
తేలిన మృతదేహాలు, బయటపడుతున్న వాహనాలు
సర్వం కోల్పోయి విలపిస్తున్న బాధితులు
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్ష బీభత్సం
జయశంకర్ భూపాలపల్లి/ఏటూరునాగారం, వెలుగు : జయశంకర్భూపాలపల్లి, ములుగు జిల్లాలో వర్షం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రధానంగా మోరంచపల్లితో పాటు కొండాయి గ్రామాలు అతలాకుతలమయ్యాయి. వరదలో మునిగి విలవిల్లాడాయి. పదుల సంఖ్యలో కొట్టుకుపోయిన జనాలు చెట్టుకొకరు..పుట్టకొకరు చొప్పున శవాలుగా బయటపడ్డారు. దొరకని వాళ్ల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. గొడ్డు, గోదా గంగలో కలిశాయి. ప్రవాహంలో కలిసిన వాహనాలు ఎక్కడెక్కడో తేలి కనిపిస్తున్నాయి.
వాన గెరువివ్వడంతో అడుగు తీసి అడుగేద్దామంటే మోకాలి లోతు బురద. వంట చేసుకుందామంటే సామాన్లు లేవు. బియ్యం, ఉప్పులు, పప్పులు అన్నీ నాశనమయ్యాయి. తిందామంటే తిండి లేదు. ఎవరిని కదిలించిన కన్నీరే సమాధానంగా వస్తోంది. మరోవైపు పార్టీల నేతలు పరామర్శలకు వస్తుండగా, ఆఫీసర్లు పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు.
‘మోరంచపల్లి’ కోలుకునేదెప్పుడు?
శుక్రవారం వరద తగ్గుముఖం పట్టడంతో మోరంచపల్లి వాసులంతా ఇండ్లకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో మూడు, నాలుగు ఫీట్ల ఎత్తుతో బురద కనిపించింది. వంట సామాగ్రి నాశనమైంది. బియ్యం బస్తాలు తడిసి పోయాయి. వడ్ల బస్తాలు కొట్టుకుపోయాయి. నిల్వ చేసిన పత్తి తడిసింది. పాత ఇండ్ల గోడలు కూలిపోయాయి. వరద ఉధృతికి స్లాబ్ ఇండ్లు కూడా దెబ్బతిన్నాయి. ఇండ్లను శుభ్రం చేసుకోవడం గ్రామస్తులకు తలకు మించిన భారంగా మారింది.
గ్రామంలో150కి పైగా పశువుల కళేబరాలు కనిపించాయి. ఇంటిముందు కట్టేసిన పశువులు వరదలో చిక్కుకొని ఊపిరాడక చనిపోయాయి. పశువుల కళేబరాలు ఉబ్చిపోయి దుర్గంధం వస్తుండడంతో ఆఫీసర్లు జేసీబీలతో ట్రాక్టర్లలో ఎక్కించి దూరంగా తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. గ్రామంలోని 10 ట్రాక్టర్లు, నాలుగు కార్లు, 15 ట్రాలీ ఆటోలు, యాభైకి పైగా టూవీలర్లు కొట్టుకుపోయాయి.
టూ వీలర్లయితే అర కిలోమీటర్ దూరంలోని పంట చేలల్లో కన్పించాయి. వరద బాధితులను జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యవతిరాథోడ్ పరామర్శించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్గండ్ర జ్యోతి బాధితులతో మాట్లాడి గ్రామంలోని అందరికీ నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి రూ.10 లక్షల సాయం అందించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్బాధితులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
బీజేపీ లీడర్ చందుపట్ల కీర్తిరెడ్డి వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందచేశారు. వ్యాధులు ప్రబలకుండా భూపాలపల్లి మున్సిపల్, వివిధ గ్రామ పంచాయతీలలకు చెందిన 150 మంది పనులు చేస్తున్నారు. రోడ్ల వెంట ఉన్న బురదను తొలగించడంతో పాటు ఊరంతా బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. మోరంచవాగు దగ్గర కొట్టుకుపోయిన నేషనల్ హైవేకు రిపేర్లు చేయిస్తున్నారు.
కొండాయిలో..
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామాన్ని వరద చుట్టుముట్టడంతో గురువారం మధ్యాహ్నం 60 మంది పంచాయతీ బిల్డింగ్‌పైకి ఎక్కి సర్కారు సాయం కోసం ఎదురుచూశారు. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లకు సమాచారమిచ్చినా ఎవరూ అక్కడికి చేరుకోలేదు. దీంతో సాయంకాలం ఎనిమిది మంది వరదను దాటడానికి ప్రయత్నించి కొట్టుకుపోయారు. దీంతో మిగతా వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎవరికి తోచిన విధంగా వారు ప్రాణాలను కాపాడుకోవడానికి చెట్లు, బిల్డింగులు ఎక్కి తల దాచుకున్నారు. ఎనిమిది మంది గల్లంతైన విషయం తెలిసి కూడా అధికార యంత్రాంగం కొండాయికి చేరుకోలేదు.
దీంతో గురువారం రాత్రంతా మిగిలిన వాళ్లు జాగారం చేయాల్సి వచ్చింది. తినడానికి తిండిలేక.. తాగడానికి నీళ్లు కూడా ఇబ్బందులు పడ్డారు. సుమారు 12 గంటల పాటు ఎక్కడి వాళ్లు అక్కడే ఉన్నారు. వరద తగ్గాక కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గాష్ ఆలం శుక్రవారం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఉదయం 11 గంటల తర్వాత బోట్ల సహాయంతో బాధితులను జంపన్నవాగు దాటించారు. తర్వాత ఏటూరునాగారానికి తరలించారు. అక్కడే వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు అందించారు. తర్వాత వైటీసీ బిల్డింగ్‌లో వారందరికి పునారావాసం కల్పించారు.
వంతెన కూలడం వల్ల చేరుకోలేకపోయాం!
దొడ్ల, కొండాయి మధ్యలోని జంపన్న వాగు వంతెన కూలిపోవడంతో గురువారం సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. వరద తీవ్రత తగ్గడంతో శుక్రవారం డిజాస్టర్అండ్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి రక్షణ చర్యలను చేపట్టాం. వంతెన కూలి రవాణా సౌకర్యం లేకపోవడంతో బాధితులకు శుక్రవారం ఉదయం హెలికాప్టర్ ద్వారా ఆహారం, మంచినీళ్లు అందించాం.
‒ఇలా త్రిపాఠి, ములుగు జిల్లా కలెక్టర్