నాంపల్లి మండల కేంద్రంలో మహిళా ఓటర్లు బారులు తీరారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతులు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. ఓటు వేసేందుకు మహిళలు భారీగా తరలి వస్తున్నారు. ఎక్కువ మంది వస్తుండటంతో క్యూ పెరిగింది. ఓటు వేసేందుకు గంటకు పైగా సమయం పడుతుందని, పోలింగ్ స్లోగా జరుగుతుందని ఓటర్లు చెప్తున్నారు. ఎవరు గెలిచినా తమ ఊరి సమస్యలు పరిష్కరించాలని కోరకుంటున్నామని మహిళా ఓటర్లు అంటున్నారు.
మునుగోడు బైపోల్ లో భారీగా ఓటింగ్ నమోదవుతోంది. ఒంటి గంట వరకు 41.3 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 2 లక్షల 41 వేల 805 ఓటర్లు ఉంటే... ఒంటి గంట వరకు 99 వేల 780 మంది ఓటు వేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఇంకా పెద్ద ఎత్తున ఓటు వేస్తారన్న అంచనాలైతే ఉన్నాయి. 2018 ఎన్నికల్లో 91.38 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి ఈ బైపోల్ ప్రతిష్ఠాత్మకంగా మారడంతో హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ మునుగోడు ఓటర్లను ప్రత్యేకంగా రప్పించారు. దీంతో ఈసారి మరింత పోలింగ్ శాతం పెరుగుతుందన్న అంచనాలున్నాయి. సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు.