- ప్రభావం చూపనున్న గౌడ్స్, పద్మశాలి, యాదవులు
- మొత్తం 2.41 లక్షల ఓటర్లలో లక్ష దాకా వీళ్లే
- ఆ వర్గాలను తమవైపు తిప్పుకునే పనిలో ప్రధాన పార్టీలు
- ఆయా వర్గాల నేతలతో ప్రచారం
- గ్రామ స్థాయిలో దావత్ లు ఇస్తూ విందు రాజకీయాలు
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో గౌడ్స్, పద్మశాలి, యాదవులు కీలకంగా మారారు. నియోజకవర్గంలో మొత్తం 2.40 లక్షలకు పైగా ఓట్లు ఉండగా.. అందులో ఈ మూడు వర్గాల ఓట్లే లక్ష దాకా ఉన్నాయి. దీంతో ఇప్పుడు మునుగోడు రాజకీయమంతా ఈ మూడు కులాల చుట్టే తిరుగుతోంది. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఈ వర్గాల ఓట్లు ఉండడంతో.. ఆయా వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. పద్మశాలిలను ప్రసన్నం చేసుకునేందుకు చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేనేత బీమాను ప్రకటించారు. అదే సామాజిక వర్గానికి చెందిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై బాపూజీ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇవన్నీ కూడా ఉప ఎన్నికలో పద్మశాలి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బూర నర్సయ్య పార్టీని వీడడంతో ఆ వర్గం ఓట్లను కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బూర నర్సయ్య పార్టీని వీడిన 24 గంటల్లోనే అదే సామాజిక వర్గానికి చెందిన చండూరు ఎంపీపీ కల్యాణిని పార్టీలో చేర్చుకుంది. మంత్రి జగదీశ్ రెడ్డి కూడా తన ఎన్నికల షెడ్యూల్ ను పక్కన పెట్టి గౌడ సామాజిక వర్గం నేతలతో రోజంతా సమావేశమయ్యారు. వారి మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నం చేశారు.
సామాజిక వర్గాల నేతలతో ప్రచారం..
గౌడ్స్, పద్మశాలి, యాదవులను తమవైపు తిప్పుకునేందుకు ఆయా సామాజిక వర్గానికి చెందిన జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలను బీజేపీ, కాంగ్రెస్ రంగంలోకి దింపుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చౌటుప్పల్ లో జరిగిన యాదవుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ వర్గం ఓట్లు ఎంతో ముఖ్యమని గుర్తించిన బీజేపీ.. ఆ సామాజిక వర్గ కేంద్రమంత్రిని ప్రచారం కోసం ఇక్కడికి రప్పించింది. రానున్న రోజుల్లో మరికొంత మంది కేంద్ర మంత్రులను ప్రచారానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మూడు కులాలకు చెందిన రాష్ట్ర నేతలను ప్రచారానికి పంపించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. ఇక ఈ రెండు పార్టీలు ఉప ఎన్నిక కోసం గ్రామ, మండల స్థాయి ఇన్ చార్జ్ బాధ్యతలను ఈ వర్గాల నేతలకే అప్పగించాయి. వాళ్లకు ఎన్నిక బాధ్యతలు అప్పగించి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
జోరుగా దావత్‌లు
అభ్యర్థి గెలుపులో ఈ మూడు కులాల ఓట్లే కీలకం కానున్నాయి. దీంతో ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గ్రామ స్థాయిలో ఆయా వర్గాల నేతలతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. వాళ్లకు దావత్ లు ఇస్తూ విందు రాజకీయాలు చేస్తున్నాయి. మూడు పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ఈ మూడు సామాజిక వర్గాల ఓటర్లను దృష్టి లో పెట్టుకొనే మాట్లాడుతున్నారు.