- డ్రమ్ములు నిండుతున్న నాణేలు.. కాయిన్స్ కౌంటింగ్‍కు మెషీన్ల ఏర్పాటు
- బస్తాల్లోకి టన్నుల కొద్దీ ఒడి బియ్యం
- కానుకల లెక్కింపు కోసం 400 మంది సిబ్బంది.. మొదటి రోజు రూ.3.15 కోట్లకు పైగా ఆదాయం
వరంగల్, వెలుగు: మేడారం జాతర హుండీ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. హుండీల్లో బంగారు తాళిబొట్లు, ఫారిన్ కరెన్సీలతో పాటు ఫేక్ నోట్లను కూడా భక్తులు కానుకలుగా వేశారు. 518 హుండీల్లో ఒక్కో హుండీని ఓపెన్ చేస్తూ లెక్కిస్తున్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కల్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను గురువారం ఎండోమెంట్, పోలీస్, మేడారం పూజరులు ప్రారంభించారు.
హుండీల్లో విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు చిల్లర కాయిన్స్‌ను భక్తులు భారీగా వేశారు. టన్నుల కొద్దీ ఒడి బియ్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు. కాగా, మొదటి రోజు రూ.3 కోట్ల 15 లక్షల 40 వేల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మొదటి రోజు ఆదాయాన్ని అధికారులు ఎండోమెంట్ అకౌంట్‌లో జమ చేశారు. లెక్కింపు ప్రక్రియను దేవాదాయ శాఖ డిప్యూటీ, అడిషనల్ కమిషనర్లు శ్రీకాంతరావు, సునీత పర్యవేక్షిస్తున్నారు.
బంగారు భరిణెలు.. వెండి ఊయలలు..
జాతరలో చాలా మంది భక్తులు తమ మొక్కుల్లో భాగంగా బంగారు, వెండి అభరణాలను హుండీల్లో వేశారు. లెక్కింపు సమయంలో ప్రతి బాక్స్‌లో బంగారు తాళిబొట్లు, కుంకుమ భరిణెలు, కడియాలు బయటపడుతున్నాయి. వెండితో చేసిన ఊయలలు, సమ్మక్క సారలమ్మ తల్లుల కన్నుల రూపాలు, నాగుపాము ముద్రలు, ఇంటి బొమ్మలు.. తదితరాలు కానుకలుగా వచ్చాయి. వాటిని ప్రత్యేక హుండీలో వేసి, తాళాలు వేసి భద్రపరిచారు.
జాతరకు వచ్చిన కొందరు విదేశీ భక్తులతో పాటు ఇతర దేశాలకు వెళ్లి ఇండియాకు తిరిగొచ్చిన తెలంగాణ భక్తులు కూడా మొక్కుల కింద ఫారిన్ కరెన్సీని హుండీల్లో కానుకలుగా సమర్పించారు. ఇలాంటి వందల కొద్దీ నోట్లు బయటపడ్తున్నాయి. మరికొందరు భక్తులు బ్యాన్ చేసిన పాత రూ.500 వేశారు. రూ.2 వేల నోట్లను కూడా వేశారు. అంబేద్కర్ ఫొటోతో ముద్రించిన రూ.100 నకిలీ కరెన్సీ నోట్లు హుండీల్లో కనిపించాయి. కరెన్సీపై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని ఆ నోట్లపై రాశారు. కాగా, మేడారం జాతరలో మొత్తం 535 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. 518 హుండీలు పూర్తిగా నిండాయి. ఇందులో 482 ఐరన్, 34 క్లాత్, 2 ఒడి బియ్యం హుండీలు ఉన్నాయి. ఇంకా తిరుగువారం హుండీలు మండపానికి చేరుకోలేదు. గురువారం 134 హుండీలను తెరిచారు.
లెక్కింపు సిబ్బందికి డ్రెస్ కోడ్..
కానుకల లెక్కింపులో మొత్తం 400 మంది సిబ్బంది పాల్గొన్నారు. దేవాదాయ శాఖకు చెందిన 150 మందితో పాటు సేవా వాలంటీర్లుగా మరో 250 మంది వచ్చారు. మగ వారికి లుంగీ, బనియన్ డ్రెస్ కోడ్‌గా పెట్టారు. పోలీస్ సిబ్బంది తనిఖీలు చేశాకే సిబ్బందిని కౌంటింగ్ హాల్‌లోకి అనుమతిస్తున్నారు. మహిళలు సాధారణ చీరల్లోనే లెక్కింపునకు అనుమతించారు. వీరిని మహిళా కానిస్టేబుళ్లతో చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. లెక్కింపులో పాల్గొనేవారు చేతివాటం ప్రదర్శించకుండా అధికారులు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
మెయిన్ డోర్ వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. కానుకల రూపంలో వచ్చిన కరెన్సీని బ్యాంకర్లు తీసుకొచ్చిన కౌంటింగ్ మిషన్లతో లెక్కిస్తున్నారు. అమ్మవార్ల కానుకలు లెక్కించడానికి గతంలో రెండు వారాల సమయం పట్టగా.. ఈసారి వారంలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
చిల్లర లెక్కింపు కోసం మిషన్లు..
జాతరలో భాగంగా భక్తులు వేసిన చిల్లర నాణేలతో చిన్న చిన్న డ్రమ్ములు నిండుతున్నాయి. అయితే, చిల్లర నాణేల లెక్కింపు అధికారులకు తలనొప్పిగా మారేది. అయితే, ఈసారి కాయిన్స్ లెక్కించడానికి ప్రత్యేకంగా మిషన్లు తయారు చేయించారు. కాయిన్ సైజ్ ఆధారంగా నాణేలను ఆ మిషన్లలో వేయగానే అవి సపరేట్ అవుతున్నాయి. దీంతో లెక్కించడానికి సులభం అవుతుంది. గతంలో భారీ మొత్తంలో వస్తున్న రూపాయి, రూ.2, రూ.5, రూ.10.. నాణేలను వేరుచేసి లెక్కించడానికి అదనంగా నాలుగైదు రోజుల సమయం పట్టేది. అదే సమయంలో భక్తులు మొక్కుల రూపంలో వేసిన పచ్చని ఒడి బియాన్ని జల్లెడ సాయంతో వేరు చేసి బస్తాల్లో నింపుతున్నారు.