్నాయి. అధికార పార్టీలో ఉంటే అన్ని రకాలుగా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో అంతా కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూర్, నస్పూర్, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీలున్నాయి. మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడంతో అక్కడ పాలకవర్గం లేదు. మిగతా ఆరు మున్సిపాలిటీలకు అవిశ్వాస గండం పొంచి ఉంది. బెల్లంపల్లి మున్సిపల్చైర్పర్సన్జక్కుల శ్వేత రెండ్రోజుల కింద కాంగ్రెస్‌లో చేరారు.
అదే రోజు19 మంది కౌన్సిలర్లు చైర్పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం కోరుతూ కలెక్టర్‌కు నోటీసు ఇచ్చారు. మంచిర్యాల మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు మెజారిటీ ఉన్నా పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. నస్పూర్‌లో ఏడాది కిందే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినప్పటికీ ఆగిపోయింది.
తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్సెట్టిపేట మున్సిపాలిటీలోనూ అవిశ్వాసానికి రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. చెన్నూర్నియోజకవర్గంలో మందమర్రి, చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలున్నాయి. మందమర్రి మినహా మిగతా రెండు చోట్ల బీఆర్ఎస్కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరి అవిశ్వాసం పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ, ఎమ్మెల్యే డాక్టర్జి.వివేక్‌వెంకటస్వామి సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. కొత్త లీడర్లను పార్టీలో చేర్చుకోబోమని ప్రకటించడంతో అక్కడి కౌన్సిలర్లు సందిగ్దంలో పడ్డారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో..
రామగుండం కార్పొరేషన్‌లో ఆదివారం 28 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు రహస్య ప్రదేశంలో సమావేశమై అవిశ్వాసంపై చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్‌ఎస్ కు చెందిన వారుండగా, వీరి ఎన్నిక సమయంలో ఇచ్చిన కమిట్‌మెంట్‌ను పూర్తి చేయకపోవడంతో నాలుగేండ్ల గడువును అవకాశంగా తీసుకుని అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
రామగుండంలో 50 డివిజన్లుండగా18 డివిజన్లలో బీఆర్‌ఎస్, 11 డివిజన్లలో కాంగ్రెస్, ఆరు డివిజన్లలో బీజేపీ, తొమ్మిది డివిజన్లలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆరు డివిజన్లలో ఇండిపెండెంట్లు గెలిచారు. మేయర్‌పీఠాన్ని అప్పటి అధికార పార్టీ దక్కించుకోగా మెజారిటీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు బీఆర్‌ఎస్‌కు చెందిన మేయర్ తమకిచ్చిన కమిట్‌మెంట్‌ను పూర్తి చేయనందున చాలా మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు.
పెద్దపల్లి మున్సిపాలిటీలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇక్కడ అవిశ్వాసం పెట్టే అవకాశం ఉండడంతో ఆర్థికంగా ఉన్న ఇద్దరు, ముగ్గురు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో పలువురు కార్పొరేటర్లను తమవైపు తిప్పుకుని అవిశ్వాసం పెట్టి నెగ్గేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్‌గా బీఆర్ఎస్ కు చెందిన జోగు ప్రేమేందర్ కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ గెలిచారు. దీంతో మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టేందుకు ఆ పార్టీ కౌన్సిలర్లు పావులు కదుపుతున్నారు. నిర్మల్‌లో బీఆర్ఎస్ నుంచి కొద్దిరోజుల కింద బీజేపీలో చేరిన కౌన్సిలర్అయ్యన్నగారి రాజేందర్ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కౌన్సిలర్లలో మంతనాలు జరుపుతున్నారు. ఖానాపూర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు రహస్యంగా భేటీలు జరుపుతున్నారు.
ఇతర జిల్లాల్లో...
నల్గొండ మున్సిపాలిటీ లో బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్‌చైర్మన్ మందిడి సైదిరెడ్డిపై అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు తీర్మానించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్నుంచి తొమ్మిది మంది కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 27కు చేరింది. బీజేపీ తరపున ఐదుగురు, బీఆర్ఎస్ నుంచి16 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. దీంతో అవిశ్వాసానికి రెడీ అవుతున్నారు.
యాదాద్రి జిల్లా భువనగిరిలో అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారని, వారికి కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మొత్తం స్థానాలు 23 కాగా, అందరూ బీఆర్ఎస్నుంచే గెలిచారు. ఇటీవల ఐదుగురు కాంగ్రెస్ లో చేరగా మరో ఆరుగురు ఆ పార్టీకి టచ్ లోకి వచ్చారు. మరో ఇద్దరి కోసం మంతనాలు సాగుతున్నాయి.
వారిద్దరు వస్తే అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వనపర్తి మున్సిపాలిటీ లో 33 సీట్లలో బీఆర్ఎస్ కు 24 స్థానాలున్నాయి. కాంగ్రెస్ కు ఆరే సీట్లు ఉన్నప్పటికీ పది మందిని బీఆర్ఎస్ నుంచి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లలో 30 మంది బీఆర్ఎస్వాళ్లే.
చైర్ పర్సన్ వినీతను కుర్చీ నుంచి దింపేందుకు ఏడాదిగా బీఆర్ఎస్కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ జీవన్ రెడ్డి వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఎన్నికల్లో బీజేపీకి చెందిన పైడి రాకేశ్‌రెడ్డి గెలవడంతో అవిశ్వాస రాజకీయాలు జోరందుకున్నాయి. బోధన్ మున్సిపల్‌చైర్ పర్సన్ తూము పద్మ సహా ఆమెకు మద్దతుగా ఉన్న మెజారిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
బీఆర్ఎస్ ఎత్తుగడలు ఫలించేనా?
మున్సిపాలిటీలపై కాంగ్రెస్ కన్నేయడంతో బీఆర్ఎస్అలర్టయ్యింది. ఎలాగైనా వాటిని కాపాడుకునేందుకు ఎత్తులు వేస్తోంది. పాలకవర్గాల పదవీకాలం మరో ఏడాది మాత్రమే ఉండడం, ఏడాదిలో ఒక్కసారి మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఉండడంతో కాంగ్రెస్ కంటే ముందే తమ సభ్యులతో నో కాన్ఫిడెన్స్మోషన్నోటీసులు ఇప్పించాలని చూస్తోంది. తద్వారా తమ పార్టీ వాళ్లే చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యేలా ప్లాన్చేస్తున్నట్టు సమాచారం. మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి పోతే రానున్న ఎన్నికల్లో కూడా ఆ పార్టీదే పైచేయి అవుతుందని భయపడుతోంది. ఎలాగైనా ఏడాది పాటు కౌన్సిలర్లను కాపాడుకొని మున్సిపల్ పీఠాలు హస్తగతం కాకుండా ఎత్తులు వేస్తోంది.