మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ఓ రైతు కిరోసిన్ తో వచ్చి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మేడ్చల్ మండలంలోని రాజ బొల్లారం గ్రామానికి చెందిన గంగారం అనే వ్యక్తి కుటుంబ సభ్యులకు 207 సర్వే నెంబర్ లో 18 ఎకరాల 5 గుంటల భూమి ఉంది. ఆ భూమిని అదే గ్రామానికి చెందిన వారికి కౌలుకు ఇచ్చి.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పుట్టగూడెం తండాకు వలస వెళ్లారు.
అయితే.. కొన్నాళ్ల తర్వాత గంగారం కుటుంబ సభ్యులు రాజ బొల్లారం గ్రామానికి వెళ్లి చూసే సరికి తమ భూమిలో కౌలుకు ఇచ్చిన వారు కాకుండా వేరే వారు కబ్జాలో ఉన్నారు. ఇదేంటని అడిగితే తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని గంగారం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ భూమిలో కబ్జాలో ఉన్నవాళ్లు రికార్డులను తారుమారు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి గంగారం కుటుంబ సభ్యులు వెళ్లారు. అయితే.. తమను ఎవరూ పట్టించుకోలేదని ఆరోపిస్తూ.. గంగారాం తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను తనపై పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అక్కడే పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే గంగారంను శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.