మునుగోడులో రోజంతా పైసల పంచాది

  • రూ.3 వేల నుంచి రూ. 5 వేలు పంచిన ప్రధాన పార్టీలు 
  • చెప్పినన్ని డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్ల ఆందోళనలు 
  • ఓటుకు రూ.50 వేలు, తులం బంగారం ఏదంటూ నిలదీత
  • చౌటుప్పల్​లో ఎమ్మెల్యే స్టిక్కర్​ ఉన్న కారులో డబ్బు తరలిస్తున్నారంటూ బీజేపీ ఆందోళన

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు : మునుగోడులో ప్రచార పర్వం ముగిశాక ప్రలోభాల పర్వం ఊపందుకుంది. మంగళవారం సాయంత్రం నుంచే రెండు ప్రధాన పార్టీలు ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేయగా, మరో పార్టీ ఓటుకు రూ.వెయ్యి ఇచ్చింది. నియోజకవర్గంలో బుధవారం రోజంతా ఏ పార్టీ ఎన్ని పైసలు ఇచ్చింది? ఎందరికి అందినయి? అనే చర్చే జోరుగా సాగింది. అయితే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈసారి ఒక్కో ఓటుకు రూ.50 వేలు ఇస్తారని, తులం బంగారం పంచుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో మునుగోడు ఓటర్లు కూడా పోలింగ్ కు ఒకట్రెండు రోజుల ముందు తమకు పెద్ద ఎత్తున డబ్బులు, బంగారం అందుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ తీరా డబ్బుల పంపిణీ టైమ్ వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది.

ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు మాత్రమే ఇవ్వడంతో చాలా మంది ఓటర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇన్ని రోజులు ఓటుకు రూ.50 వేలు, తులం బంగారం అని చెప్పి.. రూ.3 వేలు ఇవ్వడమేమిటని నాయకులను నిలదీశారు. రూ.10 వేలు పంచమని పార్టీ నాయకులు పంపితే లోకల్ లీడర్లు కొన్ని పైసలు నొక్కేసి రూ.3 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. మరికొన్ని చోట్ల అసలు డబ్బులే అందకపోవడంతో గుంపులుగా చేరి ఆందోళనలకు దిగారు. హుజూరాబాద్ లో ఓ ప్రధాన పార్టీ ఓటుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు కవర్లలో పెట్టి పంచిందని, మునుగోడుకు వచ్చేసరికి రూ.3 వేలతోనే ఎందుకు సరిపెడుతున్నారని ప్రశ్నించారు. మునుగోడులో జరుగుతున్న పైసల లొల్లి లీడర్లకు తలనొప్పిగా మారగా.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

మునుగోడులోనే టీఆర్ఎస్ నాన్ లోకల్ నేతలు..
ఎన్నికల రూల్స్ ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత నాన్ లోకల్ లీడర్స్ ఎవరూ నియోజకవర్గంలో ఉండొద్దనే నిబంధన ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్ నేతలు అవేమీ పట్టించుకోవడం లేదు. గ్రామాలకు ఇన్ చార్జులుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సమీపంలోని హోటళ్లు, ఫామ్ హౌస్ లు, తోటల్లో మకాం వేసి.. తమ అనుచరులను మాత్రం ఊళ్లలోనే ఉంచి వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు మండలం కోతులారంలో సుమారు 3‌0 మంది టీఆర్ఎస్ నాయకులు ఓ ఇంట్లో ఉండిపోయారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇన్ చార్జిగా ఉన్న ఈ గ్రామంలో పోల్ మేనేజ్ మెంట్ కోసమే వారిని ఉంచి వెళ్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న గ్రామస్తులు వారు ఉన్న ఇంట్లోకి వెళ్లి మీరెందుకు ఇంకా ఉన్నారని నిలదీసి బయటకు పంపారు.

గ్రామాల్లో ఆందోళనలు..
ఓటుకు తులం ఇస్తారనుకుంటే ఇవ్వలేదని మునుగోడు మండలం కొరిటికల్ గ్రామంలో మహిళలు కనిపించిన నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఒకే బజార్ లో కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చండూరు మున్సిపాలిటీలోనూ డబ్బుల పంపిణీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలను పలు చోట్ల మహిళలు నిలదీశారు. ఓటుకు రూ.50 వేలు ఇస్తారనుకుంటే రూ.3 వేలు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో తర్వాత చూద్దామంటూ నాయకులు బతిలాడి చేతిలో పెట్టినట్లు తెలిసింది. అలాగే చౌటుప్పల్ లోని 13వ వార్డులో ఓ కుటుంబంలోని నలుగురికి ఓటుకు రూ.3 వేల చొప్పున రూ.12 వేలు ఇచ్చిన టీఆర్ఎస్ నాయకులు.. ఆ ఓట్లు బీజేపీకే పడతాయని భావించి మళ్లీ వెనక్కి తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మర్రిగూడెం మండలం లెంకలపల్లిలో ఓటింగ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ ప్రధాన పార్టీ కొందరు ఓటర్లకు రూ.20 వేలు పంచినట్లు  ప్రచారం జరుగుతోంది.